6tvnews

collapse
...
Home / జాతీయం / Festival: ధాన్యలక్ష్మికి స్వాగతం ...

Festival: ధాన్యలక్ష్మికి స్వాగతం ...

2022-01-14  News Desk

sankranthi rush
 

మకర సంక్రాంతి వేడుకలు. తెలుగు ప్రజల పల్లె సీమల సంబురాలు మిన్నంటే వేళ ఇది. ప్రతి ఏటా జనవరి 14వ తేదీన సూర్యమానం ప్రకారం ఈ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వేరే వేరు పేర్లతో ఇదే రోజున సంబరాలు అట్టహాసంగా జరుగుతాయి. సాధారణంగా వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో ఈ పండుగ ప్రధానంగా పంటలు చేతికి అందివచ్చే వేళలోనే నిర్వహిస్తారు. ఈ కారణంగా ఇది సాదా పదాల లో చెప్పాలంచే రైతన్నల ఆనంద హేలకు నిదర్శనం.  

వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లు

అస్సాంలో మాఘ బిహు లేదా భోగాలి బిహు, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాలలో సక్రాంత్ లేదా మక్రాంత్, హిమాచల్ ప్రదేశ్ లో మాఘ సాజి,  పంజాబ్, హర్యానాలలో మాఘి లేదా లోహరి లేదా సక్రాంత్, తమిళనాడు, పాండిచ్చేరిలో పొంగల్, పశ్చిమ బెంగాల్ లో పౌష్య సంక్రాంతి, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాలలోనూ, కర్నాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర లలోమకర సంక్రాంతి, గుజరాత్, డయ్యూ, దామన్ ప్రాంతాలలో ఉత్తరాయణ్, కాశ్మీర్ ప్రాంతంలో శిశుర్ సంక్రాంత్ - ఇలా రకరకాల పేర్లతో సూర్యమానం ప్రాతిపదికన పర్వదినంగా మాత్రమే కాకుండా వ్యవసాయ ధాన్యలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ అత్యుత్సాహంతో వేడుకలు నిర్వహించుకుంటారు.  

గాలిపటాల వేడుక…

సస్య లక్ష్మికి స్వాగతం పలకడంతో పాటు ఈ పండగ వేళ అత్యుత్సాహంగా జరిగే ప్రధానమైన వేడుక గాలిపటాల ఎగుర వేత. రంగురంగుల పతంగులు నిర్మలంగా ఉన్న ఆకాశంలో పైకి కిందకు, అటూ ఇటూ ఊగిసలాడుతూ, ఎన్నెన్నో హోయగాలతో చేసే విన్యాసాలు యువతకు అతి పెద్ద ఆకర్షణ. చాలా చోట్ల ఈ గాలి పటాల ఎగరవేత పందేలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. సాధారణంగా ఇదే రోజున అంతర్జాతీయ స్థాయిలో కూడా పంతగుల పోటీలు జరగడం సర్వ సాధారణం. మన తెలుగు రాష్ట్రాలలోనూ, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలలో జరిగే గాలి పటాల పోటీలు చూసి తీరవలసినదే. అస్సాంలో బిహూ వేడుకలు ఏడాదిలో మూడు సార్లు జరుపుకుంటారు. జనవరిలో భోగాలి లేదా మాఘ బిహు పేరుతోను, ఏప్రిల్ లో బోహాగ్ బిహు లేదా రొంగాలి పేరుతోను, కొంగలి లేదా కాళీ బిహు పేరుతో అక్టోబరులోనూ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు.  

పండగ అనగానే స్వీట్లు, రకరకాల పిండి వంటలు మాత్రమే సాధారణ నగరపజీవికి తెలుసు. కానీ, పల్లె ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో కూడా ప్రజల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేసే సందర్భం ఇది. సూర్య కిరణాలు మన శరీరానికి నేరుగా సాధ్యమైనంత ఎక్కువ సేపు సోకడం వల్ల ఆరోగ్యం భద్రంగా ఉంటుందనే విశ్వాసం కూడా గాలి పటాల వెనుక ఒక కారణంగా చెబుతారు. సూర్య కిరణాలు మన శరీరానికి అత్యవసరమైన డి విటమిన్ అందిస్తాయనే సంగతి ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఈ రోజు నుంచి సూర్యతాపం క్రమంగా పెరుగుతూ వస్తుంది. సూర్యుడి కరుణతోనే పంటలు సమృద్ధిగా పండుతాయి. మన ఆరోగ్యం సాఫీగా ఉంటుంది.  

దక్షిణాయనం ముగిసి ఉత్తరాయ పుణ్యకాలం ప్రారంభానికి చిహ్నమైన సూర్యుడి మకర రాశి ప్రవేశం సందర్భంలో పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం హిందువులు అత్యంత పవిత్య కార్యంగా భావిస్తారు.  

 


2022-01-14  News Desk