గోవా. దేశ ప్రజలు ఈ ప్రాంతంలో పర్యటించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. దేశంలోని అతి ముఖ్యమైన పర్యటక ప్రదేశాల్లో టాప్ లో ఉంటుంది. భారతీయులు మాత్రమే కాదు.. విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడుతుంటారు. ఇక్కడి అందాలను తిలకించి సంతోషపడుతారు. అందమైన బీచ్ లు, పడవలు, కాసినోలతో పాటు అద్భుతమైన సీనరీలు.. అచ్చం సినిమాల్లో చూసిన మాదిరిగానే కనిపిస్తాయి. ఎన్నో పర్యాటక ఆకర్షణలతో జనాలను ఎంతో అలరిస్తుంది. ఒకవేళ మీరు కూడా గోవాకు వెళ్లాలి అనుకుంటే.. ఈ ప్రదేశాలను మిస్ కాకుండా చూడండి..
*మసాలా దినుసుల తోటలు
గోవా సమీపంలోని అనేక గ్రామాల్లో మసాల దినుసుల పెంపకం కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో అడుగు పెట్టగానే మొదటకు దర్శనం ఇచ్చేవి మసాలా దినుసుల తోటలే. వేలాది ఎకరాల్లో మసాల తోటలు అద్భుతమైన వాసనలను వెదజల్లుతాయి. గోవా రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో 'సవోయి తోటలు' ఉంటాయి. ఇవి గోవా రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన తోటలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడ వివిధ రకాల మసాలా దినుసుల తోటలతో పాటు కొబ్బరి, నట్స్, పైనాపిల్స్ లాంటి పండ్ల తోటల పెంపకం కొనసాగుతుంది. ఈ తోటలను సందర్శించిన పర్యాటకులు ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తారు. అంతేకాదు.. ఇక్కడ ఏనుగులతో ఆడుకునే అవకాశం ఉంటుంది.
*బటర్‌ఫ్లై కన్జర్వేటరీ
4 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో బటర్ ఫ్లై కన్జర్వేటరీ ఆఫ్ గోవా ఉంటుంది. ఇక్కడ కృతిమంగా సన్నటి నీటి ప్రవాహాలతో పాటు చెరువులను ఏర్పాటు చేశారు. గోవా వెళితే బటర్ ఫ్లై కన్జర్వేటరీ ఆఫ్ గోవా తప్పక చూసి ఆనందించవచ్చు. గోవాలోని సుగంధ ద్రవ్యాల తోటల నుండి తిరిగి వస్తున్నప్పుడు.. బటర్‌ఫ్లై కన్జర్వేటరీకి వెళ్లొచ్చు. ఇందులో అద్భుతమైన సీతాకోక చిలుకలతో పాటు అందమైన జీవులను తిలకించే అవకాశం ఉంటుంది.
*అద్భతమైన దీవులు
గోవా అంటేనే ఇసుకతో కూడిన అందమైన బీచ్ లకు మారుపేరు. గోవాలో అద్భుతమైన ద్వీపాలు ఉన్నాయి. వీటిలో ల్యాండ్ స్కేప్‌లో ఉన్న పాత పోర్చుగీస్-శైలి ఇండ్లు అత్యంత ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అంతేకాదు.. ఇక్కడి జలాల్లో చిన్న పడవలపై తెడ్డు సహాయంతో ప్రయాణం మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఒకరు లేదంటే ఇద్దరు మాత్రమే కూర్చునే వీలున్న ఈ చిన్న పడవలనే కయాక్ అని పిలుస్తారు. వీటిపై ప్రయాణాన్ని కయాకింగ్ అంటారు. గోవాలోని మండోవి నది, జువారీ నది, నెరుల్ వంటి తదితర నదీ జలలపై ఈ ఆటను బాగా ఎంజాయ్ చేస్తుంటారు.
*కాబో డి రామ
కాబో డి రామ గోవాలోని పురాతన కోటలలో ఒకటి. ఇది పోర్చుగీస్ వారు నిర్మించిన ప్రార్థనా మందిరం. వానలు కురిసే సమయంలో ఈ ప్రదేశం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలి, అంతకు మించి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది.
*టోడో జలపాతాలు
గోవాలోని నేత్రావళి పట్టణంలో టోడో జలపాతాలు ఉన్నాయి. గోవాలోని దట్టమైన అడవుల గుండా ఈ జలపాతాలు వెళ్తాయి. టోడో జలపాతాలను చేరుకునే వరకు సహజ సుందరమైన అందాలను ఆస్వాదించవచ్చు. వెళ్తే దారిలో అద్భుతమైన చిన్న ప్రవాహాలు చూపరులను ఆకట్టుకుంటాయి.