Courtesy:Twitter/@ens_socialis
కొన్ని పాటల్ని వింటుంటే మనసు తేలిపోతుంది. తనువు పరవశించిపోతుంది. ఆ పాటలు అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది. అలా మన మనసుల్లో చెరగని ముద్ర వేసే గాయకులు కొందరే ఉంటారు. ఆ జన్మ, ఆ గొంతు వారికొక వరం. అంతే. అలాంటి అరుదైన గాయకుడు మహమ్మద్ రఫీ. భారతదేశంలో లెజెండ్ సింగర్స్ లో రఫీ ఒకరైన మహమ్మద్ రఫీ– బాలీవుడ్ లో తొలితరం గాయకుడు కె ఎల్ సైగల్ తర్వాత మహమ్మద్ రఫీ కొన్ని దశాబ్దాలపాటు హిందీ సినిమాను ఏలారు. బాలీవుడ్ సినిమా పాటలపై రఫీ ప్రభావం మాటల్లో చెప్పలేనిది. ఎందరో గాయకులు రఫీని ఇమిటేట్ చేస్తూ పాడుతున్నారు.
రఫీ వాయిస్ ఏ రేంజ్ లో అయినా పలికేది. మంద్రస్వరంతో పాడినా, ఆరోహణ క్రమంలో హై పిచ్ లో పాడినా చక్కగా వినసొంపుగా ఉండేది. రఫీ గొంతుకలో వైవిధ్యం ఉంది. సాధారణంగా సింగర్స్ రొమాంటిక్ సాంగ్స్ ఎక్కువ పాడతారు. కానీ రఫీ దేశభక్తి గీతాలు, కవ్వాలీలు, గజల్స్, భజనలు, శాస్త్రీయసంగీతంలో కూడా పాడారు. హిందీలో ఓల్డ్ జనరేషన్ హీరోల్లో దాదాపు అందరికీ రఫీ ఆలపించారు. రఫీ పాటలో స్పెషాలిటీ ఏమిటంటే, ఏ హీరోకు పాడినా ఆ హీరో సొంతంగా పాడినట్టు అనిపించేది. పైగా ఆ హీరో లిప్ సింకింగ్ స్టైల్ కు, యాక్షన్ కు తగ్గట్టు పాడారు. డ్యూయెట్స్, ట్రాజెడీ సాంగ్స్, కామెడీతో పాటు స్పీడ్ సాంగ్స్ కూడా గానం చేశారు.
తెలుగులో సీనియర్ ఎన్ టి రామారావు నటించిన భలేతమ్ముడు, ఆరాధన సినిమాల్లో ఎన్టీఆర్ కు ప్లేబ్యాక్ సింగర్ రఫీ.
హిందీలో వెయ్యి సినిమాలకు…
రఫీ వెయ్యి హిందీ సినిమాల్లో పాటలు పాడారు. అలాగే పంజాబీ, ఉర్దూ, తెలుగు, ఒడియా, బెంగాలీ, మరాఠీ, సింధీ, గుజరాతీ, కన్నడ, తమిళం, కొంకణి, అస్సామీస్, భోజ్ పురి, మగహి, మైథిలి వంటి భారతీయ భాషల్లో కూడా తన గానధారను ప్రవహింపచేశారు. అంతేకాదు… ఇంగ్లీష్, పార్సీ, అరబిక్, సింహళ, మారిషియన్, డచ్ వంటి కొన్ని విదేశీ భాషల్లోనూ గానం చేశారు. తన కెరీర్ లో 7000కు పైగా పాటలు ఆలపించారు.
కుటుంబ నేపథ్యం:
మహమ్మద్ రఫీ 1924 డిసెంబర్ 24న పుట్టారు. ఆయన పుట్టిన తేదీ, పుట్టిన సంవత్సరం ఒకే నంబర్ కావడం విశేషం. ఆయన తండ్రి హాజీ అలీ మహమ్మద్ కు ఆరుగురు సంతానం. రఫీ రెండోవారు. పంజాబ్ అమృతసర్ జిల్లాలోని కోట్లా సుల్తాన్ సింగ్ రఫీ స్వస్థలం. చిన్నప్పుడు ఆయనను ఫీకో అని పిలిచేవారు. బాల్యంలో సుల్తాన్ సింగ్ విలేజ్ లో ఉంటున్నప్పుడు ఓ ఫకీర్ కీర్తనలు పాడుతూ ఆ గ్రామంలో తిరిగేవాడు. అది చూసి రఫీకి కూడా పాడాలనిపించింది. ఆ పాటల్ని అనుకరిస్తూ పాడుతుండేవారు.
1935 లో వాళ్ల కుటుంబం లాహోర్ వెళ్లింది. తండ్రి నూర్ మొహల్లాలో ఓ బార్బర్ షాప్ నడిపేవారు. ఆ సమయంలోనే … ఉస్తాద్ అబ్దుల్ వాహిద్ ఖాన్, పండిట్ జీవన్ లాల్ మాటూ, ఫిరోజ్ నిజామీల దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. 13వ ఏటనే లాహోర్ లో రఫీ స్టేజి మీద పాడారు.1941లో ఆయన ప్లేబాక్ సింగర్ అయ్యారు. పంజాబీ సినిమా ‘గుల్ బలోచ్’ లో జీనత్ బేగమ్ తో కలిసి ‘సోనియే నీ, హీరియే నీ’ అనే పాట పాడారు. అదే రఫీ మొదటి సినిమా పాట. ఆ సినిమా 1944లో వచ్చింది. అదే సంవత్సరం లాహోర్ రేడియో స్టేషన్ రఫీని పాటలు పాడ్డానికి ఆహ్వానించింది.
హిందీ సినిమాల్లోకి …
1944లో ఆయన బొంబాయికి (ముంబయి) వచ్చారు. భెండీ బజార్ లో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని ఉండేవారు. ప్రముఖ కవి తన్వీర్ నక్వీ ఆయనను అబ్దుర్ రషీద్ కర్దార్, మెహబూబ్ ఖాన్, నజీర్ మొదలైన నిర్మాతలకు పరిచయం చేశారు. లాహోర్ లో పరిచయమైన శ్యామ్ సుందర్ అనే ఆయన రఫీకి మొదటి సినిమా అవకాశం ఇప్పించారు. గాయని దురానీతో కలిసి ‘గావో కీ గోరీ’ సినిమాలో ‘అజీ దిల్ హో కాబూ మే తో దిల్ దార్ కీ అయిసీ తైసీ’ అని డ్యూయెట్ పాడారు రఫీ.
నౌషాద్ తో…
బాలీవుడ్ సంగీత దిగ్గజం నౌషాద్ సంగీత దర్శకత్వంలో రఫీ ‘మేరె సప్నోంకీ రాణీ’, ‘రూహీ రూహీ’ వంటి ఎన్నో పాటలు ఆలపించారు. నౌషాద్ మ్యూజిక్ లో రఫీ మొదటి పాట ‘హిందుస్థాన్ కె హమ్ హై’. రఫీ లతామంగేష్కర్ తో ఎక్కువ పాటలు పాడారు. కొన్ని దశాబ్దాలపాటు వీరిద్దరి పాటలు లేని హిందీ సినిమా లేదు. అయితే, రఫీ అంతకు ముందు తొలితరం ప్రసిద్ధ గాయని నూర్జహాన్ తో కలిసి చాలా పాటలు పాడారు.
రఫీ మ్యూజిక్ డైరెక్టర్లు
ఎస్ డి బర్మన్, శంకర్ జైకిషన్, రవి, మదన్ మోహన్, ఓపి నయ్యర్. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ వంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ బాణీలకు రఫీ అజరామరమైన పాటల్ని ఆలపించారు. ఆయన పాటలు సంగీత దర్శకుల్ని ఎంతగా ప్రభావితం చేశాయంటే … ఓసారి ఓపి నయ్యర్ –‘రఫీ లేకుంటే ఓపీ నయ్యర్ లేడు’ అన్నారు. ఈ ఒక్క సర్టిఫికేట్ చాలు. ఎస్ డి బర్మన్ తో 37 సినిమాలకు పనిచేసిన రఫీ, ప్యాసా, కాగజ్ కె ఫూల్. కాలాబజార్, నౌ దో గ్యారా, కాలాపానీ, తేరె ఘర్ కె సామ్నే, గైడ్. ఆరాధన, ఇష్క్ పర్ జోర్ నహీ, అభిమాన్ సినిమాలకు పాడిన పాటలు ఎవర్ గ్రీన్.
దేవానంద్, గురుదత్ ల సినిమాలకు రఫీ పాటలు ప్రాణం పోశాయి. దిలీప్ కుమార్ సినిమాలకూ రఫీ అద్భుతమైన పాటలు పాడారు. ఒక్క మాటలో చెప్పాలంటే రఫీ అటు సంగీత దర్శకులకూ, ఇటు హీరోలకూ ఫేవరేట్. మహమ్మద్ రఫీ ప్లేస్ ను ఎవరూ ఫిలప్ చేయలేరు. ఒక రఫీ. ..ఒకే ఒక్క రఫీ. అంతే.
-వి. మధుసూదనరావు.