తెలంగాణా రాజధాని నగరం హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలు దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘమైన చరిత్ర ఉన్నటువంటిది. హైదరాబాద్ పేరు ఇన్నేండ్లుగా దేశవిదేశాల్లో విస్తృతంగా ప్రచారం పొందింది. ఆర్ఎస్ఎస్-బిజిపి వర్గాలు కొన్ని సంవత్సరాలుగా నగరం పేరును మార్చివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కొద్ది సంవత్సరాలకు ముందు జరిగిన నగర పాలిక సంస్థల ఎఎన్నికల సమయంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారాల కోసం నగరానికి వచ్చారు. ఆయన తన రాష్ట్రంలో చాలా నగరాల పేర్లు మార్చివేసి ఒక ప్రత్యేక ఒరవడి ప్రారంభించారు. అదే తరహాలో మన రాష్ట్రం వచ్చిన సమయంలో కూడా హైదరాబాద్ పూర్వపు పేరు భాగ్యనగరం అనీ, అందువల్ల దాని పేరును ఆ మేరకు మార్చివేయాల్సిన అవసరం ఉందని గొంతెత్తి వినిపించారు. దాదాపు అదే సమయంలో బిజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఆయన వాదనతు మద్దతుగా నిలిచి నగరం పేరు మార్చివేయాలని అవకాశం దొరికినప్పుడల్లా వివాదం రేకెత్తిస్తున్నారు.
ఇన్నేళ్ల తరువాత మరోసారి ఈ అంశం రచ్చకెక్కనున్నది. ముఖ్యంగా కొత్త సంవత్సరం జనవరి 5-7 తేదీల (2022) మధ్య ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థల విస్తృత సమావేశం జరగనున్నది. ఈ సమన్వయ బైఠక్ (కో ఆర్డినేషన్ మీటింగా) సమావేశానికి ఆర్ఎస్ఎస్ అధినేత శ్రీ మోహన్ భగవత్, బిజేపి అధ్యక్షుడు జె.పి. నడ్డా, ఇంకా మరి కొందరు ప్రముఖులతో పాటు దాదాపు 35 అనుబంధ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. ఈ సమావేశం వేదికగా నగరం పేరును భాగ్యనగరంగా మార్చాలనే ఆలోచనపై చర్చ జరగవచ్చునని సమాచారం. అయితే కొంత మంది చారిత్రిక పరిశోధకులు ఈ నగరానికి ఏనాడూ భాగ్యనగరం అనే పేరు లేదని అంటున్నారు.
హైదరాబాద్ నగర చరిత్ర
గోల్కొండ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబుల పాలన అంటే 1591 నాటికి అధికారంలో ఉన్న కులీ కుతుబ్ షా హయాంలో నూతన నగర నిర్మాణం జరిగింది. దీనికి హైదరాబాద్ అనే పేరు రావడానికి కారణం – నవాబు ప్రియ భార్యలలో ఒకరు భాగమతి అనీ, వివాహం (ఇస్లాం స్వీకరించిన) తరువాత ఆమె పేరు హైదర్ మీద హైదరాబాదుగా మారిందని కొందరి వాదన. అయితే చరిత్రకారుల అధ్యయనాలలో ఎక్కడా భాగమతి ప్రస్తావన లేదు. నవాబు భార్యలుగా ప్రముఖంగా వినిపించే పేర్లు తారామతి, పెమ్మామతి మాత్రమే అని వారు అంటున్నారు. ఉర్దూలో బాగ్ అనే పదానికి తోటలు అనే అర్థం ఉన్నదని, నగరం చుట్టూ తోటలు ఎక్కువగా ఉన్న కారణంగా ఫ్రెంచి చరిత్రకారులు ఎక్కువగా బాగ్ అనే వ్యవహరించారని వారు వివరిస్తున్నారు.
ఎక్కడిదీ భాగమతి?
ఎక్కువగా కవుల కవితల్లో, కొన్ని జానపద గీతాలలో భాగమతి-నవాబుల ప్రణయ కలాపాల గురించిన ప్రస్తావన వస్తుంది. ఆమె నవాబును వివాహం చేసుకున్నదని, ఆమె పేరున తొలి సంవత్సరాలలో దీనికి భాగ్యనగరం అని పేరు వాడుకలో ఉండేదని తాజాగా వినవస్తున్న వాదం. కానీ ప్రస్తవాన ఎక్కడ ఎలా ప్రారంభమయినా, హైదరాబాద్ నగరాభివృద్ధి గురించి మాట్లాడే ప్రతీ సందర్భంలోనూ దీనిని భాగ్యనగరంఅని వ్యవహరించడం సర్వసాధారణం. ఇదివరలో ఎమ్మెల్. రాజా సింగ్ అయినా, 2020 సమయంలో యోగి ఆదిత్యనాథ్ గట్టిగా వినిపించినా ఈ అంశం మరోసారి పెద్ద ఎత్తున చర్చకు రానున్నది.