హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పలువురు ప్రముఖుల పిల్లల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. అవన్నీ నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేశారు. ఈ అత్యాచార ఘటనలో రాష్ట్ర హోంమంత్రి మనువడితో పాటు ఓ ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం ఉందనేది అవాస్తవం అని వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ స్పష్టంచేశారు. సీసీ టీవీ ఫుటేజీలో హోంమంత్రి మనువడు ఎక్కడా కనిపించలేదని వెల్లడించారు. బాలిక అత్యాచార ఘటనపై ఆయన పలు విషయాలు వెల్లడించారు.
*మే 31న ఫిర్యాదు
బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు ఆమె తండ్రి మే 31న కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. వెంటనే జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశామన్నారు.సెక్షన్ 354, పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేసినట్లు జోయల్ వెల్లడించారు. మే 28న అత్యాచార ఘటన జరిగిందని ఫిర్యాదులో బాలిక తండ్రి తెలిపినట్లు చెప్పారు. ఈ ఘటన తర్వాత రెండురోజులు బాలిక షాక్‌లో ఉందని వెల్లడించారు. మహిళా పోలీసులతో బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు. అయితే నిందితుల్లో ఒకరి పేరు మాత్రమే బాలిక చెప్పగలిగిందన్నారు.
*ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు
అటు విచారణలో గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారిలో ఐదుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించినట్లు జోయల్ తెలిపారు. ఈ ఐదుగురిలో ఇద్దరు మేజర్లు కగా, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిసిందన్నారు. భరోసా కేంద్రంలో బాలికకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే భరోసా కేంద్రం అధికారులు బాలిక వాంగ్మూలం రికార్డు చేసినట్లు చెప్పారు. నిందితుల వివరాలను బాలిక చెప్పలేకపోయిందని జోయల్ డేవిస్ తెలిపారు. బాలిక వాంగ్మూలం తర్వాత కేసులో సెక్షన్లను మార్చామని వెల్లడించారు. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో మైనర్ నిందితుడిని ఆ కుటుంబం కస్టడీలోనే ఉంచామన్నారు. మరో ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి విచారణ చేస్తున్నారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పక్కా సాంకేతిక ఆధారాలున్నాయని జోయల్ డేవిస్ తెలిపారు. మరోసారి బాలికను విచారించి పూర్తి ఆధారాలను సేకరిస్తామన్నారు.
*ఎమ్మెల్యే కొడుకు లేడు..
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మొదటి నుంచి ఆధారాలు సేకరించినట్లు జోయల్ డేవిస్ చెప్పారు. ఎమ్మెల్యే కొడుకుకు సంబంధించిన ఆధారాలు కూడా లభించలేదని స్పష్టంచేశారు. ఆధారాలు లేకుండా వ్యక్తులపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ప్రమేయంలేనివారి పేర్లు చెబితే వారి భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ ఘటనలో ప్రముఖ వ్యక్తి కొడుకు ప్రమేయం ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఆ ప్రముఖ వ్యక్తి కొడుకు మైనర్ కాబట్టి పేరు వెల్లడించడం లేదని జోయల్ డేవిస్ తెలిపారు.
*పీఎస్ ఎదుట బీజేపీ దర్నా
అటు బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితుల విషయంలో పోలీసుల అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ బీజేపీ నాయకులు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. హోంమంత్రి పీఏ దగ్గరుండి బాలికను పబ్‌లోకి పంపించాడని విమర్శించారు. హోం మంత్రి మనవడి పాత్రపైనా విచారణ జరిపించాలని కోరారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
*ఎవరైనా వదలొద్దు..
బాలిక పై అత్యాచారం కేసులో నిందితులు ఎవరైనా వదిలిపెట్టొద్దని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా డీజీపీ, హైదరాబాద్ కమిషనర్‌ను ఆదేశించారు. హైదరాబాద్‌లో బాలిక పై గ్యాంగ్ రేప్ తనను షాక్ గురిచేసిందని ఆయన వెల్లడించారు.