ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ముగింపు వేడుకలు జరగనున్నాయి. అంగరంగ వైభవంగా జరిగే ఈ ముగింపు వేడుకలలో భారత సంగీత దిగ్గజం ఏఆర్ రెహ్మాన్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నాడు. రెహ్మాన్‌తో పాటు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ప్రముఖ నటి ఊర్వశి రౌటేలా కూడా తన డాన్సులతో ప్రేక్షకులను అలరించున్నట్లు సమాచారం. 2018 తర్వాత ముగింపు వేడుకలు జరగడం ఇదే తొలిసారి కావడంతో భారీ స్థాయిలో కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
6.30 గంటలకు ముగింపు వేడుకలు
సాయంత్రం 6.30 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభం అవుతాయి. 45 నిమిషాల పాటు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన రెహ్మాన్ ట్విట్టర్లో ఓ వీడియో అప్లోడ్ చేశాడు. ఐపీఎల్ ప్రారంభమై 15 సంవత్సరాలు అయిందని...భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతోందని తెలిపాడు. ఐపీఎల్ ముగింపు వేడుకల సందర్భంగా భారత క్రికెట్ ప్రయాణాన్నిప్రేక్షకులకు అందించనున్నట్లు రెహ్మాన్ తెలిపాడు.
ముగింపు వేడుకలకు వస్తున్న పెద్దలు ఎవరంటే..
నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకలకు బీసీసీఐ పెద్దలతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరౌతున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో పాటు బీసీసీఐ సెక్రటరీ జై షా, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్‌లతో పాటు మిగతా బోర్డు సభ్యులు కూడా హాజరు కానున్నారు.
ముగింపు వేడుకల్లో పాల్గొనాలని టీమిండియా మాజీ కెప్టెన్లందరికీ బీసీసీఐ ఆహ్వానాలు పంపింది.
కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న ఆజాదీకి అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా ఐపీఎల్ ముగింపు వేడుకలను 75వ స్వాతంత్ర వేడుకలకు అంకితం ఇవ్వనున్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన లెజెండరీ డాన్స్ Chhauకార్యక్రమం ముగింపు వేడుకల్లో ప్రేక్షకులను అలరించనుంది.
A.R రెహ్మన్, రణవీర్ సింగ్‌లతో పాటు ప్రముఖ నటి ఊర్వశి రౌటేలా కూడా ముగింపు వేడుకల్లో తన డాన్స్ లతో మరింత వేడిపుట్టించనుంది.
ప్రధాని వచ్చే అవకాశం
ఐపీఎల్ ముగింపు వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఈ విషయాన్ని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
రాత్రి 8 గంటలకు ఫైనల్ మ్యాచ్
హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్ జట్టు తుదిపోరులో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. సమవుజ్జీల మధ్య పోరు ఆసక్తికరంగా జరగనుందని క్రికెట్ విశ్లేషకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో గుజరాత్ జట్టు టాప్ పొజిషన్లో నిలవగా..రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిలిచింది. ఈ టాప్ 2 టీమ్స్ ఫైనల్లో తలపడడం క్రికెట్ ప్రేమికులకు చెప్పలేని ఆనందాన్ని ఇవ్వనుంది.
Watch me live at the Closing Ceremony for Tata IPL Final 2022 at the magnificent arena, the Narendra Modi Stadium in Ahmedabad as well as live on Star Sports & Disney+Hotstar at 6.25 pm on 29th May. #TATAIPL#TATAIPLFINAL
— A.R.Rahman (@arrahman) May 27, 2022