Courtesy:iplt20.com
ఐపీఎల్ టోర్నమెంట్ 2022లో ఆడుతున్న విదేశీ ప్లేయర్లలో శ్రీలంక ప్లేయర్లు తమ సత్తా చాటుతున్నారు. హసరంగా, దుష్మంత్ చమీరా, తీక్షణ, రాజపక్స వంటి శ్రీలంక ప్లేయర్లు ఈ సారి ఐపీఎల్ టోర్నీలో మెరుపులు మెరిపిస్తున్నారు.
గతంలో లంకన్ ప్లేయర్లపై శీతకన్ను
2020 ఐపీఎల్ వేలంలో లంకన్ క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. ఫ్రాంచైజీలు వారిపై శీతకన్ను వేశాయి. కేవలం ఒకే ఒక్క లంకన్ ప్లేయర్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ RCB తీసుకుంది. కేవలం 50 లక్షలకు మాత్రమే దక్కించుకున్నారు. 2021 ఆక్షన్‌లో ఒక్కరంటే ఒక్కరిని కూడా ఫ్రాంచైజీలు తీసుకోలేదు. గత ఏడాది ఐపీఎల్ సెకండ్ హాఫ్ సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టులోకి హసరంగా వచ్చి చేరాడు. దుష్మంత్ చమీరా కూడా వచ్చి చేరాడు.
గత జూలై నుంచి కనిపించిన మార్పు
గత ఏడాది జూలై నెలలో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఆ జట్టును నేరుగా పరిశీలించే అవకాశం కలిగింది. ఆ జట్టులోని ప్లేయర్లు ఏవిధంగా రాటుదేలారో ప్రపంచానికి తెలిసివచ్చింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఓ కన్ను వేశాయి. ఈ ఏడాది జరిగిన వేలంలో వారిలో కొందరికి పెద్ద పీట వేశాయి. 23 మంది శ్రీలంక ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో ఐదుగురికి మాత్రమే ఛాన్స్ లభించింది. వారిలో నలుగురు జాక్‌పాట్ కొట్టారు.
జాక్‌పాట్ కొట్టిన హసరంగా
హసరంగాను 10 కోట్ల 75 లక్షలు వెచ్చించి ఆర్సీబీ దక్కించుకుంది. ఈ నిర్ణయంపై బెంగళూర్ జట్టు అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మన దేశంలో చాలా మంది స్పిన్నర్లు ఉండగా.. ఓ విదేశీ స్పిన్నర్‌ను తీసుకోవడం వారికి నచ్చలేదు. అదే సమయంలో యజువేంద్ర చాహల్‌ను కూడా ఆర్సీబీ జట్టు రిటైన్ చేసుకోలేదు. దీంతో బెంగళూర్ జట్టుపై విమర్శలు ఎక్కువయ్యాయి. హసరంగా మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. ఈ టోర్నీలో సత్తా చాటడం ద్వారా విమర్శకుల నోళ్లు మూయించాడు. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ద్వారా తన సత్తా చాటుతున్నాడు. 12 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. పర్పల్ క్యాప్ రేసులో ముందున్నాడు.
తీక్షణ
మరో లంకన్ ప్లేయర్ తీక్షణ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. మొదట్లో అతడిని పక్కన పెట్టిన CSK ఆ తర్వాత అవకాశం ఇచ్చింది. 8 మ్యాచులు ఆడిన తీక్షణ 12 వికెట్లు తీశాడు. ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లకు పరుగులు చేయకుండా ఆపడంలో విజయం సాధిస్తున్నాడు. ప్రస్తుతం చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.
దుష్మంత చమీరా
మరో లంకన్ ప్లేయర్ దుష్మంత చమీరా ప్రస్తుతం లక్నో జట్టులో ఉన్నాడు. తన వంతు పాత్రను పోషిస్తున్నాడు. మంచి వేరియేషన్‌తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధులను ఇబ్బంది పెడుతున్నాడు.
రాజపక్సా
మరో లంకన్ ప్లేయర్ రాజపక్సా పంజాబ్ టీమ్‌లో ఉన్నాడు. టోర్నీ ఆరంభం నుంచి మంచి బ్యాటింగ్ నైపుణ్యం కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు 13 సిక్సర్లు కొట్టాడు. 166 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు.
30 మంది శ్రీలంక క్రికెటర్లు
ఐపీఎల్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు 30 మంది శ్రీలంక క్రికెటర్లు వివిధ ఐపీఎల్ టోర్నమెంట్లలో ఆడారు. వీళ్లల్లో ప్రముఖంగా వినిపించే పేరు లసిత్ మలింగ. యార్కర్ల స్పెషలిస్ట్ అయిన మలింగ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టేవాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన మలింగ ఆ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
జయవర్ధనే, సంగక్కర కూడా ఐపీఎల్ టోర్నీలలో తమ మార్క్ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అభిమానులను కొన్ని సంవత్సరాల పాటు అలరించారు. డెక్కన్ ఛార్జెస్, సన్‌రైజర్స్ జట్లను లీడ్ చేశాడు. మరో లంక ఆటగాడు.. యాంజిలో మాథ్యూస్ కూడా పూణె వారియర్స్ జట్టు తరపున ఆడాడు. వీరితో పాటు చమిండా వాస్ వంటి లెజెండ్స్ కూడా ఐపీఎల్ ఆడారు.
ముంబై ఇండియన్స్ జట్టుకు మహేళే జయవర్ధనే కోచ్‌గా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంగక్కర కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ముత్తయ్య మురళీధరన్ ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ విభాగంలో ఉన్నాడు. మరో లెజెండరీ లంకన్ క్రికెటర్ లసిత్ మలింగ్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.