collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / KAKINADA: కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి.. అటవీ అధికారులకు చిక్కేనా? - 6TV News : Telugu in News | Telugu N...

KAKINADA: కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి.. అటవీ అధికారులకు చిక్కేనా?

2022-06-02  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

TIGER-2
కాకినాడ జనాల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఓ పెద్దపులి. ఎప్పుడు, ఎటువైపు నుంచి వచ్చి దాడి చేసుందోనని జనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. కంటికి కనిపించకుండా వరుస దాడులకు పాల్పడుతోంది పెద్దపులి. ఎలా ఉంటుందో తెలియదు.. ఎప్పుడు వస్తుందో తెలియదు.. కానీ పశువులపై దాడి చేసి చంపేస్తుంది. తాజాగా పాండవులపాలెం-పొదురుపాక సమీపంలో ఆవును చంపింది. ఉదరవాడ మెట్ట మీద రెస్ట్ తీసుకుంటున్న పెద్ద పులి..  రాత్రి వేళ వేటకు బయల్దేరుతుంది. అందులో భాగంగానే తాజాగా ఆవును చంపేసింది. ఘటనా ప్రాంతంలో పులి పాదాల అచ్చులు పెద్ద పరిమాణంలో ఉండటంతో జనాలు మరింత భయపడుతున్నారు.

*వారం రోజులుగా సంచారం 
గడిచిన వారం రోజులుగా పులి సంచారంతో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.  వారం రోజుల కిందట ఒమ్మంగిలో తొలిసారి కనిపించిన పులి.. తాజాగా పొదురుపాకలో దాడికి దిగింది. ఆ తర్వాత పులి రాజ ఒమ్మంగి వైపు నుంచి విశాఖ వైపు వెళ్లినట్లు తెలుస్తుంది. అలా వెళ్తే ప్రత్తిపాడు మండల ప్రజలకు  ఇబ్బంది లేనట్లే అని స్థానికులు అనుకుంటున్నారు.  అయితే, పులి ఎప్పుడు, ఎటువైపు వెళ్తుందో అధికారులకు సైతం తెలియడం లేదు. జనాలకు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.  

*కచ్చితంగా బెంగాల్ టైగరే! 
ఉదరవాడ మెట్ట దగ్గర తిరిగింది బెంగాల్ రాయల్ టైగర్ అని అధికారులు నిర్ధారణకు వచ్చారు. కానీ  దాని జాడను కనిపెట్టలేకపోతున్నారు. వాస్తవానికి పెద్దపులిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. పెద్ద పులలకు సంబంధించి అటవీశాఖ అధికారులు ప్రొటోకాల్ ఉంటుంది. మిగిలిన జంతువుల మాదిరి బెదిరించి పట్టుకునే అవకాశం ఉండదు అంటున్నారు అధికారులు. దానికి కారణం పెద్దపులి జాతీయ జంతువు కావడం.  దాన్ని పట్టుకోవాలంటే కచ్చితంగా నేషనల్ టైగర్‌ కన్జర్వేటివ్‌ అథారిటీ రూల్స్‌ పాటించి తీరాల్సిందే.

*పెద్దపులిని పట్టుకోవాలంటే ఎన్నో రూల్స్.. 
నిబంధనల ప్రకారం పెద్దపులికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫారెస్ట్ అధికారులు పట్టుకోవాలి.  గాయాలు కాకుండా బోనులోకి వచ్చేలా చూడాలి. మరీ ఎక్కువ ఇబ్బంది పెడితే మత్తు మందు ఇవ్వొచ్చు. అయితే తగిన మోతాదులో మాత్రమే ఇవ్వాలి.  మత్తు మూలంగా ఎలాంటి ఇబ్బందులకు పెద్దపులి గురి కాకూడదు.  పట్టుకున్న తర్వాత అది ఎక్కడ ఉండేదో.. అక్కడే మళ్లీ వదిలేయాలి. ఒకవేళ పెద్దపులి.. అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోతే దాన్ని పట్టుకోవడానికి వీళ్లేదు.  ఈ నేపథ్యంలోనే కాకినాడలో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునే విషయంలో అటవీశాఖ అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.  

*పెద్దపులి ఎలా వచ్చింది? 
వాస్తవానికి కాకినాడ ఏరియాలో అటవీ ప్రాంతం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా మైదాన ప్రాంతమే ఉంటుంది. పత్తిపాడు కూడా మైదాన ప్రాంతమే.. ఒమ్మంగి శివారులో మాత్రమే కొద్దిపాటి అటవీ ప్రాంతం ఉంది. దానికి ఆనుకుని పెద్ద అడవి కూడా లేదు. ఈ ప్రాతంలోకి బెంగాల్ టైగర్ ఎలా వచ్చిందనేది అటవీ అధికారులకు సైతం అంతుచిక్కకుండా ఉంది. ఈ ప్రాంతానికి పెద్ద పులి రావాలంటే కేవలం రంపచోడవరం ఏజెన్సీ నుంచే రావాలి. కానీ.. ఇక్కడికి రావాలంటే సుమారు 80 కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. మధ్యలో అడవులు కూడా లేవు. పలు గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలోకి పెద్దపులి ఎలా వచ్చింది? అనే విషయాన్ని తెలుసుకోలేక.. అటవీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  2022-06-02  News Desk