గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. తాజాగా టీమిండియా మాజీ కీపర్ కిరణ్ మోరే ఈ బరోడా ఆటగాడిని పొగడ్తలతో ముంచెత్తాడు. హార్ధిక్ పాండ్యా 4 డైమెన్షన్ ప్లేయర అని అన్నాడు. గుజరాత్ జట్టును విజయపథంలో నడిపించిన తీరును ప్రశంసించాడు. ఎటువంటి అంచనాలు లేని జట్టును ఛాంపియన్‌గా నిలిపాడని మోరే అన్నాడు.
ఐపీఎల్ సీజన్ 15లో గుజరాత్ జట్టు ఆడిన తీరు నాకెంతో నచ్చింది. ఆ జట్టంతా కలిసికట్టుగా ఆడి అద్భుతాలు సాధించింది. హర్ధిక్ పాండ్యా గుజరాత్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం...ట్రోపీని అందుకోవడం..వ్యక్తిగత ప్రదర్శన కూడా అద్భుతంగా చేయడం ఇవన్నీ నాకెంతో నచ్చాయి. అని కిరణ్ మోరే తెలిపాడు. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి గుజరాత్ టీమ్‌కి వెళ్లడం...కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం..ఆ జట్టును ఛాంపియన్‌గా తీర్చిదిద్దడం మామూలు విషయాలు కావంటూ కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు.
అతని కళ్లల్లో కసి కనిపించేది
హార్ధిక్ పాండ్యా క్రికెట్ ఆడిన తొలిరోజులను కిరణ్ మోరే గుర్తుచేసుకున్నాడు. తాను నిర్వహించే క్రికెట్ అకాడమీకి కృనాల్ పాండ్యా వచ్చేవాడు. అన్నతో పాటు తమ్ముడు హార్ధిక్ పాండ్యా కూడా అక్కడికి వచ్చేవాడు. నెట్స్ వెనకాల పరిగెత్తడం, బాల్‌ను క్యాచులు పట్టడం వంటివి చేస్తుండేవాడు. ఆ సమయంలోనే అతడిని కూడా ఆడించమని కృనాల్ పాండ్యాకు సలహా ఇచ్చాను. పాండ్యా కళ్లల్లో కసి కనిపించేది. ఎల్లప్పుడూ మెరుగ్గా ఆడడానికి కోరుకునే వాడు.
4 డైమెన్షనల్ ప్లేయర్
హార్ధిక్ పాండ్యా కొన్ని నెలల క్రితం వరకు 3 డైమన్షనల్ ప్లేయర్ మాత్రమే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మాత్రమే చేసేవాడు. ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు కూడా నెరవేరుస్తున్నాడు. అటువంటి టాలెంటెడ్ ప్లేయర్ భారత జట్టులో ఉండడం గర్వకారణమని కిరణ్ మోరే అన్నాడు.
పడిలేచిన కెరటం హార్ధిక్ పాండ్యా
హార్ధిక్ పాండ్యా కొన్ని నెలల క్రితం వరకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. గాయాల కారణంగా బౌలింగ్ వేయగలిగేవాడు కాదు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు అతడిని రిటైన్ చేయలేదు. వేలానికి వదిలేసింది. వేలంలో గుజరాత్ జట్టు హార్ధిక్ పాండ్యాను దక్కించుకుంది. ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కొత్త జట్టుకు కొత్త కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా అందరి అంచనాలను తారుమారు చేశాడు. స్టార్ ప్లేయర్లు ఎవ్వరూ లేకుండా ఆ జట్టు ఏమేరకు ఆడగలతో అని అనేక మంది సందేహం వ్యక్తం చేశారు. పాయింట్ల పట్టికలో చివర్లో నిలుస్తుందని అవహేళన చేశారు. కానీ వారి అంచనాలన్నీ తప్పయ్యాయి. టోర్నీ ప్రారంభమైన కొద్ది రోజులకే తమ సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి తెలియజెప్పింది గుజరాత్ టీమ్. వరుస విజయాలు సాధించి లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచింది. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లోను, ఫైనల్ మ్యాచ్‌లోనూ ప్రత్యర్ధులకు చెక్ పెట్టింది. కొత్త ఛాంపియన్‌గా అవతరించింది.
ఫలించిన వ్యూహం..బౌలర్లే ఆయుధం
ఐపీఎల్ టోర్నీ అంటేనే ఫోర్లు, సిక్సులు, భారీ స్కోర్లు. బ్యాటర్లపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఫ్రాంచైజీ ఓనర్లు కూడా బ్యాటర్లను ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ హార్ధిక్ పాండ్యా కొత్తగా ఆలోచించాడు. తన జట్టు హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాతో కలిసి పటిష్టమైన బౌలింగ్ యూనిట్‌ను తయారు చేశాడు. తనతో పాటు మరో ఐదుగురు బౌలర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండేవిధంగా వ్యూహాలు తయారు చేసుకున్నాడు. బౌలర్లే తమ జట్టు ఆయధం అని గర్వంగా ప్రకటించారు. అనుకున్న విధంగా విజయం సాధించాడు. క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు.