కేంద్రపాలితప్రాంతంగా ఉన్న లడఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ అంశంపై లోక్ సభలో వాయిదా తీర్మానం కూడా ప్రవేశపెట్టడమే కాకుండా సభా కార్యక్రమాలను సస్పెండ్ చేసి లడఖ్‌కి రాష్ట్ర ప్రతిపత్తిపై చర్చించాలని, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చాలని రాహుల్ డిమాండ్ చేశారు.
రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370ని 35ఏ ని రద్దుచేసిన కేంద్రప్రభుత్వం జమ్మూ కశ్మీర్ ప్రత్యేక పత్తిపత్తిని తొలగించి ఆ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని లడఖ్ వాసులు చాలామంది స్వాగతించారు. కానీ తమకు రాష్ట్రపత్తి కావాలని వీరు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగానే పార్లమెంటులో ఈ అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన రాహుల్, లద్దాఖ్ లోని నా సోదరసోదరీమణులు ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న పోరాటాన్ని చర్చకు పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. పార్లమెంటులో లద్దాఖ్ ప్రజల హక్కులను లేవనెత్తాలని, వారి పోరాటానికి మద్దతివ్వాలని నేను కోరుకున్నాను కానీ కేంద్రప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదని రాహుల్ వాపోయారు. కాగా రాహుల్ లద్దాఖ్ రాష్ట్రప్రతిపత్తిపై సమర్పించిన వాయిదా తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.
తన వాయిదా తీర్మానంలో రాహుల్ గాంధీ లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని రెండు కీలక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలతో కమిటీ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. బుద్దిస్ట్ మెజారిటీ ఉన్న లేహ్, ముస్లిం మెజారిటీ ఉన్న కార్గిల్ మధ్య విభజన సృష్టించి లద్దాఖ్ లో రాజకీయ క్రీడ మొదలెట్టాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.
రాహుల్ ప్రవేశ పెట్టిన తీర్మానం, లడఖ్‌కి రాష్ట్రప్రతిపత్తి కల్పిస్తూ భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో దాన్ని చేర్చాలని డిమాండ్ చేసింది. లద్దాఖ్ లోని లేహ్, కార్గిల్ రెండు ప్రాంతాలకు చెందిన ప్రతినిధులతో కమిటీ ఏర్పర్చి ఈ విషయమై చర్చించాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
పార్లమెంట్ ను నడపాల్సింది అధికారపక్షమే….
‘‘పార్లమెంటులో ఈ చర్చను లేవనెత్తి లద్దాఖ్ వాసులకు మద్దతు నివ్వాలని భావించాను కానీ దురదృష్టవశాత్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై కనీస చర్చకు కూడా అంగీకరించేలేదు. అందుకే లద్దాఖ్ లోని ప్రతి ఒక్కరికీ నేను సందేశం పంపుతున్నాను. మేం మీతో ఉన్నాం. మీ సమస్యను ప్రతి వేదికలోనూ లేవనెత్తుతాం’’ అని రాహుల్ అభయమిచ్చారు.
పార్లమెంటును నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కానీ ప్రతిపక్షానికి కాదని రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. లఖీంపూర్ ఘటన, లడఖ్ రాష్ట్రప్రతిపత్తితో సహా ముఖ్యమైన అంశాలన్నింటిపై చర్చ జరగాలని మేం కోరుకున్నాం. కానీ రైతుల సమస్యతో సహా దేనిపైనా చర్చించడానికి కేంద్రం సిద్దం కాకపోవడమే కాక వాయిదా తీర్మానాలను కూడా తిరస్కరిస్తోందని రాహుల్ ఆరోపించారు.
కార్గిల్ ప్రజలు కేంద్రపాలిత ప్రతిపత్తిని కోరుకునే వారు కాదు. కానీ లేహ్ ప్రజలు మాత్రం దాన్ని కోరుకున్నారు. కానీ కేంద్రపాలిత ప్రాంతం అనేది ప్రజలకు సాధికారత కల్పించలేదని వారు గుర్తించారు. కాబట్టే వారు కూడా ఇప్పుడు లడఖ్‌కి రాష్ట్రప్రతిపత్తి కోరుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూనే కార్గిల్ నాయకత్వం రాష్ట్ర ప్రతిపత్తికి మద్దతు పలుకుతోందని రాహుల్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పుడు లేహ్ ప్రాంతం దానికి మద్దతు పలకగా, కార్గిల్ ప్రాంతం దాన్ని వ్యతిరేకించడం తెలిసిందే.