నూతన ఆవిష్కరణలు, వ్యవస్థాపక సామర్ధ్యాన్నిపెంపొందించేందుకు వీలుగా 22 షెడ్యూల్ భాషలను భారత్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. దేశంలో తొలిసారిగా తీసుకువచ్చిన ఈ వెర్నాక్యులర్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్(విఐపి)ను నీతిఅయోగ్ ప్రారంభించింది.దీనివల్ల దేశంలో నూతన ఆలోచనలు,ఆవిష్కరణలు ఊపందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందుకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎఐఎం) లక్ష్యం మేరకు ఈ విఐపిని ప్రారంభించారు. షెడ్యూల్ చేసిన 22 భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు టాస్క్ ఫోర్స్ (విటిఎఫ్)ఏర్పాటు చేశారు. దీనిలో ప్రాంతీయ భాషా ఉపాధ్యాయులు, సబ్జెక్ట్ నిపుణులు, టెక్నికల్ రైటర్స్, ప్రాంతీయ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ల (ఎఐ సి) ప్రతినిధులు ఉంటారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషుతో పాటు 22భాషలు అందుబాటులోకి తెచ్చిన దేశంగా భారత్ అగ్రభాగాన ఉంటుంది. ఆ యా భాషలు, సంస్కృతులు, డిజైన్ కు సంబంధించిన ఆలోచనల విషయంలో విటిఎఫ్ కు శిక్షణ ఇచ్చేందుకు ఐఐటి ఢిల్లీ డిజైన్ డిపార్ట్ మెంట్ సహకారం తీసుకుంటారు. అలాగే మార్గదర్శకులనదగ్గ పారిశ్రామికవేత్తలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్ఆర్)లో భాగం గా తమ వంతు సహాకారం అందిస్తారు.
డిసెంబర్ 2021నుంచి ఏప్రిల్ 2022వరకు టాస్క్‌ఫోర్స్ శిక్షణను పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఎ ఐఎం మిషన్ డైరెక్టర్ చింతన్ వైష్ణవ్ మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు, వ్యవస్థాపక రంగంలో భాషా అవరోధాన్ని తగ్గించడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.భారత్ లో ఇంగ్లీషు భాష మాట్లాడే వారి సంఖ్య తక్కువగా ఉందని, మనం కూడా ఎందుకు సమాన అవకాశాలను సృష్టించకూడదు.. అందుకు ఈ ప్రోగ్రామ్ ఎంతో దోహదపడుతుందని వైష్ణవ్ అన్నారు.
భారతదేశంలో నూతన డిజైన్, ఆవిష్కరణ సామర్థ్యాలను విఐపి మెరుగు పరుస్తుందని,ఈ కార్యక్రమం నూతన ఆవిష్కరణలకుఊతం ఇస్తుందని నీతి అయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్, సిఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. ఔత్సాహికులకు, నిపుణులకు మధ్య బలమైన అనుసంధానం ఏర్పడేందుకు ఈ కార్యక్రమం ఎంతో సహాయపడుతుందన్నారు.