మిస్టర్ బీన్ ఫేమ్ రోవాన్ అట్కిన్సన్ ప్రధాన పాత్రలో నటించిన నెట్‌ఫ్లిక్స్ కామెడీ సిరీస్ మెన్ వర్సెస్ బీ ( MAN VS BEE). హౌస్-సిట్టర్ పాత్రలో రోవాన్ నటించిన ఈ హిల్లేరియస్ కామెడీ సిరీస్ ట్రైలర్ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. రోవాన్ అట్కిన్సన్‌ని ఒక తేనెటీగ ఎంత అరాచకంగా ఇబ్బందులు పెడుతుందో అనేదే ఈ ట్రైలర్ థీమ్. కోర్టులో దోషిగా జడ్జికి సమాధానం చెప్తున్న రోవాన్ అట్కిన్సన్ షాట్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ప్రమాదకరమైన డ్రైవింగ్, ఇంటికి నిప్పు పెట్టడం, ఆస్తులని ధ్వంసం చేయటం వంటి 14 అభియోగాలపై ఫిర్యాదులు రావటంతో కోర్టులో దోషిగా నిలబడతాడు హీరో రోవాన్ అట్కిన్సన్. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలంటూ జడ్జి ఆదేశించగా.. నేను అమాయకుడిని.. దీనికి అంతటికి కారణం ఒక తేనెటీగ అంటూ హీరో జడ్జికి సంజాయిషీ ఇవ్వటం నవ్వులు తెప్పిస్తుంది.
శాపంగా మారిన తేనెటీగ
అట్కిన్సన్ ఉనికికి శాపంగా మారిన తేనెటీగ ఎపిసోడ్స్ బావుంటాయి. ఒక తేనెటీగ మనిషిని ఏడ్పించే సీన్స్ చూస్తుంటే.. మన రాజమౌళి ఈగ సినిమా ఇండియన్ ఆడియన్స్ కి గుర్తొస్తుంది. విలన్ సుదీప్‌పై ఈగ రూపంలో హీరో నాని రివేంజ్ తీసుకోవటమే ఆ ఈగ కథాంశం అయితే.. మెన్ వర్సెస్ బీలో కూడా అచ్చం ఒక తేనెటీగ పగ పట్టినట్టు హీరో అట్కిన్సన్ ని ఆడుకుంటుంది. మరి తేనెటీగ అలా చేయటం వెనుక ఉద్దేశం ఏంటన్నది మాత్రం ట్రైలర్లో ఎక్కడ రివీల్ చేయరు. అయితే మిస్టర్ బీన్ పాత్రతో ప్రపంచ ఆడియన్స్ ని నవ్వుల్లో ముంచెత్తిన తరహాలో మాత్రం ఈ మెన్ వర్సెస్ బీ ఉండదు. మరి అంత భారీ అంచనాలు పెట్టుకుంటే మాత్రం బోల్తాపడినట్టే. ట్రైలర్ జస్ట్ యావరేజ్ అని టాక్ వచ్చేసింది. ట్రైలర్ చూస్తే మనకి కూడా అదే అభిప్రాయం కలుగుతుంది.
జూన్ 24నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
గ్రాండ్ పియానోలో తన చేతిని కొట్టడం, అతని మోకాలిని సుత్తితో కొట్టడం, కారును దాదాపుగా ఢీ కొట్టడం, తేనెటీగతో అరవటం వంటి అంశాలు ఆర్డినరీగానే ఉంటాయి. ఇక 10 బాగాలున్న ఈ సిరీస్ జూన్ 24నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. హీరో రోవాన్ తన గ్లోబల్ హిట్ మిస్టర్ బీన్‌ను గుర్తుచేసే సైలెంట్ కామెడీని చూపెట్టాలని ప్రయత్నం చేశాడు. చూద్దాం మరి పూర్తి సిరిస్‌లో కామెడీ పండుతుందో లేదో. బ్లాక్డాడర్ నటుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత విల్ డేవిస్‌తో కలిసి రోవాన్ అట్కిన్సన్ ఈ సిరీస్‌ని తెరకెక్కించాడు. రోవాన్తో పాటు గ్రీన్ వింగ్, జింగ్ లూసీ, జూలియన్ రిండ్-టట్, ఆఫ్టర్ లైఫ్ నటుడు టామ్ బాస్డెన్లు మెన్ వర్సెస్ బీలో నటించారు.