రోజు రోజుకు పడిపోతున్న రూపాయి విలువ.. దేశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ప్రధానంగా గృహోపకరణాలు, ఆయా ఎలక్ట్రానిక్స్ ధరలపై మరింత ఎఫెక్ట్ పడనుంది. ఈ కారణంగా మరికొద్ది రోజుల్లోనే టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. మే నెలాఖరులో లేదంటే జూన్ మొదటి వారంలో ఈ ధరల పెంపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 3 నుంచి 5 శాతం మేర ధరలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు.
*ధర పెంపునకు కారణం ఏంటంటే?
రూపాయి ధర పడిపోవడం మూలంగా తయారీ ఖర్చులు పెరుగుతున్నాయని ఆయనా కంపెనీలు చెప్తున్నాయి. ఈ పెరిగిన భారాన్ని వినియోగదారుల మీద మోపబోతున్నాయి. అంతకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదని చెప్తున్నాయి. దిగుమతి చేసుకునే స్పేర్ పార్ట్స్ ధర రోజు రోజుకు పెరిగిపోతుంది. అమెరికా డాలరు విలువతో పోల్చితే భారత కరెన్సీ విలువ నిత్యం పడిపోతుంది. ఈ కారణంగా తయారీ దారులకు ఇబ్బందిగా మారింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఎక్కువగా కీలక భాగాల దిగుమతిపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో దిగుమతి భారం పెరగడం వల్ల ధరల పెంపు అనివార్యం అంటున్నాయి ఆయా కంపెనీలు.
*చైనాలో కరోనా కేసులూ కారణమే..
ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. షాంఘైలో కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పోర్టుల్లో భారీ సంఖ్యలో కంటైనర్లు నిలిచిపోయాయి. దీంతో విడిభాగాల కొరత ఎక్కువగా ఏర్పడింది. దీనికి తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం పరిశ్రమకు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతోంది. ఈ విషయాన్ని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ముడిసరుకు ధరలు ఇప్పటికే పెరుగుతున్నాయని, అమెరికా డాలర్ విలువ మరింత పెరుగుతుందని CEAMA అధ్యక్షుడు ఎరిక్ బ్రెగన్జా తెలిపారు. ఇండియన్ రుపీ విలువ నిరంతరం క్షీణిస్తోందని తెలిపారు. అన్ని తయారీ కంపెనీలు ఇప్పుడు బాటమ్ లైన్ వైపు చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గృహోపకరణాలు, ఆయా ఎలక్ట్రానిక్స్ ధరలు జూన్ లో 3 నుంచి 5 శాతం వరకు ధరలు పెరగొచ్చని చెప్పారు.
ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తే వాషింగ్ మెషీన్లు, ఇతర ఉపకరణాలతో పాటు ఎయిర్ కండీషనర్లు రిఫ్రిజిరేటర్లు వంటి కూలింగ్ ఉత్పత్తుల్లో ధర పెరుగుదల ఉంటుదని తెలుస్తోంది. అయితే ఈ పెంపు భారీగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఏసీలను తయారు చేస్తున్న కొన్ని కంపెనీలు మే నెలలో ధరలను భారీగా పెంచాయి. ఇతర కంపెనీలు ఇప్పుడు, లేదంటే జూన్ వరకు ధరలను పెంచే అవకాశం ఉంది. ఇండియన్ రూపాయితో మారకంలో డాలర్ ఇప్పటికీ రూ.77.40 గా కొనసాగితే కంపెనీలకు కష్టమేనని బ్రెగాంజా అన్నారు. అందుకే ధరల పెరుగుదల అనివార్యం కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే నిత్యవసర ధరలు, గ్యాస్, పెట్రోల్, కరెంటు ధరల పెంపుతో నానా ఇబ్బందులు పడుతున్న మధ్య తరగతి జనాలు తాజాగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలకు కూడా పెరిగితే మరిన్ని ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తం అవుతోంది.