గత కొద్ది రోజుల కాలంలో రెండు చోట్ల సిక్కు ప్రార్థనా స్థలాలను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించిన ఆరోపణలు అటు పంజాబు రాష్ట్రాన్ని మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలజడికి కారణమవుతున్నాయి. అలాంటి ప్రయత్నాలు చేసిన ఇద్దరిని ఈ రెండు సంఘటనలలోనూ స్థానికంగా ఉన్న జనసమూహం నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపివేసింది. అలా అపవిత్రం చేసే ధోరణి స్పష్టం కాలేదని పోలీసులు బుకాయిస్తున్నట్లు కనిపిస్తోంది. దుండగులు దురుద్దేశం తోనే తమ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారని ఆ మత అనుచరులు చెపుతున్నారు.
ఈ సంఘటనలపై సిక్కుమత ఉన్నత స్థాయి సంస్థ శిరోమణి గురు ప్రబంధక్ కమిటీ (ఎస్ జీ పీ సీ)తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. ఎస్ జీ పీ సీ అధ్యక్షుడు హరి జిందర్ సింగ్ ధామి మాట్లాడుతూ ఈ ఘటనల వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో తక్షణం రకరకాలుగా స్పందించే స్వభావం ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు మౌనం వహిస్తున్నాయి. అందుకు కారణం త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏ రకంగా స్పందిస్తే ఏ వర్గానికి ఆగ్రహం వస్తుందో అన్న భయమే వారి మౌనానికి కారణంగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పక్షాన జరుగుతున్న దర్యాప్తు తీరు సంతృప్తికరంగా లేదని హరి జిందర్ సింగ్ ధామి అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవాలను వెలికి తెచ్చేందుకు ఎస్ జీ పీ సీ స్వయంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించనున్నదని ఆయన తెలిపారు.
స్వర్ణ దేవాలయంలో అగంతకుడు కమాండో శిక్షితుడు!
అమృతసర్ లోని స్వర్ణ దేవాలయం సంఘటనలో (శనివారం) మరణించిన వ్యక్తి కమాండో శిక్షణ పొందినట్లుగా కనిపిస్తోందని ధామి అనుమానం వ్యక్తంచేశారు. ప్రవేశించకుండా ఒక సారి అడ్డుకున్న తరువాత మరో సారి కాపాలాదారులు మారే వేళలో అతడు చేతిలో కత్తి పట్టుకుని చొరబడిన తీరు, అంతర్గతంగా ఏర్పాటుచేసిన రైలింగ్స్ పైనుంచి దుముకుతూ ఆ వ్యక్తి కేవలం ఆరు సెకన్లలో వేగంగా లోపలికి వచ్చిన తీరు అతడు కమాండో శిక్షితుడు కావచ్చని అనుమానాలకు కారణమని ఆయన అన్నారు. ఆత్మరక్షణ కోసం చంపివేయడం నేరం కాదని చట్టం కూడా చెబుతోందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. దురాగతానికి పాల్పడిన వ్యక్తిని కాపలాదారులు అదుపులోకి తీసుకునే లోపే అక్కడే ఉన్న జనం వెర్రి ఆవేశంతో అతడిపై దాడి చేసి చంపివేశారని ఆయన వివరించారు. గట్టిగా 24 గంటలు దాటకుండానే ఆదివారం సాయంకాలం కపుర్తలా గ్రామంలోని సిక్కు ఆలయంలోని జెండాను పీకివేయడానికి మరో వ్యక్తి ప్రయత్నించాడు. అతడిని కూడా అక్కడే ఉన్న జనం కొట్టి చంపివేశారు. ఆ ఇద్దరిని ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు.
మరింత భద్రతకు కేంద్రం ఆదేశాలు
ఈ రెండు సంఘటనలతో ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తాజా ఆదేశాలు జారీచేసింది. ప్రార్థనా కేంద్రాల వద్ద మరింత భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేయాలని కేంద్రం సూచించింది. సిక్కులకు పవిత్ర స్థలాలైన గురుద్వారాలు, డేరాలు, ఆలయాలు, తదితర ప్రార్థనా స్థలాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. త్వరలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్న సమయంలోవాతావరణంలో వైషమ్యాలను ప్రేరేపించడం వీటి ఉద్దేశం కావచ్చని హెచ్చరించింది. సీసీటీవీలను కూడా అమర్చాలని సూచించింది.
కాంగ్రెస్ స్పందన
రాష్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్ధూ స్పందిస్తూ, పవిత్ర స్థలాలను అపవిత్రం చేయాలనే ఆలోచన వెనుక కుట్ర కోణం ఉండవచ్చని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడమే దుండగుల లక్ష్యం కావచ్చని అన్నారు. ఇతర పార్టీలు కూడా ఈ రెండు సంఘటనలపై ఆందోళన వ్యక్తంచేశాయి. అయితే నాగరిక సమాజంలో అనుమానితులపై జనం దాడి చేసి చంపివేయడం సబబు కాదని వ్యాఖ్యానించాయి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ పై అకల్ తఖ్త్ జతేదారు స్పందిస్తూ తమ మత విశ్వాసాలను కించపరిచే వారిని క్షమించి వదిలేయాలనడం సబబుకాదని అన్నారు. అలాంటి వారిపై సరైన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.