collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / Rushikonda: ఎట్టిపరిస్థితుల్లో విస్తరణ వద్దు.. రుషికొండ కేసులో సుప్రీం తీర్పు - 6TV News : Telugu in News | Telugu News...

Rushikonda: ఎట్టిపరిస్థితుల్లో విస్తరణ వద్దు.. రుషికొండ కేసులో సుప్రీం తీర్పు

2022-06-01  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

rushikonda
ఆంధ్రప్రదేశ్ విశాఖలోని రుషికొండ తవ్వకాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. గతంలో రిసార్ట్‌ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని.. కొత్తగా తవ్విన ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రుషికొండ తవ్వకాలపై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.  రుషికొండ తవ్వకాలపై  ఎన్జీటీలో తొలుత ఎంపీ రఘురామ కృక్షంరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. తవ్వకాలను నిలిపివేస్తూ మే 6న ఆదేశాలు జారీచేసింది. ఎన్జీటీ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ హిమాకోహ్లి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు.  

*ఎట్టిపరిస్థితుల్లో విస్తరణ వద్దు.. 
రుషికొండలో 62 ఎకరాల స్థలం ఉండగా 9.2 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపట్టినట్లు సింఘ్వీ కోర్టుకు వివరించారు. గతంలో ఉన్న రిసార్టు ప్రాంతంతో పాటు మరికొంత విస్తరిస్తున్నట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఆ ప్రదేశంలోని 196 చెట్లను తొలగించారని వెల్లడించారు. రుషికొండ విస్తరణ వ్యవహారంపై సింఘ్వీతో ధర్మాసనం విభేదించింది. గతంలో రిసార్టు ఎంతవరకు ఉందో అంతవరకే నిర్మాణాలు జరగాలని ఆదేశించింది.

*స్టే ఎత్తివేస్తే మరింత ముప్పు 
సింఘి వివరణ నేపథ్యంలో  రఘురామ తరఫు న్యాయవాది కల్పించుకున్నారు. కొండను పూర్తిగా తొలిచేశారని వెల్లడించారు. పునరుద్ధరణకు సాధ్యం కాదని వాదించారు. ఈ సందర్భంగా  రుషికొండ తాజా ఫొటోలను ధర్మాసనం ముందు ఉంచారు. ఇదే వ్యవహారంలో హైకోర్టులో ధిక్కరణ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. అయితే ఆ పిటిషన్‌లో మీరెందుకు చేరకూడదని రఘురామ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. తప్పు తేలితే.. బాధ్యులు జైలుకు వెళ్తారని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు ఉన్నాయని చెప్పిన న్యాయవాది.. ఎన్జీటీ ఇచ్చిన స్టే ఎత్తివేస్తే ఇంకా ముప్పు పెరిగే అవకాశం ఉందన్నారు.

* అనుమతుల ప్రకారమే నిర్మాణాలు..
గతంలో నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుని మరో కమిటీని ఎన్జీటీ  ఏర్పాటు చేసిందని రఘురామ తరఫు న్యాయవాది తెలిపారు. రుషికొండ కోస్టల్‌ జోనల్‌ పరిధిలోకి వస్తుందా? లేదా? అనేది తెలుసుకునేందుకే ఈ కమిటీని వేసినట్లు చెప్పారు. కొండ తవ్వడం వల్ల కలిగే మంచి చెడులను తెలుసుకునేందుకు ఈ కమిటీ పనిచేస్తున్నట్లు తెలిపారు.  అయితే కొండను మొత్తం ఎలా తవ్వుతారని  రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. నిర్మాణానికి సంబంధించిన వ్యవహారమంతా ఫొటోల్లో తెలుస్తోందని వెల్లడించింది. నిర్మాణాలకు అనుమతిస్తే పర్యావరణ ముప్పు లేకుండా చేపడతారా?అని ప్రశ్నించింది. అయితే అనుమతుల ప్రకారమే నిర్మాణాలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

*వీలైనంత త్వరగా విచారణ చేపట్టండి..
భవిష్యత్‌ తరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రుషికొండలో కాలుష్య రహిత వాతావరణం అందించే బాధ్యత అందరిపైనా ఉందని చెప్పింది. హైకోర్టు తదుపరి ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. హైకోర్టు ఎలాంటి నిబంధనలు విధించినా వాటిని పాటించాలని  ఆదేశించింది. ఎన్జీటీ భావించిన విధంగా అవసరమనుకుంటే హైకోర్టు మరో నిపుణుల కమిటీని నియమించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రతివాదిగా ఉన్న రఘురామ హైకోర్టును ఆశ్రయించవచ్చని.. ఇక్కడ చెప్పిన విషయాలన్నీ అక్కడా చెప్పాలని సూచించింది. హైకోర్టు వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుందని చెప్తూ విచారణను ముగించింది. వీలైనంత త్వరగా దీనిపై విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది.



2022-06-01  News Desk