ఒడిషా ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తోంది. గత కొన్నేళ్లుగా అనేక అంతర్జాతీయ పోటీలను నిర్వహిస్తోంది. క్రీడల అభివృద్ధి పట్ల తమ చిత్తశుద్ధిని సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిషా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చాటిచెబుతోంది. క్రీడాకరులకు ఆర్ధిక సాయం అందించడంలో నవీన్ సర్కార్ ఎప్పుడూ వెనకడుగువేయడం లేదు. తద్వారా ఒడిషా రాష్ట్రాన్ని స్పోర్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలని నవీన్ సర్కార్ ఆలోచిస్తోంది. తదనుగుణంగా క్రీడా ఈవెంట్లను నిర్వహిస్తోంది.
2018లో హాకీ వరల్డ్ కప్‌ను ఒడిషా రాష్ట్రం నిర్వహించింది. F.I.H ప్రోలీగ్ మ్యాచ్‌లు కూడా ఒడిషా ప్రభుత్వం నిర్వహించింది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం హాకీ ప్లేయర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మహిళల, పురుషుల జట్లు కళింగ స్టేడియంలో నిరంతరం ప్రాక్టీస్ చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. 2018వ సంవత్సరం నుంచి ఈ స్టేడియంలో హాకీ క్రీడాకారుల రద్దీ పెరిగింది.
రానున్న 8 నెలలు
ఒడిషా ప్రభుత్వం రానున్న 8 నెలల్లో రెండు ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. భువనేశ్వర్‌లో అండర్ 17 మహిళా ప్రపంచ కప్ జరగనుంది. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 30 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఆ తర్వాత మెన్స్ హాకీ వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. జనవరి 13 నుంచి జనవరి 29 వరకు భువనేశ్వర్, రూర్కెలాలో ఈ పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
నాలుగు ప్రపంచ కప్‌ల నిర్వహణ
పురుషుల ప్రపంచ కప్ హాకీ పోటీలు నిర్వహించడంలో భారతదేశంలో భేష్ అనిపించుకుంటోంది. ఇప్పటి వరకు 3 ప్రపంచ కప్ పోటీలను దిగ్విజయంగా నిర్వహించింది. 1982లో పురుషుల ప్రపంచ కప్ హాకీ పోటీలను తొలిసారిగా ఈ పోటీలు ముంబైలో నిర్వహించారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత 2010లో న్యూఢిల్లీలో నిర్వహించారు. ఎనిమిదేళ్ల తర్వాత 2018లో భువనేశ్వర్‌లో నిర్వహించారు. వచ్చే ఏడాది కూడా మళ్లీ భువనేశ్వర్‌లోనే ప్రపంచ హాకీ పోటీలు జరగనున్నాయి.
కార్పోరేట్ సంస్థల సహకారంతో
భారీ స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించడలో ఒడిషా ప్రభుత్వం కార్పోరేట్ సంస్థల సహకారం తీసుకుంటోంది. వారి సహాయ సహకారాలతో భవిష్యత్తులో ఒలింపిక్స్, ఆసియా క్రీడలను కూడా నిర్వహించాలని భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.
2023 ప్రపంచ కప్ హాకీ పోటీలు
వచ్చే ఏడాది ప్రపంచ కప్ హాకీ పోటీలు భువనేశ్వర్, రూర్కెలాలో జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రూర్కెలాలో ఓ భారీ హాకీ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. 20 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను చూసేందుకు వీలుగా స్టేడియం నిర్మాణం జరుగుతోంది. ఈ స్టేడియానికి ప్రముఖ స్వాతంత్ర పోరాట యోధుడు బిర్సా ముండా పేరు పెట్టారు. ఇక నుంచి ఈ స్టేడియాన్ని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అని పిలవనున్నారు. ఈ స్టేడియం నిర్మాణం పూర్తయితే ఇదే భారతదేశంలో అత్యంత పెద్దదైన స్టేడియంగా చరిత్ర సృష్టించనుంది. ఈ ఏడాది అక్టోబర్ నెల నాటికి ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కానుంది. 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమౌతున్న బిర్సా ముండా స్టేడియం హాకీ ప్లేయర్లకు స్వర్గంలా కనిపించనుందని పరిశీలకులు చెబుతున్నారు.
2021లో శంఖుస్థాపన
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బిర్సా ముండా స్టేడియానికి 2021 శంఖుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా స్టేడియం పనులు జరుగుతున్నాయి. కరోనా సమయంలో కూడా పనులు ఆగకుండా జరిగాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో అనుకున్న సమయానికే స్టేడయం నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికా బద్ధంగా నిర్మాణం జరుగుతోంది.