పోరాటాల గడ్డ తెలంగాణను అడ్డగా మార్చుకునేందుకు కాషాయ పార్టీ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. శాసనసభ ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉండగానే పరిస్థితులను అంచనా వేసి.. పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది. కమలం పార్టీ నేతలు వేస్తున్నఎత్తుగడలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. తెలంగాణలో రోజు రోజుకు బలం పుంజుకుంటున్న ఆ పార్టీ.. మరింత దూకుడుగా వెళ్లేందుకు వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే జాతీయ నాయకులు తెలంగాణలో జోరుగా పర్యటిస్తున్నారు. భారీ బహిరంగ సభలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవలే తెలంగాణలో పర్యటించారు. మహబూబ్నగర్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. తాజాగా తెలంగాణలోకి బీజేపీ టాప్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.
*అగ్రనాయకుల వరుస పర్యటనలు
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయం అనే సంకేతాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు.. అగ్ర నాయకులను రంగంలోకి దింపుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఉన్న అవకాశాలను అంచనా వేసిన అగ్ర నేతలు కూడా అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర పర్యటనలతో తెలంగాణ బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. పాలమూరులో జరిగిన సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ సెగలు పుట్టించాయి. తాజాగా అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. సౌత్ లో బలపడాలి అనుకుంటున్న బీజేపీ.. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజకీయంగా బలపడటమే కాకుండా, కేంద్రంపై విమర్శలతో విరుచుకు పడుతున్న కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. జేపీ నడ్డా, అమిత్ షా పర్యటన తర్వాత ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు. యూపీ బుల్డోజర్ యోగీ ఆధిత్యనాథ్ సహా పలు రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు సైతం పర్యటించబోతున్నారు.
*బీజేపీలోకి కీలక నాయకులు
తెలంగాణలో కేసీఆర్ పాలనలోని జనాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపడమే కాకుండా.. కాషాయ పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై వీరు రాష్ట్ర నాయకత్వానికి మార్గ నిర్దేశనం చేయనున్నారు. గతంతో పోల్చితే రాష్ట్రంలో బీజేపీ బలపడిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈటల రాజేందర్, రఘునందర్ వంటి నాయకులు బీజేపీలో చేరడం.. అధికార టీఆర్ఎస్ ను ఉప ఎన్నికల్లో ఓడించడం బీజేపీ పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరారు. మున్ముందు మరింత మంది నాయకులు బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తాయి. అదే వాస్తవం అయితే కమలం పార్టీ మరింత బలోపేతమౌతుంది.
*కేసీఆర్ దూకుడుకు కళ్లెం
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు కేసీఆర్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మిల్లర్ల మాయాజాలంపై ఎఫ్ సీఐ దర్యాప్తు మొదలు పెట్టింది. తనిఖీలు ముమ్మరం చేసింది. దీని ఆధారంగా సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తుంది. కాళేశ్వరం అవినీతిపై కూడా కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తన ఇటీవలి పర్యటనలో కేసీఆర్ కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ చే దర్యాప్తు జరిపించాలన్న యోచనలో కేంద్రం ఉందని వెల్లడించారు. త్వరలోనే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తరచుగా చెబుతున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టే విధంగా బీజేపీ వేగంగా అడుగులు వేస్తున్నదనడంలో సందేహం లేదు. ఎనిమిదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు వేగంగా ప్రజా మద్దతును కోల్పోతున్నారన్న అంచనాతో ఉన్న బీజేపీ.. ఇదే అదునుగా తన దూకుడు పెంచింది. అదే సమయంలో కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో బీజేపీ బలోపేతంపై దృష్టి సారించింది. దక్షిణాదిలో కర్నాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పట్టు నిలుపుకోలేదు. తొలి సారిగా తెలంగాణలో పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయన్నది ఆ పార్టీ అగ్ర నేతల అంచనా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీజేపీ సపోర్టు చేయడం, కాంగ్రెస్ వైఫల్యాలు, టీఆర్ఎస్ పట్ల ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతలే అనుకూలంగా మార్చుకుంటుంది బీజేపీ. జీహెచ్ఎంసీ జయకేతనం, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలలో విజయంతో.. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది.