దేశ రాజకీయాలు ప్ర్తస్తుతం మతం, ఆలయాలు చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడి నేతృత్వంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఇప్పటికే పురాతన సంప్రదాయం, సంస్కృతి పరిరక్షణ అంటూ ప్రఖ్యాత ఆలయాల పునరుద్ధరణ చేపడుతోంది. తాజాగా ఒడిషా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బిజూ జనతా దళ్ (బిజెడి) కూడా అదే బాటలో నడుస్తోంది.
ఒడిశాలోని బిజూ జనతా దళ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయ సముదాయాల పునద్ధరణకు విస్తృతమైన ప్రణాళికలను రూపొందించింది. ఈ కార్యక్రమం పర్యాటకులను ఆకర్షించి రాష్ట్ర ఆర్ధిక పరిపుష్టి పెంచడానికేనని చెబుతున్నప్పటికీ దీని వెనక రాజకీయ ఎజెండాను కాదనలేమని పరిశీలకులు అంటున్నారు. సంబల్పూర్లోని సామలేశ్వరి ఆలయం, బరిప్రద ఆలయం, ఘట్గావ్లోని మా తారిణి ఆలయం, కోణార్క్ హెరిటేజ్ కారిడార్, భద్రక్‌లోని మా భద్రకాళి ఆలయం, ఆరాడిలోని అఖండలమణి ఆలయం, గంజామ్లోని తారా తారిణి ఆలయం, బల్దేవ్ ఆలయంలో కొన్ని ఆలయాలు పునరుద్ధరణలో ఉన్నాయి. కియోంఝర్‌లో, పూరీలోని జగన్నాథ ఆలయం, కోరాపుట్‌లోని శ్రీ గుప్తేశ్వర్ ఆలయం ముఖ్యమైనవి.
ఆలయ పునరుద్ధరణ ఖర్చులు
ఒడిశాలోని ఆలయాల పునరాభివృద్ధికి అయ్యే మొత్తం ఖర్చు దాదాపు రూ. 2,000 కోట్ల అని ప్రభుత్వ అంచనా. వీటిలో, పూరీలోని జగన్నాథ ఆలయ పరిక్రమ పునరుద్ధరణ ప్రతిష్టాత్మకమైనది. 75 మీటర్ల వెడల్పు గల కారిడార్ - క్లాక్‌టవర్, ఇన్ఫర్మేషన్ కియోస్క్, రెస్ట్రూమ్లు, గార్డెన్ ఏరియాతో - రూ. 800 కోట్లతో ఆలయానికి రెండు కిలోమీటర్ల పొడవునా రూపొందించారు. లింగరాజ్ ఆలయ పునరుద్ధరణలో కళింగ శైలి ఆలయ నిర్మాణ శైలికి అనుగుణంగా కాంప్లెక్స్‌కు నిర్మిస్తారని అధికారులు తెలిపారు.
ఇతర దేవాలయాలు పరిమిత పరిధిలో అభివృద్ధికి నోచుకుంటున్నాయి. సంబల్పూర్లోని సామలేశ్వరి ఆలయాన్ని రూ.15 కోట్లు, కోణార్క్ హెరిటేజ్ కారిడార్ రూ.375 కోట్లు, అఖండలమణి ఆలయాన్ని రూ.6 కోట్లు, తారా తారిణి ఆలయాన్ని రూ.15 కోట్లతో పునరుద్ధరిస్తున్నారు.
'బిజెపి ని ఎదుర్కోవడానికే'
అయితే, 21 ఏళ్లుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజెడి ప్రభుత్వం రాష్ట్రంలో క్రమంగా ఎదుగుతున్న బిజెపిని ఎదుర్కోవడానికి ఇటువంటి చర్యలు తీసుకుంటోందని కొందరు వాదిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, బిజెపి కేవలం 10 సీట్లు గెలుచుకుంది. అయితే, 2017 లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో బిజెపి 2012లో ఉన్న 36 సీట్లనుంచి 297 సీట్లకు పెంచుకోగలిగింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే రెట్టింపు సీట్లను అంటే 10 నుంచి 23 స్థానాలకు పెంచుకుని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.
బిజెపి ఎదుగుదల బిజెడిలో ఆందోళన కలిగిస్తోందని, "పట్నాయక్ పార్టీ" బిజెపిని తేలికగా తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత లాలతేందు మహపాత్ర వ్యాఖ్యానించారు.
ఒడిశాలోని నేషనల్ లా యూనివర్శిటీలో సామాజిక శాస్త్రవేత్త, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రీటా రే మాట్లాడుతూ ఈ 'ఆలయ రాజకీయాలు' సామాజిక,మానసిక అంశాలకు దారితీస్తున్నాయి, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెడి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.
‘‘నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వ ‘ఆలయ రాజకీయాలను‘ అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు, ఇక్కడ దేవాలయాల గురించి తప్ప మరేదీ ఆలోచించరు. జగన్నాథ మందిరం ఒడియాలకు చాలా బలహీనత, కాబట్టి ఓటర్ల సెంటిమెంటుతో వారి మనోభావాలు గెలుచుకోవచ్చనేదే ఆలోచన‘ అని ఆమె విశ్లేషించారు.
'మతంతో రాజకీయాలు ఆడటం లేదు'
రాజకీయ నేపథ్యం ఉన్న దేవాలయాల పునరుద్ధరణపై వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని బిజెడి జాతీయ అధికార ప్రతినిధి, పూరీ ఎంపీ పినాకి మిశ్రా అన్నారు. బిజెపి మతంతో రాజకీయాలు చేస్తోందని కానీ తాము మాత్రం చేయలేదని అన్నారు.
‘ఈ అభివృద్ధి పనులు ఒడిశా సంస్కృతి పట్ల నవీన్ పట్నాయక్‌కు ఉన్న సహజమైన భక్తి మాత్రమే. జగన్నాథుని సంస్కృతితో ఆయనకు గాఢమైన అనుబంధం ఉంది. ఇది అతని ఉన్నతమైన భావన. రాజకీయ కారణాలతో మేం (బిజెడి) ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు' అని మిశ్రా స్పష్టం చేశారు.