రానున్న నాలుగు నెలల్లో దేశంలో సెమీ ఫైనల్ ఎలక్షన్స్ జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలను ఫైనల్ ఎన్నికలుగా అభివర్ణిస్తుంటారు రాజకీయ విశ్లేషకులు. దానికి ముందు జరిగే ఉత్తరప్రదేశ్ , పంజాబ్ , గోవా , ఉత్తరాఖండ్ ఎన్నికలను సెమీ ఫైనల్ ఎన్నికలని భావిస్తుంటారు. అయితే దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ , చిన్న రాష్ట్రం గోవా అసెంబ్లీలకు వచ్చే సంవత్సరం మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు...ఇప్పటి నుంచే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అన్నిటి కంటే ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో విజయం సాధించడమే లక్ష్యంగా జాతీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. దీనికి కారణం ఉత్తరప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో వస్తుందో ....జాతీయ స్థాయిలో అదే పార్టీ చక్రం తిప్పుతుందన్నది ఆ పార్టీల నమ్మకం. దీంతో అధికార భారతీయజనతా పార్టీ మొదలుకొని...ప్రస్తుత అసెంబ్లీ ఒక్క స్థానం కూడా లేని త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా యూపీలో విజయం సాధించే దిశగా ప్లాన్ చేస్తున్నాయి.
యూపీ ఓటర్లను ఆకర్షించేందుకు వేల కోట్ల రూపాయల అభివ్రుద్ధి పనులను చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. 22వేల కోట్ల రూపాయలతో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే , గంగా ప్రక్షాళన్, భవ్యకాశీ-దివ్యకాశీ వంటి పలు ప్రాజెక్టులతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రధాన మంత్రి మోదీ వరుసగా యూపీలో పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మోదీ యూపీలో పర్యటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ గురువారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటిస్తున్నారు. వారణాసి -జౌన్ పూర్ రోడ్డులో ఉన్న కార్డియాన్వ్ వద్ద ఉన్న అమూల్ డైరీ ప్లాంట్ తో పాటుగా తన పార్లమెంటరీ నియోజకవర్గానికి దాదాపు రెండు వేల కోట్ల విలువైన 27 ప్రాజెక్టులను మోదీ బహుమతిగా ఇవ్వనున్నారు. దీంతోపాటు జాతీయ, రాష్ట్రస్థాయిలో మూడు అభివ్రుద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు. వారం పది రోజుల్లోనే ప్రదాని వారణాసిలో పర్యటించడం రెండవసారి.
పదిరోజుల్లో బనారస్ లో ప్రధాని మోదీ రెండోసారి పర్యటన...
ప్రయాగ్ రాజ్, భదోహి కోసం 269కోట్ల ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మొఘల్ సరాయ్ మీదుగా చకియా వరకు రోడ్డు వెడల్పు-సుందరీకరణ వంటి పనులకు శంకుస్తాన చేస్తాను. ఎన్నికల ఏడాదిలో ప్రధాని మోదీ వారణాసి పర్యటన చాలా ముఖ్యమైందని రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు.
రూ. 2100కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు....
ఇక ఈ సారి ప్రధాని మోదీ బనారస్ ప్రజలకు పలు ప్రాజెక్టుల రూపంలో దాదాపు 2100కోట్ల రూపాయలను బహుమతిగా అందిస్తున్నారు. 475కోట్ల ప్రతిపాదిత బనాస్ కాశీ సంకుల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు అక్కడి నుంచే 2095కోట్ల విలువైన ప్రాజెక్టులకు రిమోట్ గా ప్రారంభించనున్నారు మోదీ. అంతేకాదు స్వామిత్య పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ తన చేతుల మీదుగా ఆరుగురు లబ్ధిదారులకు సర్టిఫికేట్లు ఇవ్వనున్నారు.
యూపీలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు సర్వేలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీ ప్రజలను ఆకర్షించేందుకే యూపీలో పర్యటిస్తున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రధానంగా యూపీ సీఎం యోగీ అధిత్యనాథ్ సర్కార్ పై ప్రజల్లో నమ్మకం పెంచేందుకే ఈ పర్యటనలని భావిస్తున్నారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకే మోదీ సర్కార్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందంటున్నారు. ఏదీ ఏమైనా మోదీ యోగీ....బీజేపీకి బలం చేకూరుస్తుందా లేదా చూడాలి మరి.