కొవిడ్ నియంత్రణకు యావత్ ప్రపంచ విరుగుడుగా భావిస్తున్న వ్యాక్సినేషన్ చరిత్రలో భారత్ మరో నూతన అధ్యాయానికి తెరతీసింది. శనివారం నుంచి 15-18 సంవత్సరాల నడుమ యుక్త వయస్కులకు టీకా రిజి స్ట్రేషన్ కు అనుమతిచ్చింది. సంబంధిత కొవిన్ పోర్టల్ అందుకోసం ఓపెన్ చేసింది. ‘పిల్లలు సురక్షితంగా ఉంటే, దేశ భవిష్యత్ కూడా సురక్షితంగా ఉంటుంది. అందువల్ల పిల్లల తల్లిదండ్రులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమ చిన్నారులకు టీకా వేయించే బాధ్యత తీసుకోవాలని కోరుతున్నా’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారంనాడు కోరారు. అర్హులైన పిల్లలంతా టీకా తీసుకోవాలని వారికి పిలుపునిచ్చారు. భారత టీకా విధానం శుక్ర వారం నాటికి కొత్త మైలురాయిని అందుకుందని మాండవీయ ట్వీట్ చేశారు. 145 కోట్ల టీకా డోసులు పౌరులకు అందించగలిగామని వెల్లడించారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు ఈ సందర్భంగా అభినందలు తెలిపారు. 2021 సంవత్సరాన్ని సవాల్ గా తీసుకుని పనిచేసిన అందరికీ ధన్యవాదా లు తెలిపారు. ఈ సంవత్సరంలో కూడా అంతే శ్రద్ధ, అంకిత భావంతో వైద్య సిబ్బంది పనిచేయాలని కోరారు.
1431కి ఒమిక్రాన్ కేసులు...
భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారంనాడు ఉదయం కల్లా వాటి సంఖ్య 1,431కి చేరింది. 454 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. దిల్లీ (351), తమిళనాడు(118), గుజరాత్(115), కేరళ (109) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,775 కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. 406మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపితే దేశంలో ఇప్పుడు క్రీయాశీల కేసుల సంఖ్య 1,04,781. రికవరీ రేటు 98.32శాతం. నూతన సంవత్సర వేడుకలు, వివిధ పండుగలు, ఫంక్షన్ల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య లో క్రమంగా పెరుగుదల కనిపిస్తోందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర లో 8,067 కేసులు వెలుగుచూడగా, దిల్లీ, పశ్చిమ బెంగాల్ లలో మూడు వేలు, 17వందలకుపైగా కొత్త కేసులు బయట పడ్డాయి. తెలంగాణలోనూ కొద్ది రోజులుగా క్రమంగా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది.
డెల్టా స్థానాన్ని భర్తీ చేస్తున్న కొత్త వేరియంట్...
దేశంలో డెల్టా వేరియంట్ స్థానాన్ని క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ ఆక్రమిస్తోందని, విదేశాలనుంచి ప్రయాణికుల్లో పాజిటివ్ నిర్ధారణ అయిన వారిలో 80 శాతం మంది ఒమిక్రాన్ బాధితులే ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఒమిక్రాన్ గుర్తించిన వారిలో మూడో వంతు మందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని ఆ వర్గాలు తెలిపాయి. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా ఒకరినుంచి మరొకరికి సోకే అవకాశం ఉండడం, ఈ వైరస్ సోకిన బాధితుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించపోవడంతో ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయ డానికి భారీ ఎత్తున పరీక్షలు చేపట్టాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించిన విషయం తెలి సిందే. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కూడా కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కేసులు ఎక్కువవుతున్న ప్రాంతాల్లో ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా చూడడానికి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడంతో పాటు కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కూడా రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం సూచించిన విషయం తెలిసిందే.