6tvnews

collapse
...
Home / ఆధ్యాత్మికం / ఆలయాలు / Village Fest: సింగోటం జాతర పిలుస్తోంది....

Village Fest: సింగోటం జాతర పిలుస్తోంది....

2022-01-14  Spiritual Desk

sigotam temple
 

సింగవట్నం-శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర ప్రశస్తి

   "సింగపట్నాఖ్య  సుక్షేత్ర పావన కృత మాధవం౹ సింహాద్రీశంతు దేవేశం భావయామి దయానిధిం౹౹"

  తెలుగు ప్రాంతంలో నరసింహ స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. సింహాచలం, అహోబిలం, మంగళగిరి, యాదగిరిగుట్టల తర్వాత అంతటి ప్రసిద్ధి పొందిన, మహిమాన్వితమైన క్షేత్రం  సింగవట్నం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం.

           పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా, నేటి నాగర్ కర్నూల్ జిల్లాలోని  కొల్లాపూర్ మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో సింగవట్నం అనే గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది. పూర్వం సింగ పట్నం గా, ప్రస్తుతం సింగోటం గా వ్యవహరింపబడుతుంది. 
"లింగాకారం  త్రిపుండ్రాన్కం  కేవల ధ్యాన మూర్తినం౹ 
ద్వమ్ద్వాతీతం మహోపాఖ్యం అబేధం శివ కేశవం౹౹"

     శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారు ఈ క్షేత్రంలో లింగాకారంలో స్వయంభువుగా వెలిశారు. శివకేశవులకు బేధం లేనట్లుగా రాతి లింగంపై త్రిపుండ్రాలు, ఊర్ధ్వ పుండ్రాలు ఉండడం ఇక్కడ విశేషం.

      శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఈ క్షేత్రంలో వేయడానికి ఆరు వందల సంవత్సరాల క్రితం నాడు జరిగిన ఒక చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. జటప్రోలు సంస్థానాన్ని పరిపాలిస్తున్న సురభి వంశీయుల పాలనలో ఈ గ్రామం ఉండేది. సురభి వంశీయులలో పదకొండవ తరం వాడైన సింగమ భూపాలుడు  పాలిస్తున్న కాలంలో జరిగిన కథ ఇది. ఒకరోజు సింగవట్నం గ్రామానికి చెందిన ఒక యాదవుడు తన పొలంలో దున్నుతూ ఉండగా, ఆ నాగలి కొనకు ఒక రాయి తగిలింది. ఎంత ప్రయత్నించినను నాగలి ముందుకు కదల్లేదు. అప్పుడు అతడు ఆ రాయిని తీసి ఒడ్డున పెట్టి తిరిగి వచ్చి, నాగలితో పొలం దున్నడం చేస్తున్నాడు. ఆ రాయి దొర్లుకుంటూ వచ్చి మళ్లీ నాగలికి అడ్డుపడింది. రైతు దాన్ని తీసుకుని వెళ్లి ఒడ్డుపై పెట్టడం, రాయి మళ్లీ దొర్లుకుంటూ రావడం ఇలా నాలుగైదు సార్లు జరిగింది. రైతుకు ఆశ్చర్యం కలిగింది. ఆ రాయిని తీసి శుభ్రం చేసి తేరిపార చూశాడు. ఇంకేముంది ఆ రాయిపై త్రిపుండ్రాలు,ఊర్ధ్వ పుండ్రాలు, కన్నులు ముక్కు, నోరు,చెవులు మొదలైన గుర్తులతో స్వామి కనిపించాడు. రైతు  ఆశ్చర్యచకితుడై, ఆనంద పరవశుడై, తనను రక్షించమని ప్రార్థించాడు. ఆ రాయిని అక్కడే పెట్టి ఇంటికి చేరాడు.

       శ్రీ నరసింహ స్వామి వారు ఆ రాత్రికి ఆ ప్రాంతపు రాజు సింగమనాయకుడు మరియు ఆ రైతు కలలో కనిపించి తాను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినని, రైతు నాగలికి అడ్డు వచ్చింది తానేనని, తెల్లవారేసరికి తనకు ఒక ఆలయం కట్టించ వలసిందని ఆదేశించాడు. మరునాడు ఉదయాన్నే సింగమనాయుడు వెంటనే మంది మార్బలంతో ఆ రైతు యొక్క పొలం చేరుకొని, స్వామిని దర్శించి, ఒక చిన్న గుడి కట్టించారు.ఈ గుడి ఇప్పటికీ మనకు దర్శనమిస్తుంది. ఓరుగంటి వంశీయులైన బ్రాహ్మణుల చేత ప్రతిష్ఠ చేయించాడు. వారి వంశీయులే ఇప్పటికీ పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.ఆ వంశానికి చెందిన ఓరుగంటి సంపత్ కుమార శర్మ ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా ఉన్నారు.

     సురభి వంశంలో తర్వాతి తరం వారి నుండి నేటి తరం వారి వరకు ఈ దేవాలయ అభివృద్ధి బాధ్యతలను నిర్వహిస్తున్నారు.ప్రస్థం ఆ వంశీయులు రాజా సురభి వెంకట కుమార కృష్ణ బాలాదిత్య లక్మా రావు   ప్రభుత్వము, భక్తులు, దాతల సహకారంతో దేవాలయం అభివృద్ధి చేస్తున్నారు.

స్థలపురాణం

   ఈ దేవాలయ ప్రశస్తి "మదనగోపాల మహాత్మ్యం" అనే స్థలపురాణంలో కూడ ఉన్నది. దాని ప్రకారం పూర్వం సింగవట్నం ఒక అరణ్య ప్రాంతం. కాశీ నుండి సింహ వటువు అనే బ్రహ్మచారి ఈ దారి వెంట అహోబిలం వెళ్తున్నాడు. అప్పుడు అతని కాలికి ఒక రాయి తగిలి మూర్చ పోతాడు. ఆ మగతలో అతనికి "నీవు అహోబిలం వరకు రానవసరం లేదు, ఇక్కడే ఉండి తపస్సు చెయ్యి" అనే మాటలు వినిపించాయి. అప్పుడతడు ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు కొనసాగించాడు. కొన్ని రోజులకు నరసింహ స్వామి వారు ప్రత్యక్షమై "నీ కాలు తగిలిన రాయి లోన నేనున్నాను, నిత్యము దానిని ఆరాధించుము" అని చెప్తాడు. ఆ రోజు నుండి ఆ బ్రహ్మచారి తో పాటు, ఆ గ్రామ ప్రజలందరూ ఆ రాయి లోనే శ్రీ నరసింహ స్వామిని దర్శించుకుంటూ, తమ కోరికలను నెరవేర్చమని ప్రార్థిస్తూ వస్తున్నారు.

      శైవం, వైష్ణవం అనే మతాభిమానాలు హెచ్చుగా ఉన్న ఆ కాలంలో ఒకసారి శ్రీ  శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్ స్వామి వారు ఒకసారి ఈ దేవాలయాన్ని దర్శించి, ఇక్కడ స్వామి వారు  శివకేశవులకు భేదము లేనట్లుగా వెలిశాడని గ్రహించి, ఇక్కడ వైష్ణవులు కూడా పూజాదికాలు నిర్వహించాలని, శ్రీ స్వామి వారి గర్భగుడి ప్రక్కన స్వామికి ఎడమవైపున శ్రీమ ద్రామానుజుల సన్నిధిని ఏర్పాటు చేసి వేదార్థం వంశీయులను అర్చకులుగా నియమించారు.

ఇంకా ఈ దేవాలయ ప్రాంగణంలో శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ గణపతి, సతీసమేత నవగ్రహ ఆలయాలు మొదలైన ఉప ఆలయాలు ఉన్నాయి.

      ఈ దేవాలయానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో గల గుట్టపై శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి ఆలయం ఉన్నది. ఆనాటి సంస్థానాధీశురాలు అయిన రాణి వెంకటరత్నమాంబ గారు ఈ దేవాలయాన్ని నిర్మించి, అభివృద్ధి చేసింది కాబట్టి ఈ గుట్టకు రత్నగిరి అని,ఇక్కడ ఉన్న అమ్మవారికి రత్న లక్ష్మీ అని జనులు వ్యవహరిస్తున్నారు.

        ఈ క్షేత్రానికి ఎడమవైపు రత్న సాగరం, శ్రీవారి సముద్రం అనే పేర్లతో ఒక పెద్ద చెరువు, కుడివైపున స్వామివారి పుష్కరిణి ఉన్నాయి. భక్తులు ఈ పుష్కరిణిలో స్నానమాచరించి, తడిబట్టలతో స్వామివారిని దర్శించి, పూజాదికాలు నిర్వహిస్తే, సంతాన భాగ్యము తో పాటు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.

సంక్రాంతి నుంచి జాతర

      ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినం నుండి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. మకర సంక్రాంతి మరుసటి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది.రెండవ రోజు ప్రభ ఉత్సవం ఉంటుంది. మూడవ రోజు రథోత్సవం జరుగుతుంది. ఈ రోజున సుమారు లక్ష మంది భక్తులు విచ్చేసి ఈ ఉత్సవంలో పాల్గొంటారు. తర్వాతి రోజు దోపు, పారువేట,పద్య పఠనం ఉంటాయి. పుష్కరిణిలో స్వామివారు హంస వాహనంలో తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తర్వాతి రోజు శేష వాహన సేవ పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల తరువాత నెల రోజుల పాటు జాతర కొనసాగుతుంది.

    బ్రహ్మోత్సవాలే కాక నరసింహ జయంతి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది  వంటి పర్వదినాల్లో, ధనుర్మాస సందర్భంగా పల్లకీ సేవలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ఈ దేవాలయంలో నిత్యం కళ్యాణోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. జాతర సమయంలో కాక ఇతర సమయాల్లో కూడ జిల్లా నుండే కాక పొరుగు జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించి మొక్కులు సమర్పించుకుంటారు.

       ఈ విధంగా కొలిచినవారికి కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది  సింగవట్నం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం.

     ఒకవైపు శ్రీ వారి సముద్రం,మరోవైపు స్వామి వారి పుష్కరిణి,ఎదురుగా గుట్టపై లక్ష్మీ అమ్మవారి దేవాలయం, కనుచూపు మేర పచ్చని పంట పొలాలతో ఈ దేవాలయం ఎంతో ప్రకృతి రమణీయకముగా, సుందర దృశ్యమానముగా గోచరిస్తుంది.

    తెలంగాణ ప్రభుత్వం,పర్యాటక శాఖ ఆద్వర్యములో భక్తులు ఉండడానికి కాటేజీలు నిర్మించారు.చెరువు ప్రక్కనే యాత్రీకు సేద తీరేందుకు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేశారు.గుట్టపై నుండి ప్రకృతి దృశ్యాలను చూసేందుకు వ్యూ పాయింట్ ను ఏర్పాటు చేశారు.యాత్రీకులు చెరువులో విహరించేందుకు బోటింగ్ ఏర్పాట్లను కూడా చేశారు.

      ఈవిధముగా ఈ దేవాలయం చారిత్రకంగా,ఆధ్యాత్మికంగా,పర్యాటక పరంగా ప్రసిద్ధికి ఎక్కింది.

  • -వేదార్థం మధుసూధన శర్మ
    కొల్లాపూర్
    చర వాణి.9063887585

2022-01-14  Spiritual Desk