హైదరాబాద్(Hyderabad) నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల ఒక రెస్టారెంట్‌కు హైదరాబాద్ జిల్లా వినియోగాదారుల కమిషన్(Consumer Forum) ఊహించని షాక్ ఇచ్చింది. తమ రెస్టారెంట్ కి వచ్చిన ఒక వినియోగదారుడికి 5 వేల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్‌కు ఉచితంగా మంచినీరు ఇవ్వకపోవటంతో కమిషన్ ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిహారాన్ని కూడా 45 రోజుల్లోగా కస్టమర్‌కు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
అసలింతకీ ఎం జరిగిందంటే.. సికింద్రాబాద్(Secundrabad) కు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్ ప్రాంతం సీబీఐ కాలనీలో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లాడు. రెస్టారెంట్ కు వెళ్ళాక తనకు కావాల్సిన ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. అయితే తనకు బాటిల్ వాటర్ వద్దని అన్నాడు. అందుకు కారణం తనకు అలర్జీ ఉండటమే అని అన్నాడు. సాధారణ గ్లాసులో నీరు ఇవ్వాలని రెస్టారెంట్ సిబ్బందిని కోరాడు. అయితే కస్టమర్ అభ్యర్థనను సిబ్బంది నిరాకరించారు. రెస్టారెంట్ పేరుతో స్టిక్కర్ వేసి ఉండే 500 మిల్లి లీటర్ల వాటర్ బాటిల్‌ను మాత్రమే కస్టమర్‌కు ఇచ్చారు. పైగా ఆ అరలీటరు నెల్ల బాటిల్ కు 50 రూపాయలు ఛార్జ్ కూడా చేశారు.
ఇక ఆ కస్టమర్ రెస్టారెంట్ లో తిన్న రెండు వంటకాలు, వాటర్ బాటిల్ తో కలిపి 630 రూపాయలకు లెక్క కట్టి అతడి చేతిలో ఆ బిల్లు పెట్టారు. అంతే కాదు సర్వీస్ ఛార్జీల పేరుతో మరో 31 రూపాయల 50 పైసలు కూడా వసూలు చేశారు. వాటర్ బాటిల్, సర్వీస్ ఛార్జీ రెండింటిపై 5 శాతం CGST, SGSTని వర్తింపజేసి మెుత్తంగా అతడివద్ద నుండి 695 రూపాయలు ముక్కుపిండి వసూలు చేశారు. అక్కడ ఏ మాత్రం వాదన చేయకుండా ఆ కస్టమర్ కస్టమర్ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. సదరు బిల్లులను తీసుకెళ్లి కమిషన్ ఎదుట ఉంచారు.
దీంతో కమిషన్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. రెస్టారెంట్లో వినియోగదారుల ఉచితంగా నీరు అందించకపోవటం వారి హక్కులకు భంగం కలిగించటమేనని తేల్చి చెప్పింది. బాధితుడి దగ్గరనుండి ట్యాక్స్‌ల పేరుతో వసూలు చేసిన 31.50 రూపాయలు మాత్రమే కాకుండా మరో 5 వేల రూపాయల పరిహారం కూడా చెల్లించాలని ఆదేశించింది. అంతే కాదు పిటిషన ఖర్చులకు మరో వెయ్యి అదనంగా చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని కూడా కేవలం 45 రోజుల్లోగా వినియోగదారుడికి చెల్లించాలని వెల్లడించింది. దీంతో కమిషన్ తీర్పుపై బాధితుడు హర్షం వ్యక్తం చేశాడు. కానీ రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం వియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పుతో ఖంగు తింది. ఈ ఘటన చాల మంది రెస్టారెంట్ యాజమాన్యాలకు కనువిప్పు కావాలి. మంచినీటికి కూడా పెద్ద మొత్తం లో వసూలు చేయడమే కాక వాటిపై కూడా టాక్సులు బాదేస్తున్నారు.