సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఇతని పేరు మారు మ్రోగిపోతోంది. ఒకప్పుడు ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్ కి సంబంధించి స్క్రీన్ షాట్స్ బయటపెట్టి సంచలనం సృష్టించిన సుఖేష్ ఇప్పుడు మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో జైలు జీవితం గడుపుతున్న సుఖేష్ గతంలో ఒకసారి జైలు నుండే లేఖను విడుదల చేశాడు, కాగా ఇప్పుడు మరోమారు మరో లేఖను బయటకు విడుదల చేశాడు.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీ వాల్, ఇతర ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లపై కొన్ని ఆరోపణలు చేశాడు. అయితే అవి తేలికైన ఆరోపణలు అయితే కాదు. వారు ముగ్గురు జైల్లో ఉన్నప్పటికీ వారికి అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయని పేర్కొన్నాడు. ఆప్ నేతలు అధికారంలో ఉండగా వారికి నచ్చిన, వారు మెచ్చిన అధికారులకే పోస్టింగులు ఇచ్చారని, ఇప్పుడు ఆ అధికారులు వారి పట్ల విశ్వాసం ప్రదర్శిస్తూ వారికి అనుకూలంగా ఉంటున్నారని ఆరోపించాడు సుఖేష్.
వారి అండదండలు ఉండబట్టే జైల్లో రావత్ అనే అధికారి తనను బెదిరించాడని పేర్కొన్నాడు. తనను ఎవరు బెదిరించినా భయపడేది లేదని, తానూ ఎం చెప్పదలుచుకున్నానో అది చెప్పి తీరుతానని అన్నాడు. తాను అందరి బండారం బయటపెడతానని వెల్లడించాడు. అసలు ఎవరు ఏ సుఖేష్ చంద్రశేఖర్, అతని వృత్తాంతం ఏమిటి జైలుకి ఎందుకొచ్చాడు అని డౌట్ రావచ్చు. ఇతనొక ఘరానా మోసగాడు. బెంగుళూరుకి చెందిన సుఖేష్ తాను ముఖ్యమంత్రి కొడుకుని అని, పీఎంవో లో ఉన్నతాధికారిని అని చెప్పి మోసం చేసి దాదాపు 200 కోట్ల రూపాయల డబ్బు మూటగట్టుకున్నాడు. ఇతగాడి మీద 15 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం బడా బడా పొలిటిషియన్లు అందరు ఊచలు లెక్కబెడుతున్న లిక్కర్ స్కామ్ లో ఇతడి హస్తం కూడా ఉంది.