2024 ఐపీఎల్ రసవత్తరంగా సాగుతుండగానే, టీ20 ప్రపంచ కప్(T 20 World Cup) జట్టు కూర్పు పై దృష్టి పెట్టింది బీసీసీఐ(BCCI). అయితే ఈ ఎంపికే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐసీసీ(ICC) గడువు ప్రకారం చూస్తే మే 1 వ తేదీ లోగానే జట్టుని ప్రకటించాల్సి ఉంది. దీంతో ఏప్రిల్ నెల చివర లోగానే బీసీసీఐ టి 20 ప్రపంచ కప్ జట్టు ఎంపిక పనిలో తలమునకలుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే టి 20 జట్టులో ఎవరెవరి పేర్లు ఉంటాయి. ఏ ఆటగాడికి బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది, ఎవరికీ బీసీసీఐ హ్యాండ్ ఇస్తుంది అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఐపీఎల్‌లో(IPL) కొందరు యువ ఆటగాళ్లు వీరలెవల్ లో విజృంభిస్తున్నారు, కాబట్టి వారిలో ఎవరినైనా అదృష్టం వరించే అవకాశం కూడా ఉందని జోరుగా చర్చ నడుస్తోంది. ఎవరి సంగతో ఏమోగానీ ప్రస్తుత 2024 ఐపీఎల్ సీజన్ లో దుమ్ముదులుపుతున్న చిచ్చరపిడుగు రియాన్ పరాగ్(Riyan Parag) పేరు మాత్రం బలంగానే వినబడుతోంది. సెలక్టర్ల చూపు ఈ యంగ్ బాయ్ మీద పడినట్టు సమాచారం.
ఈ వదంతులకు టీమిండియా మాజీ ప్లేయర్, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్(Sunil Gawaskar) వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చుతున్నాయి. గవాస్కర్ కూడా కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెలక్షన్ కమిటీ రియాన్ పరాగ్ పై దృష్టి పెట్టిందని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం అతడు చేయాల్సింది ఒక్కటే అని, అది ఐపీఎల్ లో బాగా ఆడటమే అని అన్నాడు.
తాజా ఐపీఎల్ లో రియాన్ పరాగ్ వీర విహారం చేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టులో ఆడుతున్న ఈ యంగ్ ప్లేయర్, ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. బంతి వేయాలంటేనే భయపడేలా చితక్కొట్టేస్తున్నాడు. అద్భుతమైన ఆటతీరు కనబరుస్తూ విమర్శకుల మన్ననలు కూడా పొందుతున్నాడు. 2024 ఐపీఎల్‌లో గడిచిన నాలుగు మ్యాచ్‌ల్లో 3 అర్ధ సెంచరీలు కొట్టి వావ్ అనిపించాడు. ఇక రియాజ్ ఆడిన చివరి 15 టీ20 మ్యాచ్‌లను గనుక గమనిస్తే అందులో 10 అర్ధ సెంచరీలు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.
మొత్తం 90 యావరేజ్ తో 771 పరుగులు సాధించాడు రియాన్ పరాగ్. ఇతని స్ట్రయిక్ రేటు కూడా తక్కువేం కాదు, 170కి పైగానే మైంటైన్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటె టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ నెలలో మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈసారి టి 20 వరల్డ్ కప్‌కు అమెరికా(America), వెస్టిండీస్(West Indies) దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం విదితమే. ఈ పొట్టి సిరీస్ కోసం క్రికెట్ ప్లేయర్లంతా ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారైన భారత్ టి 20 ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.