Fake Toll Plaza: హైవే పైనే నకిలీ టోల్ ప్లాజా..ఏడాదిన్నర పాటు సాగిన దందా.
వెనుకటి సినిమాల్లో అవసరాన్ని బట్టి హీరోనో లేక విలనో నకిలీ పోలీస్ అవతారం ఎత్తుతారు, కానీ చివరకు అది మోసం అని తెలిసిపోతుంది, ఇదే క్రమంలో నిజజీవితంలో కూడా నకిలీ పోలీసు అవతారం ఎత్తి కటకటాలపాలైన వారు లేకపోలేదు.
కేవలం పోలీసుల్లోనే కాదు నకిలీ అనేది అన్నింటా వ్యాపించింది, నిజానికి నకిలి వ్యతాసం కనిపెట్టలేనంతగా నకిలీవాటిని పక్కాగా రెడీ చేస్తున్నారు. అయితే ఎవ్వరికి అనుమానం రాకుండా ఓ ముఠా ఏకంగా నకిలీ టోల్ ప్లాజా ఏర్పాటు చేసింది.
ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ టోల్ ప్లాజా రోజులు, వారలు, నెలలు, కాదు ఏకంగా ఏడాదిన్నర పాటు కొనసాగింది.
ఈ ఉదంతం బమన్‌బోర్-కచ్ జాతీయ రహదారిపై చోటుచేసుకోగా, ఈ చిన్న సైజు కుంభకోణానికి మొర్బి వేదిక అయింది. ఈ నకిలీ టోల్ ప్లాజా ను జాతీయ రహదారికి పక్కాగా ఒక ప్రయివేటు స్థలంలో ఏర్పాటు చేసుకున్నారు. అటుగా వెళ్లే వాహనదారులను మోసగించడం మొదలు పెట్టారు.
ఈ టోల్ ప్లాజా లో కేవలం సగం ధర చెల్లిస్తే సరిపోతుంది అన్నట్టుగా బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులను ఆకర్షిస్తారు. అలా ఈ టోల్ ప్లాజా లోకి వచ్చి సగం ధర చెల్లించి బయటపడ్డాం అనుకునే వారు అంతా నిండా మోసపోయినట్టవుతారు.
అయితే జాతీయ రహదారికి పక్కాగా ఏర్పాటు చేసిన ఈ నకిలీ టోల్ ప్లాజాను చాలా కలం పాటు జిల్లా అధికారులు, పోలీసులు ఎవ్వరు కూడా గమనించకపోవడం, యాక్షన్ తీసుకోకపోవడం విడ్డూరం.
ఈ టోల్ ప్లాజా లో కి జాతీయ రహదారిపై వెళుతున్న ట్రక్కులను బలవంతంగా టోల్ కట్టాల్సిందే అంటూ టోల్ ప్లాజా వైపు మళ్లించి మరీ టోల్ వసూలు చేసినట్టు భోగట్టా.
దాదాపు ఏడాదికి పైగా ఇలా నకిలీ టోల్ ప్లాజా ను అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు దండుకున్నట్టు అధికారుల దర్యాప్తు లో తేలిందట.
సదరు నిందితులు చాలా తెలివిగా ట్రాఫిక్ ను వైట్ హౌస్ సిరామిక్ కంపెనీకి చెందిన భూమి, మూసివేసిన ఫ్యాక్టరీ అలాగే వర్గాసియా గ్రామం మీదుగా మళ్లించారు.
ముఖ్యంగా వీరు ట్రక్కు డ్రైవర్లను ప్రలోభపెట్టేవారని తెలుస్తోంది. అయితే ఏడాదినారా కాలంగా ఇక్కడ నకిలీ టోల్ ప్లాజా నడుపుతున్నప్పటికీ విషయం బయటకి పొక్కకపోవడానికి కారణం ఒక్కటే, ఆ నకిలీ టోల్ దందా కి పాల్పడినవారు ఆ ఏరియాలో చాల బలవంతులు.
మొత్తం మీద వైట్ హౌస్ సిరామిక్ కంపెనీ యజమాని అమర్షి పటేల్, వనరాజ్ సింగ్ ఝాలా, హర్విజయ్ సింగ్ ఝాలా, ధర్మేంద్ర సింగ్ ఝాలా, యువరాజ్ సింగ్ ఝాలా తోపాటు మరో ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఎప్పుడైతే ఈ నకిలీ టోల్ ఉదంతం బయటకు వచ్చిందో అప్పుడే ఘటనా స్థలానికి చేరుకొని యాక్షన్ తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
పోలీసులు ఈ ఉదంతం పై మరింత లోతైన దర్యాప్తు చేపట్టారని అన్నారు. ఏది ఏమైనప్పటికి వాహనదారులారా ఇకమీదట టోల్ ప్లాజా వద్ద కూడా అప్రమత్తతగా వ్యవహరించాల్సిందే.