Revanth Reddy: హస్తంలో కొత్త శకం..ట్రెండ్ సెట్టర్ గా రేవంత్ రెడ్డి

A new era in hand..Revanth Reddy as a trend setter

కాంగ్రెస్ మారిపోయిందా….? అహంకారానికి హై కమాండ్ దూరం జరిగిందా…? అధిష్టానమే ఫైనల్ అని అంటున్నప్పటికీ…ప్రజాభిప్రాయమే అంతిమం అని తెలుసుకుందా..? ఢిల్లీ సార్వభౌమత్వం కన్నా…

ప్రాంతీయ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వడమే ప్రజాస్వామ్యదేశంలో లాభం చేకూరుస్తుందని గ్రహించిందా..? రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తుంది. అదే గాంధీ కుటుంబమయినప్పటికీ…

వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నప్పటికీ…రాహుల్ గాంధీ తరానికి, నెహ్రూ, ఇందిర తరాలకు మధ్య ఆలోచనల్లో భారీ వ్యత్యాసమే కనిపిస్తోంది.

ఒకప్పడు కాంగ్రెస్ కు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, దాన్ని నిలబెట్టుకోవడం చాలా అంటే చాలా తేలిక. అలాగే రాష్ట్రాల్లో నేతలకూ ఎన్నికల్లో గెలవడం సునాయాసంగా జరిగిపోయేది. కానీ…పదవుల ఎంపికలో పేర్లు కనిపించడానికి మాత్రం.

ఎన్నికలను మించిన కష్టం, కసరత్తు చేయాల్సివచ్చేది స్థానిక నేతలు. ఎంత ఛరిష్మా చాటినా…మెజార్టీలో ఎన్ని రికార్డులు స్రుష్టించినా..అధిష్టానం ద్రుష్టిలో ఉంటామని కానీ…

పదవి వరిస్తుందని కానీ కాంగ్రెస్ నేతలకు గ్యారెంటీ ఉండేది కాదు. ముఖ్యమంత్రి పదవి దగ్గరి నుంచి మంత్రి పదవులు దాకా  ఏ పదవైనా తుమ్మితే ఊడిపోయే ముక్కు చందంగా ఉండేది.

అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం పదవి ఎంపికకు ఎన్నికలను మించిన ప్రహసనం జరిగేది. ఆశావహులు ఢిల్లీ విమానం ఎక్కేవాళ్లు ఎక్కుతుంటే..దిగేవాళ్లు దిగుతుండేవారు.

అయినను పోయి రావలె హస్తినకు అన్న మహాభారత వాక్యం వర్తమాన రాజకీయాల్లో కాంగ్రెస్ నేతలకు పర్యాయపదంలా ఉండేది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పదీపదిహేను రోజుల సమయం పట్టేది సీఎం ఎంపికకు. అదీ అధిష్టానం అనుగ్రహించినోళ్లకే పదవి.

ఇప్పుడలా కాదని తెలంగాణ రుజువు చేసింది. తుదినిర్ణయం తీసుకునేది ఢిల్లీలో అయినప్పటికీ….తెలంగాణ ప్రజల అభిప్రాయం మేరకే అది జరిగిందన్నది నిర్వివాదాంశాం.

నిజానికి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఎన్నికల ప్రచారం సమయం నుంచే రేవంత్ రెడ్డి  కాబోయే సీఎంగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ గెలవడమంటూ జరిగితే రేవంతే సీఎం అనే భావనను ఆయన వర్గం నేతలు, అనుచరులు ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.

Add a heading 2023 12 06T115009.574 Revanth Reddy: హస్తంలో కొత్త శకం..ట్రెండ్ సెట్టర్ గా రేవంత్ రెడ్డి

అయితే ఇలా దూకుడుగా, దుందుడుకుగా ఉండేవాళ్లను సీఎం చేయడం  కాంగ్రెస్ సంస్క్రుతికి విరుద్ధం కావడం..ఇటీవల కర్నాటకలోనూ డీకే శివకుమార్ ను పక్కనపెట్టి, సిద్దరామయ్యను సీఎం చేయడం వంటివాటితో….అందరిలో ఒకింత సందేహం నెలకొంది.

అదే సమయంలో వివాద రహితుడిగా భట్టి పేరు తెరపైకి వచ్చింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డీ రేసులో నిలిచారు. కానీ డైనమిక్ లీడర్ వైపే మొగ్గుచూపుతున్నామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రకటించింది.

ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండంటే రెండే రోజుల్లో కాంగ్రెస్ సీఎంను ప్రకటించడం పెను సంచలనమనే చెప్పాలి. తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆయా రాష్ట్రాల సీఎం ఎంపిక పూర్తికాకముందే కాంగ్రెస్ సీఎం ఎవరో తెలిసిపోయింది.

అయితే  కాంగ్రెస్ సీఎంను ఎంపిక చేసే లోపే ఇంత ఆలస్యమా..అన్న విమర్శలు బయలుదేరాయి కానీ నిజానికి కాంగ్రెస్ లో ఇదో ట్రెండ్ సెట్టింగ్.  ఓ రకంగా రాహుల్ గాంధీ…

రేవంత్ రెడ్డిని నమ్మడం వల్లే ఇదంతా జరిగింది. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టి…రాహుల్ కోరుకున్నట్టే…కాంగ్రెస్ కు గెలుపును అందించిన రేవంత్…తొలి కాంగ్రెస్ సీఎంగా…తెలంగాణకు కొత్తయుగాల్లోకి నడిపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంది.

Leave a Comment