Vande Bharat Express Sleeper Coaches : భారతీయ రైల్వే ఎంతో ప్రతిష్టాత్మికం గా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్ మార్చి నెల నుంచి ప్రారంభించాలని రైల్వే వర్గాలు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని, మొదటి సర్వీస్ ను దిల్లీ – ముంబయిల మధ్య ప్రారంభించనున్నట్లు తెలిపారు.
రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించే ఈ రైలులో 16 నుంచి 20 (ఏసీ, నాన్-ఏసీ) కోచ్‌లు ఉంటాయి. వీటితో దేశంలోని అన్ని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు.
‘‘రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణదూరం ఉండే రూట్లలో వందేభారత్ స్లీపర్ రైళ్లను నడపాలని మొదట నిర్ణయించాం. అయితే వీటిని కూడా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లోనే స్లీపర్ కోచ్ లకు డిజైన్ చేశారు. భారతీయ రైల్వేలో ఉన్న సర్వీస్‌ల కంటే ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. దీంతో ప్రయాణ సమయం రెండు గంటలు కుడా ఆదా అవుతుంది.
తొలి దశలో పది రూట్లలో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నట్లు భారతీయ రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఛైర్‌కార్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సర్వీస్‌లను అందిస్తున్నాయి.
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను అధునాతన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తరహా కోచ్‌లుగా మారుస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీంతో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు మెరుగుపడతాయని ఆమె తెలిపారు.