
AP State Caste Census : ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కారు కీలక నిర్ణయం.కుల గణనకు ముహూర్తం ఖరారు.
ప్రస్తుతం భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న మాట కుల గణన. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ సర్కారు ఈ కుల గణన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆతరువాత బీహార్ రాష్ట్రం లోని ప్రభుత్వం కూడా కుల గణన చేపట్టి ప్రజల నుండి వివరాలు సేకరించింది.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ మోహన్ రెడ్డి సర్కారు కూడా కుల గణన చేపట్టేందుకు సమాయత్తం అవుతోంది. ఇక ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు కూడా గ్రామ వార్డు వాలంటీర్లు, అదే విధంగా సచివాలయ సిబ్బందిని ఉపయోగించనుంది. ఈ నెల 27 నుంచి కులగణన ప్రారంభించాలని నిర్ణయించింది.
డిజిటల్ విధానంలో చేపట్టనున్న ఈ కుల గణన కోసం ప్రత్యేక ప్రశ్నావళితో కూడిన ఒక యాప్‌ను సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తి చేసేందుకు ప్రాంతీయ, జిల్లా స్థాయి సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ సదస్సులలో పాల్గొనేందుకు కుల సంఘాలు, బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, మేధావులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, ఆ సదస్సులలో వారిచ్చే సలహాలు సూచనలు తీసుకోవాలని పేర్కొంది.
అయితే ఈ సదస్సులలో ఎవరు పడితే వారు పాల్గొనకుండా కొంతమందికి మాత్రమే అర్హత కల్పించనున్నారు. పైగా కలెక్టర్ నేతృత్వంలోని కనిమిటి వారిని ఎంపిక చేస్తుందని సమాచారం. జిల్లా స్థాయి సదస్సులను ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించగా, ప్రాంతీయ స్థాయిలో నిర్వహించే సదస్సులను 17 నుండి 24వ తేదీ వరకు నిర్వహిస్తారని అంటున్నారు. ఈ ప్రాంతీయ స్థాయి జిల్లా స్థాయి సమావేశాలను రాజమహేంద్రవరం, కర్నూలు, విశాఖ, విజయవాడ, తిరుపతిలో సదస్సులు నిర్వహించాలని ఆదేశించింది.
ఇక ఈ సదస్సులలో గందరగోళం ఏర్పడకుండా ఉండేందుకు కార్యక్రమాన్ని సజావుగా కొనసాగించేందుకు వ్యాఖ్యాతలను కూడా అందుబాటులో ఉంచుతారు. పైగా ఈ వ్యాఖ్యాతల ఎంపిక ముందుగానే జరిగిపోవాలని సర్క్యులర్ లో నొక్కి వక్కాణించారు. కులగణన కేవలం వ్యక్తుల కులానికి మాత్రమే పరిమితం కాకుండా వారి సామాజిక, విద్య, ఆర్థికపరమైన అంశాలను కూడా సృశించనున్నారు. ఈ వివరాలను ఒకటికి, రెండుసార్లు సంబంధిత వ్యక్తి చేత ధృవీకరించిన తరువాతే నమోదు చేయల్సి ఉంటుంది.