Ashtadasa Puranas: అష్టాదశ పురాణాల్లో ఏముందో తెలుసా?

Do you know what is in Ashtadasa Puranas

Ashtadasa Puranas: అష్టాదశ పురాణాల్లో ఏముందో తెలుసా?

మనకు అష్టాదశ (18) పురాణాలు గురించి తెలుసు. ఇందులో పద్మపురాణం పెద్దది కాగా, మార్కండేయ పురాణం చిన్నది. అయితే వాటిల్లో ఏముందీ అనే విషయాన్ని తెలుసుకుందాం.

మత్స్య పురాణం:

శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు. ఇందులో యయాతి, సావిత్రి వంటివారి చరిత్రలు ఉన్నాయి. పుణ్యనదుల గురించి వివరించబడింది. ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి.

మార్కండేయ పురాణం:

ఈ పురాణం మార్కండేయ మహర్షి చేత చెప్పబడింది. ముఖ్యంగా దేవీవైభవాన్ని గురించి ఇందులో వర్ణించారు..ఇందులో 9,000 శ్లోకాలు ఉన్నాయి.

భాగవత పురాణం

ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కుమారుడైన శుకమహర్షికి బోధించచగా., ఆ శుకమహర్షి దానిని పరీక్షిత్తు మహారాజుకు బోధించాడు. శ్రీమహావిష్ణువు ధరించిన దశావతార చరిత్రలను, శ్రీకృష్ణుని బాల్య లీలా వినోదాలను ఈ పురాణం పన్నెండు స్కంథాలలో వివరిస్తుంది. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి.

భవిష్య పురాణం:

ఈ పురాణాన్ని సూర్యభగవానుడు మనువుకు బోధించాడు. ఈ పురాణం భవిష్యత్తులో జరుగబోయే విషయాలను గురించి తెలుపుతుంది. ఈపురాణంలో 14,500శ్లోకాలు ఉన్నాయి.

బ్రహ్మ పురాణం:

దీనికే ఆదిపురాణం లేక సూర్యపురాణం అని పేరు. దీన్ని బ్రహ్మ దక్షప్రజాపతికి బోధించాడు. ఇందులో శ్రీకృష్ణ, కశ్యప, మార్కండేయుల చరిత్రలు విపులంగా చెప్పబడ్డాయి. ఇందులో 10,000 శ్లోకాలున్నాయి.

బ్రహ్మాండ పురాణం:

ఈ పురాణం బ్రహ్మ, మరీచికి చెప్పాడు. ఇందులో రాధాకృష్ణుల. పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు., శ్రీలలితా సహస్రనామ స్తోత్రాలు చెప్పబడ్డాయి. ఇందులో 12,000 శ్లోకాలు ఉన్నాయి.

బ్రహ్మ వైవర్త పురాణం:

ఈ పురాణం సావర్ణమనువు, నారద మహర్షికి చెప్పాడు.., దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి.

వరాహ పురాణం:

వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి, భూదేవికి చెప్పాడు. ఇందులో విష్ణుమూర్తి వైభవంతో పాటుగా పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి. దీంట్లో 24,000 శ్లోకాలు ఉన్నాయి.

వామన పురాణం:

ఈ పురాణాన్ని పులస్త్యప్రజాపతి నారదమహర్షికి బోధించాడు. ఇందులో శైవానికి సంబంధించిన అంశాలున్నాయి. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి.

వాయుపురాణం

దీన్ని వాయుదేవుడు చెప్పాడు. ఇందులో కాలమానము., భూగోళ, ఖగోళ వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి.

విష్ణుపురాణం:

ఈ పురాణాన్ని పరాశరమహర్షి తన శిష్యుడైన మైత్రేయునికి బోధించాడు. ఇందులో విష్ణుమహత్యంతో పాటు విష్ణుభక్తుల చరిత్రలుంటాయి.. ఇందులో 23,000 శ్లోకాలు ఉన్నాయి.

అగ్నిపురాణం:

అగ్నిదేవుడు, వసిష్ఠ మహర్షికి చెప్పిన పురాణం ఇది. ఇందులో వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, భూగోళ, ఖగోళ, జ్యోతిష శాస్త్రములు చెప్పబడ్డాయి. ఇందులో 15,400 శ్లోకాలు ఉన్నాయి.

నారద పురాణం:

ఈ పురాణాన్ని నారదుడు చెప్పాడు. ఇందులో అతి ప్రసిద్ధమైన వేదపాదస్తవము(శివస్తోత్రము)గురించి ఉంది. 25,000 శ్లోకాలు ఉన్నాయి.

స్కంద పురాణం:

ఈ పురాణము కుమారస్వామిచే (స్కందుడు) చెప్పబడింది. ఇందులో శివచరిత్ర., స్కందుని మహాత్మ్యము, కాశీ ఖండము, కేదార ఖండము, సత్యనారాయణ వ్రతం, వేంకటాచల క్షేత్రమహత్యం, అరుణాచల, రామేశ్వర, గోకర్ణం లాంటి క్షేత్ర మహత్యాల గురించి వివరించబడింది.ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి.

లింగ పురాణం:

ఇందులో ముఖ్యంగా శివపూజకు సంబంధించిన అంశాలు, శివుని ఉపదేశాలతో పాటుగా వత్రాల గురించి ఉంది.

గరుడ పురాణం:

ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పాదు. ఇందులో జీవి జనన, మరణ వివరాలు., మరణించిన తర్వాత జీవి స్వర్గ, నరక ప్రయాణాలు, పాపాల శిక్షలులాంటివన్నీ ఉంటాయి. ఇందులో 19,000 శ్లోకాలు ఉన్నాయి.

కూర్మపురాణం:

కూర్మవతారమెత్తిన శ్రీమహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పాడు. ఇందులో వరాహ, నారసింహ అవతార వివరణ గురించి ఉంటుంది. ఇందులో 17,000 శ్లోకాలు ఉన్నాయి.

పద్మ పురాణం:

ఇందులో 85,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణాన్ని వింటే, జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ పురాణం పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలుపుతుంది.

Leave a Comment