Rotten samosa in vijaywada police entry : బెజవాడ ముల్టీప్లెక్స్ లో రగడ.బూజుపట్టిన సమోసాలు పోలీసుల ఎంట్రీ తో మారిన సీన్
సరదాగా సినిమాకు వెళ్లి రావాలంటే ఈజీగా మనిషికి 500 ఖర్చైపోతున్నాయి. ఎందుకంటే సినిమాకు వెళ్ళమంటే బయట 10 రూపాయలకు దొరికే సమోసా అక్కడ ఎంత రేటు చెప్పినా కొనాల్సిందే.
సీసాలో ఉండే కూల్ డ్రింక్ ను పేపర్ గ్లాస్ లో ఇచ్చి ఎక్సట్రా రేటు వేస్తారు. ఆ కూల్ డ్రింక్ తాగేటప్పుడు పళ్ళు జివ్వు మంటాయో లేదో తెలీదు కానీ, బిల్లు కట్టేటప్పుడు మనసు మాత్రం జివ్వు మంటుంది.
ఇవే ఇలా ఉన్నాయంటే పిల్లలు ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్, పాప్ కార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, బంగాళా దుంప తో తయారు చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ ను బంగారం రేట్ కు దగ్గరగా అమ్మేస్తుంటారు. మరి ఇవి అంత క్వాలిటీగా ఉంటున్నాయా అంటే అందుకు గారంటీ లేదు.
తాజాగా విజయవాడలో ఇటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. విజయవాడలోని ఓ మల్టి ప్లక్స్ సినిమా థియేటర్ లో సినిమా చూసేందుకు వెళ్లిన మహిళ ఇంటర్వెల్ లో సమోసా కొనుగోలు చేశారు.
కానీ వాటిని తినాలని చూడగా కుళ్ళిన వాసన వచ్చాయట. వెంటనే తుంచి చూడగా సమోసాలు బూజు పట్టి ఉన్నాయట.
సరిగ్గా ఇక్కడే మొదలైంది అసలు రచ్చ, ఆమె సినిమా హాల్ కాంటీన్ కి వెళ్లి అడగ్గా, ఆ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదని, అందుకే ఈ తంతు మొత్తం వీడియో తీశానని బాధితురాలు అంటోంది.
అయితే సమోసాలు బాలేకపోతే వేరే సమోసా ఇస్తామని, లేదా డబ్బు రిఫండ్ చేస్తామని చెప్పామని సిబ్బంది అంటున్నారు. కానీ సదరు మహిళ అవేమి పట్టించుకోకుండా కేకలు వేస్తూ గొడవకు దిగి సెల్ ఫోన్ లో వీడియో తీశారని మల్టిప్లెక్స్ సిబ్బంది అన్నారు.
ఆమె ప్రవర్తన వల్ల సినిమా చూసేందుకు వచ్చిన మిగతా ప్రేక్షకులు కూడా ఇబ్బందికి గురయ్యారని చెప్పారు.ఇదంతా ఇలా ఉంటె జరిగిన విషయంపై మల్టిప్లెక్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేసుకున్నారు. మలో విశేషమేమిటంటే సదరు మహిళ తన ద్విచక్ర వాహనం తాళాలు కూడా పోయాయని, అవి థియేటర్ లోనే పడిపోయాయని, వాటిని తీసుకునేందుకు సిబ్బంది అనుమతించలేదని పేర్కొన్నారు.
కానీ వాటిని వెదుక్కుందుకు థియేటర్ లోకి అనుమతించినప్పటికీ అవి కనిపించలేదని సిబ్బంది వెల్లడించారు. అనంతరం ఆమె జరిగిన విషయంపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానని చెప్పినప్పటికీ స్టేషన్ కు రాకుండానే వెళ్లి పోయారు.
రెండవ దఫా తాళాల కోసం ఆమె థియేటర్ కు వచ్చిన సమయంలో తన వెంట తన బంధువు ఒకరిని తీసుకు వచ్చినట్టు థియేటర్ సిబ్బంది కూడా పేర్కొన్నారు.
మొత్తం ఈ తంతు అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. థియేటర్ లో సమోసాలు బూజు పట్టాయన్నది అసలు విషయం.
అయితే పాడైపోయిన సమోసాలకు బదులు వేరే సమోసాలు ఇస్తామని థియేటర్ లోని కాంటీన్ సిబ్బందే చెప్పడం చుస్తే, అక్కడి ఆహార పదార్ధాలు బాలేవన్నది వారే ఒప్పుకున్నట్టు తేటతెల్లం అవుతోంది అంటున్నారు ఇంటర్నెట్ లో ఈ కధనం చుసిన వారు.
ఇక సదరు మహిళ కాస్త సామ్యావనంతో వ్యవహరించి ఉంటె ఆమె ఇబ్బంది పడే వారు కాదేమో అని కూడా అంటున్నారు మరి కొందరు.