ఒక్కసారి గనుక ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రజలేకాక నాయకులు కూడా ఎన్నికల కోడ్ కు లోబడే నడుచుకోవాలి. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు గురికాక తప్పదు. ఇలా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ కోడ్ ను ఉల్లంఘించారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయట. దీంతో రిటర్నింగ్ అధికారిని, ప్రవర్తన నియమావళి బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను పంపించి విచారణ జరిపినట్లు రొనాల్డ్ రాస్ వెల్లడించారు.
కోడ్ ఉల్లంఘనలపై మంత్రి కేటీఆర్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి విచారణ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేస్తామని అన్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ బంగ్లాలు, అతిథి గృహాల నుంచి ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం పేర్కొన్నట్టు గుర్తుచేశారు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రగతిభవన్‌లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వేర్వేరు పార్టీల నుంచి ఫిర్యాదులు అందాయని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ పైనే ఫిర్యాదు వచ్చిందని, కేసీఆర్ పై ఎటువంటి ఫిర్యాదు అందలేదని అన్నారు.