మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి(Nara Chandrababu Naidu) త్రుటి లో పెను ప్రమాదం తప్పింది. రా కదలి రా అనే పేరుతో రాష్ట్ర మంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్న చంద్రబాబు నేడు విశాఖ(Visakhapatnam) నుండి అరకు(Araku) వెళ్లేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయలుదేరారు.
అయితే హెలికాఫ్టర్ కొంత దూరం వెళ్లిన అనంతరం పైలట్ తికమకపడిపోయాడు. ఇందుకు కారణం ఏటీసీ(ATC) సూచనలను పైలట్ సరిగా అర్ధం చేసుకోలేకపోవడమే అని తెలుస్తోంది. అయితే ఏటీసీ బృందం హెలికాఫ్టర్ తప్పు దోవలో పయనిస్తోందని తెలుసుకుని పైలట్ కు కొన్ని సూచనలు చేసింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాఫ్టర్ ను తిరిగి విశాఖకు తీసుకొచ్చాడు. విశాఖకు తిరిగివచ్చిన హెలికాఫ్టర్ సరైన మార్గంలో పయనించి మరలా అరకు చేరుకుంది.
సాధారణంగా హెలికాఫ్టర్ ఒక సారి గాలిలోకి లేచిన తరువాత ఏటీసీ వారి సూచనలను పైలట్ తప్పనిసరిగా పాటించాలి. గాలిలో ప్రయాణించే సమయంలో ఏటీసీ క్లియరెన్స్ తప్పనిసరిగా ఉండి తీరాలి. చంద్రబాబు అరకు వెళ్లేందుకు ముందుగా విశాఖకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు, అక్కడి నుండి ఛాపర్ లో అరకు వెళ్లేందుకు బయలుదేరారు.
ఏటీసీ ముందు నుండి పైలట్ కు సూచనలు ఇస్తూనే ఉంది కానీ అతడు కన్ఫ్యూజ్ అవ్వడం తో ఛాపర్ దారి తప్పింది. ఈ విషయం తెలిసి అధికారులు ఖంగారు పడ్డారు. అందుకు కారణం కూడా లేకపోలేదు, చంద్రబాబు జడ్ ప్లస్ క్యాటగిరిలో(Z Plus Category) ఉన్న నేత, ఛాపర్ దారి తప్పి మావోయిస్టు ప్రభావం ఉన్న మన్యం వైపు వెళ్లడంతో అధికారులు టెన్షన్ పడ్డారు.
కానీ పైలట్ ఏటీసీ వారి సూచనలు పాటించి ఛాపర్ ను సేఫ్ గా విశాఖకు తీసుకొచ్చారు. చంద్రబాబు సేఫ్ గా ఉండటంతో అటు అధికారులు, టీడీపీ శ్రేణులు(TDP Leaders), చంద్రబాబు ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.