ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. జగన్ మార్చ్ 18 వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించేందుకు వెళ్లారు. ఈ పర్యటనకు ఏపీ సీఎం హెలికాఫ్టర్ ను ఉపయోగించారు. అయితే జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ వైసీపీ నేతలను, క్యాడర్ ను కాసేపు ఆందోళన కు గురయ్యారు .
ఆ హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అపశృతి చోటు చేసుకుంది. హెలికాఫ్టర్ లాండింగ్ కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండింగ్ సమయంలో దుమ్ముతో పాటు, ఒక చీపురు కూడా గాల్లోకి లేచింది. అయితే దానిని గమనించిన హెలికాఫ్టర్ పైలెట్ వెంటనే అప్రమత్తమయ్యాడు. హెలికాప్టర్ ను మరోసారి గాలిలోకి లేపారు. ఒక వేళ ఆ చీపురు అలాగే గాల్లోకి లేచి హెలికాప్టర్ రెక్కలకు తాకి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని నిపుణులు అంటున్నారు. ఈ ఘటన పూర్తి గా
అధికారుల నిర్లక్ష్యమే కారణమని అంటున్నారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.
అయితే ముఖ్య మంత్రులకు మాజీ ముఖ్య మంత్రులకు ఇలా హెలికాఫ్టర్ ప్రమాదాలు త్రుటి లో తప్పడం కొత్తేమీ కాదు. ఇటీవల టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరకు పర్యటనకు వెళ్లేందుకు విశాఖ వరకు విమానంలో వెళ్లారు, అక్కడి నుండి అరకు వెళ్లేందుకు హెలికాఫ్టర్ సిద్ధం చేసుకున్నారు. అయితే చంద్రబాబు బయలుదేరిన హెలికాఫ్టర్ కొంతసేపటికి దారి తప్పింది. విషయం గ్రహించిన పైలట్ మరలా దానిని విశాఖ కు తిరిగి తీసుకొచ్చారు. చంద్రబాబు మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్న కారణంగానే ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. ప్రభుత్వాలు మారినా ఆ సెక్యూరిటీలో మార్పు లేకపోవడానికి కారణం కూడా అదే. ఈ క్రమంలో నక్సల్స్ ప్రభావం ఉన్న మన్యం వైపు హెలికాఫ్టర్ వెళ్లిందని తెలియడంతో టీడీపీ శ్రేణులు కాసేపు బెంబేలెత్తి పోయారు. కానీ చంద్రబాబు సురక్షితం గా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక 2023 నవంబర్ నెలలో అప్పటికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కూడా హెలికాఫ్టర్ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. నవంబర్ 8వ తేదీన కేసీఆర్ సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్లారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య తలెత్తడంతో చాపర్ ను పైలట్ వెంటనే నిలిపివేశాడు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్ వెళ్లారు, ప్రజా ఆశీర్వాద సభ లో ప్రసంగించిన తరువాత అక్కడినుండి తిరిగి బయలు దేరారు. ఆ సమయం లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అంతే కాదు ఈ ఘటన జరగడానికి మరికొన్ని రోజుల ముందు కూడా ఒకసారి కేసీఆర్ ప్రయాణించే హెలికాఫ్టర్ చాలా సేపు మొరాయించింది. ఎర్రవల్లి లోని ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ దేవరకద్ర కు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పుడు కూడా పైలట్ హాలీకాఫ్టర్ ను నిలిపివేశాడు.
సీనియర్ ఎన్టీఆర్ కు ఒక సారి హెలికాఫ్టర్ ప్రమాదం తప్పింది. ఎన్టీఆర్ సీఎం గా ఉన్న సమయంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీశైలం వెళ్లారు. అయితే సాయంత్రం 6 గంటల తరువాత హెలికాఫ్టర్ వెళ్లకూడదనే నిబంధనలు ఉన్నాయట, అయినప్పటికీ 6 గంటల 30 నిమిషాలకు వారు హెలికాఫ్టర్ ఎక్కారట అయితే దారిలో ఏమి కనిపించడం లేదట. దీంతో పైలట్ కు ఎన్టీఆర్ ఒక సూచన చేశారట. హెలికాఫ్టర్ ను వెయ్యి అడుగుల ఎత్తులో తీసుకెళ్లాలని ఎక్కడ లైట్లు ఎక్కువగా కనబడితే అదే హైదరాబాద్ అనుకోవాలని సూచించారట. వారికి 7 గంటల 45 నిమిషాలకు చార్మినార్ కనిపించిందట. కాని నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణం కొనసాగించినందుకు పైలట్ కి ఉన్నతాధికారులు మెమో ఇచ్చారట.