CM Revanth Reddy: కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావును, తెలంగాణ తాజా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఓడిపోయినా మరుక్షణమే ఆయన ప్రగతి భవన్ ను వీడి ఎర్రవెల్లి లో ఉన్న ఆయన ఫామ్ హౌస్ కి చేరుకున్నారు.
అయితే ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో కేసీఆర్ బాత్ రూమ్ లో కాలు జారీ పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు కేసీఆర్ ను సోమాజిగూడ లో ఉన్న యశోద ఆసుపత్రికి తరలించారు.
ఆయనను పరీక్షించిన వైద్యులు కేసీఆర్ కు తుంటి భాగంలో ఎముక రెండు చోట్ల విరిగిందని, ఆపరేషన్ చేయాలని తేల్చారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ చేసి ప్లేట్లు అమర్చినట్టు తెలుస్తోంది.
అదే విధంగా ఆపరేషన్ జరిగిన మరుసటి రోజే కేసీఆర్ ను ఆర్థోపెడిక్ వైద్య సిబ్బంది దగ్గరుండి నడిపించడం విశేషం. కేసీఆర్ కూడా పట్టుదలతో అతి కష్టం మీద అడుగులు వేసిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.
ఇక తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి అధికారిక కార్యకలాపాలతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ఓ కంట కేసీఆర్ ఆరోగ్యాన్ని కూడా చూస్తూనే ఉన్నారు.
ఘటన జరిగిన రోజున తెలంగాణ వైద్య ఆరోగ్యఖశాఖ కార్యదర్శి రిజ్వీని యశోదా ఆసుపత్రికి పంపించి కేసీఆర్ ఆరోగ్యాన్ని వాకబు చేయించారు. ఇక నేడు స్వయంగా మాజీ సీఎం ను తాజా సీఎం వెళ్లి కలిశారు.
సీఎం రేవంత్ వెళ్లి కేసీఆర్ ను కలవడానికి ముందే ఆసుపత్రి వద్దకు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే కాక పలువురు మంత్రులు కూడా యశోదా ఆసుపత్రి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించినట్టు తెలుస్తోంది.