Ekadashi Day: ఉత్పన్న ఏకాదశిరోజున ఈ పనులు చేయండి.
హిందువులందరికీ ఏకాదశి తిథి పరమ పవిత్రమైనది. హిందూకాలమానం ప్రకారం సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. వీటన్నింటికీ ఒక్కో పేరు ఉంది.
అలాగే కార్తికమాసం పరమపవిత్రమైనది. ఈమాసం అంతా హరిహరాదులను పూజిస్తూనే ఉంటారు. ఇటు ఏకాదశి తిథి విష్ణుమూర్తికి, శివుడికీ కూడా ప్రీతికరమైనది కాబట్టి కార్తికమాసంలో వచ్చే రెండు ఏకాదశులను హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తారు.
కార్తిక పురాణంలోనూ ఏకాదశి మహత్యాన్ని వివరించే కథ ప్రస్తావనలో ఉంది. అంతటి పవిత్రమైన ఈ ఏకాదశి తిథిని భక్తిశ్రద్ధలతో ఆచిరంచాలి.
కార్తికమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో పిలుస్తాం. మరి ఈ ఏకాదశి ఘడియలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి. ఉత్పన్న ఏకాదశినాడు ఏమేం చేయాలో తెలుసుకుందాం రండి.
ఏకాదశి ప్రారంభ సమయం:
తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది కార్తీక మాసంలోని బహుళ పక్షంలో అంటే డిసెంబర్ 8వ తేదీన శుక్రవారం నాడు ఉదయం 05:06 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది.
డిసెంబర్ 9వ తేదీ శనివారం ఉదయం 6:31 గంటలకు ముగుస్తుంది. ఏకాదశి ఉపవాసాన్ని రేపు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో విరమించాలి.
ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యం:
ఈ ఏకాదశి తిథి రోజునే ఏకాదశి అనే దేవత ఆవిర్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది.
ఒకానొక సమయంలో విష్ణువు మురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి నిద్రిస్తున్నప్పుడు,ఆయన శరీరం నుంచి ఒక అందమైన కన్య ఉద్భవించి మురుడితో యుద్ధం చేసి సంహరించిందట. ఆ కన్య పేరే ఏకాదశి.
ఆమె ధైర్యసాహసాలకు సంతోషించిన విష్ణువు ఆమెను ఏంకావాలో కోరుకోమంటే తాను విష్ణువుకు ప్రియతిథిగా అందరిచేతా పూజలందుకోవాలని కోరుకుందట.
తథాస్తు అన్నాడు నారాయణుడు. అప్పటి నుంచి జనులు ఏకాదశి తిథిని పరమపవిత్రమైనదిగా భావిస్తున్నారని భవిష్యోత్తరపురాణం చెబుతోంది. అలా ఆ ఏకాదశి తిథి ఉద్భవించిన రోజే ఈ ఉత్థాన ఏకాదశి.
ఏకాదశి వ్రత విధానం:
ఈరోజు ఉదయమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఇంట్లో ధూపదీప నైవేద్యాదులతో విష్ణుమూర్తిని పూజించాలి. ఈ సంవత్సరం శుక్రవారంనాడు ఈ ఉత్థాన ఏకాదశి వచ్చినందున మరింత శుభప్రదం కాబట్టి లక్ష్మీదేవి సహితంగా విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల మరింత మేలుకలుగుతుంది.
ఈరోజంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి. సాయంత్రం సమీపంలో ఉండే దేవాలయానికి వెళ్లి దీపారాధన చేయాలి. తిరిగి రేపు ఏకాదశి ఘడియలు ముగిసిన తర్వాతనే భోజనాన్ని చేయాలి. ఇది ఏకాదశి వ్రత విధానం.
అదేవిధంగా ఈరోజున శ్రీమహా విష్ణువు ప్రీతికొరకు, లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు విష్ణుసహస్ర నామాలను, కనకధారా స్తోత్రం, లక్ష్మీ స్తోత్రాలను చదవాలి.
అలా వీలుకాని పక్షంలో కనీసం ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్ర జపాన్నైనా చేసుకావాలి. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల నూరు అశ్వమేధయాగాలు చేసిన ఫలం, పుణ్య నదీ తీర్థ స్నానం చేసిన ఫలితం వస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.