Drugs Peddler arrested In Hyderabad : రాజస్థాన్ నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై చేస్తున్న గుజరాతీలు ఎల్బీ నగర్ లో పట్టుకున్న పోలీసులు.
రాను రాను భాగ్యనగరంలో మాదక ద్రవ్యాల తాకిడి ఎక్కువైపోతోంది. నగరంలో యువతను దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ ను పెద్ద మొత్తం లో తీసుకొస్తున్నారు. యూత్ ని టార్గెట్ చేసుకున్న స్మగ్లింగ్ ముఠాలు కోట్లలో వ్యాపారాలు చేస్తున్నాయి.
యువతను మత్తులో జోగేలా చేస్తూ వారి జేబులు నింపుకుంటున్నారు. అయితే ఎస్.ఓ.టి పోలీసులు ఈ అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపుతున్నారు. డ్రగ్స్ ను అక్రమం గా రవాణా చేస్తున్న వారిపై నిఘా పెంచారు. చిన్న సమాచారం అందినప్పటికీ ఏ మాత్రం లైట్ తీసుకోకుండా రైడ్ చేసేస్తున్నారు.
ఈ క్రమంలోనే రాజస్థాన్ నుంచి సిటీకి హెరాయిన్ సప్లయ్ చేస్తున్న ఇద్దరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 70 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా తిలక్‌నగర్‌కు చెందిన వారుగా వీరిని గుర్తించారు.
పంకజ్ భాయ్, ప్రజాపతి ముఖేశ్లక్ష్మణ్ భాయ్ అనే ఇద్దరు కూడా అంబర్ పేటలో నివాసం ఉంటున్నట్టు విచారణలో తేలింది. మొదట్లో వీరిద్దరూ కూడా డ్రగ్స్ మత్తు కి అలవాటు పడిన వారే, అయితే క్రమంగా వారు సప్లయర్ల అవతారం కూడా ఎత్తారు.
రాజస్థాన్ నుంచి హెరాయిన్ కొని హైదరాబాద్‌కు తీసుకువస్తుంటారు, ఇక్కడ ఉన్న వారి బంధువులు, స్నేహితులకు ఈ డ్రగ్స్ విక్రయిస్తుంటారు. పక్కా సమాచారం అనుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు వీరిని నాగోల్ క్రాస్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుండి హెరాయిన్ తోపాటు వెయింగ్ మెషిన్ 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న తరువాత వారిని కటకటాల వెనక్కు నెట్టారు.