
Election code in Telangana : తెలంగాణ లో ఎన్నికల కోడ్.రాత్రి 11 కే మూతపడుతున్న దుకాణాలు, రెస్టారెంట్లు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ నగరం షాపింగులకు ప్రసిద్ధి. ఇక భోజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలోని రెస్టారెంట్లు హోటళ్ల లో లభించే హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. పైగా షిఫ్ట్ విధానంలో పని చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, మరెందరో ఫుడ్ కోర్టు లలో అర్ధరాత్రి సమయంలో తమ ఆకలి తీర్చుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి బ్రేక్ పడింది.
రాత్రి 11 గంటల కల్లా షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా మూసివేస్తున్నారు భాగ్యనగరంలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల నియమావళి ప్రకారం రాత్రి 11 గంటలలోపు అన్ని దుకాణాలను తప్పక మూసివేయాలట. ఈ విషయాన్నీ పోలీసులు స్వయంగా దుకాణదారులకు షాపింగ్ కాంప్లెక్సుల్లోని షాపులకు, హోటల్ యాజమాన్యాలకు చెప్పి మూసివేయిస్తున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు నవంబర్ 10 వతేదీతో ఆఖరు తేదీ, పైగా ఈ నెల 30 వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు.
కాబట్టి రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడుతుంది. విడి సమయంలో అర్ధరాత్రి వరకు కూడా చార్మినార్ వీధులు షాపులతో, సందడిగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలు చేస్తుండటంతో రాత్రి 11 తరువాత అక్కడి రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
అయితే డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. ఇక గత ఎన్నికల్లో 88 స్థానాలను కైవశం చేసుకుని గులాబీ పార్టీ జయకేతనాన్ని ఎగురవేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బి.ఆర్.ఎస్ మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది. కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయో అన్న ఉత్సకత ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.