Elections in Telangana : తెలంగాణలో ఎన్నికలు – పెళ్లి ఇళ్లలో పాట్లు
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది, నేతలు ప్రచారాల తో హోరెత్తిస్తున్నారు. ఇక వివిధ పార్టీల అధ్యక్షులు భారీ ఎత్తున సభలు నిర్వహించి ప్రజలను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం లబోదిబో మంటున్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు మా ఇళ్లలో పెళ్లిళ్లకు తిప్పలు తెచ్చాయంటూ మండి పడుతున్నారు. పెళ్లంటే మాటలా, పందిళ్లు, సందళ్ళు, తప్పెట్లు తాళాలు, మేళాలు, మంగళ సూత్రాలు, మంత్రాలు చదివే బ్రాహ్మలు, కొత్త బట్టలు, నగలు చీరలు, విందులు వినోదాలు ఇన్ని ఉంటాయి పెళ్లంటే.
అయితే వీటికి ఎన్నికలకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా ? ఇప్పుడు లిస్టులో చెప్పినవి ఏ ఒక్కటి కావాలన్నా డబ్బు ఉండాల్సిందే. మరి ఎన్నికల కోడ్ ఉంటె డబ్బు ఒక చోటు నుండి మరొక చోటికి తీసుకెళ్లడం కుదరదు. కోడ్ పుణ్యమా అని చెక్ పోస్టులు పెట్టేశారు. ఎక్కడిక్కక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నియమావళిని బట్టి ఒక్కో మనిషి 50 వేలకు మించి తీసుకువెళ్లకూడదు, నియమావళిని అతిక్రమిస్తే ఆ డబ్బును సీజ్ చేస్తారు.
మరి పెళ్లి చేయాలంటే డబ్బుతోనే కూడుకుని ఉంటుంది. అన్ని చోట్ల అందరు డిజిటల్ పేమెంట్ తీసుకుంటారని చెప్పలేము, పైగా డిజిటల్ పేమెంట్లకు కూడా షరతులు ఉన్నాయి. ఒక లక్ష రూపాయలకు మించి ట్రాన్స్ఫర్ కావడంలేదు. ఇక చెకింగ్ పాయింట్ల వద్ద ఖర్మ చాలక డబ్బు పట్టుబడితే దానిని వెనక్కి తెచ్చుకోవడం కోసం నానాతిప్పలు పడాల్సి వస్తోంది.
పైగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అప్పు పుట్టడం కూడా కష్టంగానే మారింది. ఎన్నికల మాట ఏమోగానీ పెళ్లి వాళ్ళ పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి తెలంగాణాలో. పైగా నవంబర్ నెలలో ముహుర్తాలు ఉండటం వల్ల చాలా మంది ఈ నెలలోనే పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలో చేసేది ఏమి లేదు పెళ్లి సింపుల్ గా చేసుకుని మరో సందర్భంలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవడమే అని కొంతమంది ఉచిత సలహాలు కూడాఇస్తున్నారు.