Gaza Desperate Cry for Relief: ఈ యుద్హానికి అంతం ఎప్పుడు..ప్రజా ప్రజల దయనీయ స్థితి చూశారా..గాజా ప్రజలకు నీరు, ఆహరం, వైద్యం అందేది ఎలా.
హామాస్ మిలిటెంట్లు, ఇజ్రాయిల్ దళాల మధ్య భీకర పోరు నడుస్తూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా బాంబుల మోత హోరెక్కిపోతోంది, రాకెట్లు దాడులు దద్దరిల్లేలా చేస్తున్నాయి.
ఆర్తనాదాలు, హాహాకారాలు వింటే హృదయం ద్రవించిపోతుంది. ఇప్పటి వరకు బిడ్డలను కోల్పోయి గర్భశోకాన్ని అనుభవిస్తున్న తల్లి దండ్రులు అనేకమంది.
తల్లి దండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇవి చాలదన్నట్టు గాజా ప్రజలు ఆహరం లేక ఆకలితో అలమటిస్తున్నారు, పొడిబారిపోయిన గొంతుకను తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క దాహార్తి తో అల్లాడిపోతున్నారు.
గడచిన నాలుగువారాలుగా గాజాలో గుండెలు పిండేసే దారుణ సంఘటనలే దర్శనమిస్తున్నాయి.
ప్రస్తుతం గాజాలో ఎక్కడ చూసినా శిధిలాల గుట్టలు, వాటి క్రింద మృతదేహాలు, బాంబు దాడుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అందుకు కారణం చెప్పాల్సిన అవసరం లేదు.
దాదాపు నెలరోజుల నుండి ఇజ్రాయిల్ సైన్యం చేస్తున్న దాడే దీనికి కారణం. నాలుగు వరాల క్రితం ఓ రోజు తెల్లవారు ఝామున మొదలైన ఈ బాంబు దాడులు ఇప్పటికి కూడా ఆగలేదు సరి కదా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి.
ఇస్రాయిల్ గాజాను చుట్టుముట్టి దాడులకు దిగడానికి కారణం హామాస్ సైన్యం ఇజ్రాయిల్ పై చేసిన దాడికి ప్రతీకార చర్యే. గాజా పై భూతాల దాడులను మొదలు పెట్టింది ఇసరయిల్.
ఎందుకంటే హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ లోని రహస్య స్వరంగాలలో తలదాచుకుని ఉన్నారన్న సమాచారం మేరకే ఈ దాడికి తెగబడుతోంది ఇస్రాయిల్ సైన్యం.
హమాస్ మిలిటెంట్లను ఏరివేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతోంది ఇస్రాయిల్ సైన్యం. ఈ దాడులలో వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు అన్న విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని చెప్పింది ఆ దేశ మిలిటరీ విభాగం.
కానీ వారు అది కావాలని చేస్తోంది కాదని, అమాయకుల ప్రాణాలకు అపాయం తలపెట్టాలన్నది తమ ఉద్దేశం కాదని చెబుతోంది. కానీ హమాస్ మిలిటెంట్లను మట్టుపెట్టే క్రమంలో ఈ ప్రాణ నష్టం జరగక తప్పడం లేదని అంటోంది.
హమాస్ మిలిటెంట్లను మొత్తాన్ని భూస్థాపితం చేయాలనీ కంకణం కట్టుకున్న ఇజ్రాయిల్ సైన్యం గాజాను అష్ట దిగ్బంధనం చేసింది.
అన్ని వైపులా నుండి యుద్ధ ట్యాంకర్లు, ఆయుధాలు, సైన్యంతో చుట్టుముట్టింది. ఈ క్రమంలోనే గాజా లోని ప్రజలకు ఆహారం, నీరు, ఆరోగ్య సంబంధిత ఔషదాల కొరత ఏర్పడింది.
ఇక్కడి విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అందువల్ల వాటర్ ప్లాంట్లు పనిచేయడం మానేశాయి. ఉన్న నీటినే కొద్దీ కొద్దిగా తాగుతూ గొంతు తడిఆరిపోకుండా చూసుకుంటున్నారు.
కొందరైతే మూత్రానికి వెళ్ళడానికి కూడా సందేహిస్తున్నారు. ఇక అక్కడక్కడా కనిపించే నీటి వనరుల నుండి నీటిని తాగడానికి కూడా వీలు లేకపోయింది.
అనుదుకు కారణం అవి పూర్తిగా కలుషితం అయిపోయి ఉండటమే. కాస్త దాహం తీర్చుకుందామని కలుషిత జలాన్ని గనుక తాగితే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎక్కడ తలెతుతాయో అనే భయం కూడా వారిని వెంటాడుతోంది.
మామూలు మనుషుల పరిస్థితే ఇలాఉంటె ఇక చిన్న పిల్లలు, వృద్దులు, గర్భిణీ స్త్రీల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
గాజాలో భీకర దాడులతో ఇస్రాయిల్ సృష్టించిన విధ్వంసానికి ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
అనేక మంది పునరావాస కేంద్రాల్లో తలా దాచుకుంటున్నారు. వారికి ఐక్య రాజ్య సమితి ఆహరం, నీరు అందిస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ రావడం లేదు.
వీరికి అందించే సహాయం మరింత పెంచాలని, అందుకు 294 మిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేసింది. సహాయం కోసం శరణార్థులు దీనంగా ఎదురుచూస్తున్నారు. అలాగని దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి.
రాను రాను పరిస్థితి దారుణంగా దయనీయంగా మారుతూనే ఉంది కానీ ఎక్కడా నెమ్మదించే అవకాశం కనిపించడం లేదు. రోజురోజుకి ఇజ్రాయిల్ తన దాడులను మరింత పెంచుతుంది కానీ ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేలా కనిపించడం లేదు.
ఇక్కడే ఒక విషయాన్నీ గుర్తుచేసుకోవాలి, ఇజ్రాయిల్ హెరిటేజ్ మంత్రి అమిచాయ్ ఎలియాహు సంచలన ప్రకటన చేశారు. గాజా భూభాగంలోని హమాస్ మిలిటెంట్లను పూర్తిగా నామరూపాలు లేకుండా చేయాలంటే అణు బాంబు వేయాలని అది ఒక మార్గమని చెప్పాడు.
ఇలాంటి తరుణంలో అక్కడి మంత్రి చేసిన వ్యాఖ్యలు గాజా ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్న వారి నెత్తిమీద పిడిగి పడినట్టుగా మారింది ఈ వార్త. అయితే దీనిపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు.
తమ దేశ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అంతర్జాతీయ చట్టాలు, అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగానే ఇజ్రాయిల్ దేశం, ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ పనిచేస్తాయని వెల్లడించారు. అణుబాంబు ప్రయోగం వంటి చర్యలు చేపట్టబోమని అన్నారు.
గాజా లో 17 లక్షల మంది శరణార్థులు ఉన్నారు. వారికి ఆహరం అందించడం చాలా కష్టంగా మారిందనే చెప్పాలి. పాలస్తీనాకి చెందిన శరణార్థుల సహాయ సంస్థ ఆహరం అందించడం కోసం 89 బేకరీలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే వారు ఉత్పత్తి చేసిన ఆహారం ఎంతమాత్రమూ సరిపోవడం లేదనే చెప్పాలి. అక్కడి ప్రజలకు రోజుకి ఒక్కొక్కరికి కేవలం రెండు రొట్టెల చొప్పున మాత్రమే ఇవ్వగలుగుతుంది.
గాజా లో ఎక్కడ చూసినా రోడ్ల వెంట కుప్పలు తెప్పలుగా కార్లు, కూలిపోయిన భవనాలు, శిధిలాల నుండి ఎగసిపడుతున్న మంటలు, నివురు గప్పిన నిప్పు నుండి వస్తున్నా సెగలు పొగలు.
ఎడారి లో అయినా నీరు దొరుకుతుందేమో కానీ, ఇలాంటి ప్రాంతాల్లో నీరు దొరుతుంది అనుకోవడం అమాయకత్వమే. అందుకే ఇక్కడి ప్రజలు భూమి నుండి వచ్చే ఉప్పు నీటిని కూడా వృధా చేయకుండా ఉపయోగించుకుంటున్నారు.
ఇక విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు గాజాలో ఇంధనం కూడా నిండుకుంటోంది. ఇజ్రాయిల్ నుండి గాజాకి వచ్చే మూడు పైపు లైన్లలో నుండి ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది, దానినుండి వచ్చే నీరు మాత్రమే ఇప్పుడు గాజా ప్రజలకు ఆధారం.
అసలే ఇంధనం కొరత ఏర్పడింది, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఉన్న ఇంధనం తోనే ఆసుపత్రులలో జనరేటర్లు నడుపుతున్నారు. ఆయిల్ నిండుకుంటే అవి కూడా ఆగిపోతాయి.
దీనివల్ల గాయాల పాలై ఆసుపత్రిలో చేరిన వారికి చికిత్స అందించడం సాధ్యం కావడం లేదు.
ఇంధన కొరత, విద్యుత్ కొరత, మందుల కొరత, పరికరాల కొరత వీటన్నిటి కారణంగా గాజాలో ఆసుపత్రులు చాలా వరకు మూతపడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
వైద్యం అందక ప్రజలు అల్లాడిపోతున్నారు. బాంబు దాడులలో ప్రాణాలు కోల్పోతున్న వారు కొందరైతే, వైద్యం అందక ఆర్తనాలు పెడుతున్న వారు అంతకన్నా ఎక్కువ ఉన్నారు.
గాజా ప్రజల పరిస్థితి చూసి కొన్ని దేశాలు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. వారి కోసం ఆహారం మందులు అందిస్తామని చెబుతున్నాయి.
ఇలా సహాయాన్ని అందిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే గాజా ప్రజలలో సహనం నశించింది. ఆహారం, వైద్యం, మంచినీరు అందకపోవడంతో వారు విసిగిపోయి ఉన్నారు.
ఈ క్రమంలోనే అంజర్జాతీయ సంస్థలు కొన్ని గోదాములు ఏర్పాటు చేయాగా అందులో సహాయ సామాగ్రిని పొందు పరిచాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు గోదాముల్లోకి చొరబడి వారికి కావలసిన సామాగ్రిని తీసుకువెళ్లడం మొదలు పెట్టారు.
బాధితులు విసిగివేసారిపోయి ఉండటమే దీనికి కారణమని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ సన్నివేశం గాజా లోని దయనీయ పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పొచ్చు..