Kerala government decision Sabarimala Darshan: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్.
మండల రోజులు దీక్ష బూని, అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్దలతో కొలిచి, ఇరుముడులను తలపై పెట్టుకుని శబరిమల కొండకు వెళ్లి ఆ అయ్యప్పను దర్శించుకుంటారు అయ్యప్ప మాల దారులు.
ఇక ఈ దీక్ష నేపధ్యం లో అయ్యప్పలు 40 రోజుల పాటు తెల్లవారుఝామునే నిద్ర లేచి చన్నీటి స్నానం చేసి, బ్రహ్మచర్యం పాటించి, మాంసం మద్యం వంటి దుర్వయాసనాలకు దూరంగా, ఆధ్యాత్మిక చింతనకు దగ్గరగా ఉంటారు.
అదే క్రమంలో నిత్యం ధూపదీప నైవేద్యాలు అయ్యప్పకు సమర్పిస్తూ ఇరుసంధ్యలలో స్వామిని భక్తితో పూజిస్తారు. అయితే ఇంతా చేసేది ఎందుకంటే శబరిమలలో అయ్యప్ప కొండకి వెళ్లి అయ్యప్ప స్వామిని ధరించుకోవడానికే.
కార్తీక మాసం నుండి ఈ అయ్యప్ప దీక్షలు స్వీకరించడం మొదలవుతుంది. దీక్ష చేపట్టిన రోజు నుండి 40 రోజుల తరువాత అయ్యప్పను దర్శించుకుని దీక్షను విరమిస్తారు.
అయితే అయ్యప్ప దీక్షను స్వీకరించేవారు లక్షల సంఖ్యలో ఉంటారు. శబరిమల కొండకు ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తారు.
ఆయప్పకొండకు స్వామీ మాలాధారులే కాక సాధారణ భక్తులు కూడా వస్తారు. దీంతో అయ్యప్ప కొండమీద ఆలయంలో క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసి పోతున్నాయి.
ఇలాంటి సమయంలో కేరళ ప్రభుత్వం అలాగే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అదేమిటంటే అయ్యప్ప స్వామీ ఆలయం లో మరో గంట పాటు దర్శనం సమయాన్ని పెంచనున్నారు.
అయ్యప్ప స్వామీ ఆలయంలో ఉదయం అలాగే సాయంత్రం వేళల్లో మొత్తం కలిపి 17 గంటలు ఉంటుంది. అయితే ఇప్పుడు కొండపై అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సాయంత్రం వేళ దర్శనంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
కేరళ ప్రభుత్వం అలాగే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు శబరిమల అయ్యప్ప స్వామీ ఆలయం లో సాయంత్ర 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తులను స్వామీ దర్శనానికి అనుమతించేవారు,
కానీ ప్రస్తుతం ఉన్న రద్దీని పరిగణలోకి తీసుకుని మధ్యాహ్నం మూడు గంటల నుండే దర్శనాన్ని ప్రారంభించనున్నారు. దీంతో అయ్యప్ప భక్తులు స్వామివారిని మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దర్శించుకునే సౌలభ్యం కలిగింది.
అయితే మొత్తం దర్శన సమయం 17 గంటలు గా ఉంది ఈ సమయం అదనంగా ఇచ్చిన తరువాత. కానీ భవిష్యత్తులో 17 గంటలకు మించి దర్శన వేళలు పొడిగించే వీలు లేదని పేర్కొన్నారు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వారు.
ప్రస్తుతం శబరిమల కొండమీద భక్తులు అధిక సంఖ్యలో క్యూ లైన్ లో దర్శనం కోసం వేచి ఉంటున్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఆలయ బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది.
భక్తుల దాహార్తి తీర్చేందుకు మంచి నీరు అందించడం తోపాటు, చిన్న పిల్లలు, వృద్దులకు ఆకలి తీర్చేందుకు బిస్కెట్లు కూడా అందిస్తున్నారు. అయితే క్యూ లైన్ లో ఒక విషాదకర ఘటన కూడా చోటుచేసుకుంది,
దర్శనం కోసం వచ్చిన 11 ఏళ్ళ బాలిక కన్ను మూసింది, సదరు బాలిక తమిళనాడులోని సేలంకు చెందినది గా గుర్తించారు. క్యూ లైన్ లో ఒక్కసారిగా తోపులాట చేసుకున్న సమయంలో బాలిక స్పృహ తప్పి పడిపోయింది.
వెంటనే చిన్నారిని పంపా ఆస్పత్రికి తరలించారు, వైద్యులు పాపకు చికిత్స అందిస్తూ ఉండగా పరిస్థితి విషమించి కన్నుమూసింది. అయితే ఆ చిన్నారికి 3 ఏళ్ల చిరు ప్రాయం నుండే గుండె సంబంధిత వ్యాధి కూడా ఉన్నట్టు ఆమె బంధువులు తెలిపారు.
అయితే శబరిమల కొండపై తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకోవడం ఇది మొదటిసారి కాదు, గతంలో ఇటువంటి సంఘటనలు అనేకం వెలుగుచూశాయి.
కొందరు గాయపడగా, కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే అటు కేరళ ప్రభుత్వం ఇటు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపడుతూనే ఉన్నాయి.