కేజ్రీవాల్ ను అన్నా హజారే అంతమాట అనేశాడా ? తదుపరి అతనిదే అవుతుందా ?

aa Cover kivcdhoms53s8krl0tsuj8qqh3 20170408125030.Medi కేజ్రీవాల్ ను అన్నా హజారే అంతమాట అనేశాడా ? తదుపరి అతనిదే అవుతుందా ?

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌ ఇది దేశ రాజకీయాలను పట్టి కుదిపేస్తోంది. ఈ కుంభకోణంలో పలు పార్టీల ముఖ్య నేతలు శ్రీ కృష్ణ జన్మస్థానానికి చేరుకున్నారు. వారిలో డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కూడా ఉన్నారు. అయితే, కేజ్రీవాల్ అరెస్టు కి సంబంధించి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కొన్ని సెన్సేషనల్ కామెంట్లు చేశారు. కేజ్రీవాల్‌ తన మాటను లక్ష్య పెట్టలేదని హజారే మండిప‌డ్డారు. తనతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఇప్పుడు లిక్కర్ పాలసీలు రూపొందించాడని చిర్రుబుర్రులాడారు.

తన స్వలాభం కోసం పాలసీలు తయారు చేశారు కాబట్టే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని హజారే వెల్లడించారు. అధికారం ముందు ఏదీ ప‌ని చేయ‌ద‌ని, చ‌ట్ట ప్ర‌కారమే అరెస్టు జ‌రిగింద‌ని అన్నారు. న్యాయాన్ని, ధర్మాన్ని ఎవరికైనా అనుసరించక తప్పదని చెప్పారు. ఏది జ‌ర‌గాలో అదే జ‌ర‌గుతుంద‌ని హజారే చెప్పుకొచ్చారు.

ఇది ఇలా ఉంటే, 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే పోరాటాన్ని చేపట్టారు. ఈ పోరాటంలో మాజీ ఐఆర్ఎస్ అధికారి కేజ్రీవాల్ కూడా భాగస్వామిగా ఉండడం విశేషం. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో హజారే వెన్నంటి ఉన్నారు కేజ్రీవాల్. ఇక ఉద్యమం అనంతరం 2012లో రాజకీయా ఆరంగేట్రం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో సొంతంగా పార్టీని స్థాపించారు. మొదటిసారి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ తరుపున పోటీచేశారు, ఢిల్లీ వాసుల మన్ననలు పొందిన కేజ్రివాల్ ముఖ్య‌మంత్రిగా ఢిల్లీ పీఠాన్ని అధిష్టించారు. అంతే కాదు వరుసగా మూడు పర్యాయాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం దక్కేలా కేజ్రీవాల్ కృషి చేశారు.

అయితే, ప్రస్తుతం కేజ్రీవాల్ కి సంకెళ్లు పడటంతో ఆప్ నేతల్లో కొంత ఆందోళన నెలకొంది. సరిగ్గా లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ విధంగా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం ఆపార్టీ నేతలకు శరాఘాతంలా మారింది. ఇది ఇలా ఉంటె ఆప్ కార్య‌క‌ర్త‌లు కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీ వ్యాప్తంగా ధర్నాలు చేప‌డుతున్నారు. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే కాదు అనేక ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ అరెస్టును ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినా బి.ఆర్.ఎస్ మహిళా నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఇదే స్కామ్ లో అరెస్ట్ అవ్వడంతో బిఆర్.ఎస్ పార్టీ శ్రేణులు గళం విప్పాయి. ముఖ్యంగా ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ అరెస్ట్ ను ఖండించారు. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ లను ప్రధాన సాధనాలుగా చేసుకుని భారతీయ జనతా పార్టీ అణచివేతలకు పాల్పడుతోందని ఆరోపణలు గుప్పించారు. రాజకీయ ప్రతీకారమే బీజేపీ ఏకైక ఉద్దేశమని నిప్పులు చెరిగారు.

ఏది ఏమైనా ప్రస్తుతం దేశం లో నడుస్తున్న అరెస్టుల పర్వం మాత్రం సంచలనంగా మారింది. ఈ అరెస్టులు కేవలం తెలంగాణ, ఢిల్లీ లో మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ లో 2023 లో జరిగిన చంద్రబాబు అరెస్ట్, సుమారు 56 రోజుల పాటు ఆయనను రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉంచడం సంచలనంగా మారింది. ఈ అరెస్ట్ కు సంబంధించి ఏపీ, తెలంగాణ లో మాత్రమే కాక దేశ విదేశాల్లో కూడా టీడీపీ సానుభూతిపరులు, చంద్రబాబు అభిమానులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరవాత జార్ఖండ్ ముఖ్య మంత్రి హేమంత్ సొరేన్ కూడా అవినీతి కేసులో జైలుపాలయ్యారు. ఈ అరెస్టుల పర్వం కవిత కేజ్రీవాల్ తో ఆగుతుందా లేదంటే ఇంకా కొనసాగుతూనే ఉంటుందా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే ఈడీ కవిత భర్తకు కూడా సమన్లు జారీచేసినట్టు తెలుస్తోంది.

Leave a Comment