Hyderabad care of adulteration: హైదరాబాద్ కేర్ ఆఫ్ కల్తీ..భాగ్యనగరంలో ఎన్ని కల్తీ కేసులంటే..ట్విన్ సిటీస్ లో.
కాదేదీ కవితకు అనర్హం అని శ్రీ శ్రీ అంటే కాదేదీ కల్తీకి అనర్హం అంటున్నారు అక్రమార్కులు, పసిపిల్లలు తినే చాకోలెట్లు, బిస్కెట్లు, ఆహార పదార్ధాల నుండి ఇంట్లో ఉపయోగించే పాలు, వంట నూనెలు అన్నిటిని కల్తీ చేసి పడేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యం ఏమైపోతే మాకెంటి మా జేబులు నిండటమే మాకు ముఖ్యం. వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతే మాకేంటి, మా కుటుంబం మేము బాగుండాలి, అందుకు ఏదైనా కల్తీ చేసేస్తాం అంటున్నారు.
ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కల్తీ మహమ్మారి భాగ్యనగరంలో వెర్రితలలు వేసింది. లక్షల మాది నివసిస్తున్న ఈ మహానగరంలో కల్తీ రాయుళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే వీలు లేకుండా పోతోంది.
దేశంలో 19 ప్రధాన నగరాలూ ఉంటె అత్యధికశాతం ఫిర్యాదులు మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరం నుండే వస్తున్నాయంటే ఇక్కడ కల్తీ ఏ మేరకు జరుగుతుందో మనం అర్ధం చేసుకోవచ్చు.
నగరంలోని హాస్టళ్లు, మెస్సులు, హోటళ్లు, కొన్ని రెస్టారెంట్లను మొదలుకొని సందులు గొందుల్లో పెట్టె టిఫిన్ బల్ల వరకు అన్నింటా కల్తీకి ఆస్కారం ఉంది.
ఆహార పదార్ధాల తయారీలో వారు వాడుతున్న నూనె మంచిదేనా ? ఒకవేళ మంచి నూనె తీసుకువచ్చినా దానిని ఎన్ని సార్లు వేడి చేస్తున్నారు అనే విషయాలు పట్టించుకునే కరువయ్యారంటూ ప్రజలు లబోదిబో మంటున్నారు.
ఇక కొన్ని పాల బూతుల్లో పాలను కల్తీ చేస్తూ దొరికిపోయిన అక్రమార్కులను చూస్తుంటే పాలు కొనాలన్నా తాగాలన్నా భయం వేసే స్థాయిలో సామాన్యులు వచ్చేశారు.
ఇక సంపన్నుల మాటకు వస్తే వారి వద్ద కాస్తో కూస్తో డబ్బు ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ ఫామ్స్ లో పండించిన ఆర్గానిక్ ఫుడ్ తెప్పించుకుని వాడుకుంటూ వారి హెల్త్ కాపాడుకుంటున్నారు.
కానీ అది సామాన్యులకు అలవికాని పని అయిపొయింది. రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు ఆర్గానిక్ ఫుడ్ కొని తినాలంటే అది దుస్సాధ్యమే అవుతుంది.
కేవలం నూనెలు, పాలు, ఆహార పదార్ధాలు కాదు, మనం ఆరోగ్యం మెరుగు పరుచుకోవాలని ఖరీదు పెట్టి కొనుక్కునే పళ్ళ విషయంలో కూడా కల్తీ జరుగుతోంది అంటే నమ్మి తీరాల్సిందే.
హైదరాబాద్ నగరంలో కల్తీ మాఫియా ఇంతలా వేళ్లూనుకుపోవడానికి కారణాలు కూడా లోఏకపోలేదు, జీహెచ్.ఎంసీ లో మొత్తం 30 సర్కిళ్లు ఉన్నాయి. కానీ జీహెచ్.ఎంసి మొత్తానికి కలిపి 16 మంది ఫోర్ ఇన్స్పెక్టర్ లు మాత్రమే ఉన్నారు. అంటే ఒక్కో ఫుడ్ ఇన్స్పెక్టర్ రెండు సర్కిళ్లను పర్యవేక్షిస్తు ఉండాలి.
అంటే సిబ్బంది కొరత ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మరి ఇకమీదటైనా ప్రభుత్వం సరిపడా సిబ్బందిని నియమించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న కల్తీ మాఫియా ఆగడాలు అరికట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.
ఈ కల్తీ మాఫియా అనేది చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లా ఏర్పాటు చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా చేస్తుంటారు. ఈ కల్తీలో కొన్ని రకాల కల్తీలు మన ఆరోగ్యాన్ని నాశనం చేసేవైతే కొన్ని రకాల కల్తీలు మనల్ని వెర్రివెంగళప్పలని చేసి మన జేబుకి చిల్లు పెడుతూ ఉటాయి.
ఉదాహరణకి మనం శుద్ధమైన నెయ్యి కొనాలని షాపుకి వెళతాం, నెయ్యి కొనుగోలు చేస్తాం, కానీ అది ప్యూర్ నెయ్యి అని గ్యారంటీగా చెప్పలేము, కొందరు దుర్మార్గులు స్వచ్ఛమైన నెయ్యిలో జంతువుల కొవ్వును కూడా కలుపుతున్నారు.
చనిపోయిన జంతుల శరీరం నుండి సేకరించిన కొవ్వును నెయ్యిలో కలిపి విక్రయించడం వల్ల వారి జేబులు నిండుతాయి కానీ ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంది.
అయితే మనల్ని వెర్రివాళ్లను చేసి డబ్బు కాజేసే కల్తీ మరో రకం, అదేమిటంటే పాలల్లో నీళ్లు కలిపి అమ్మడం, వెన్న పూసలో మైదా కలిపి అమ్మడం,
అలాగే ఖరీదైన వేరుశనగ నూనె కావాలని వెళితే అందులో ఖరీదు తక్కువ సన్ ఫ్లవర్ ఆయిల్ ను లేదా మరేదైనా నూనెను కలిపి అమ్మడం వంటివి చేసేవారు ఉన్నారు.
అయితే ఇలాంటి కల్తీలను గుర్తించి ప్రజలు ఫిర్యాలు ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు. ఆ ఫిర్యాదుల వెల్లువ చుస్తే మనకి దిమ్మ తిరిగిపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా 2022 సంవత్సరం లో 1,631 కల్తీ ఆహరం కేసులు నమోదయ్యాయి,
ఇక దేశ వ్యాప్తంగా ఎన్ని కేసులు వెల్లువెత్తాయి, అందులో తెలంగాణ స్టేట్ వాటా ఎంత ఎన్ని ఒక లుక్కేద్దాం. 2022 సంవత్సరం లో దేశ వ్యాప్తంగా 4,694 కేసులు నమోదు కాగా అందులో 35 శాతానికి పైగా కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదవడం విస్తుపోయే అంశం.
2021 విషయంలోకి వెళితే దేశం మొత్తం మీద 8,320 కేసులు రాగా వాటిలో కూడా తెలంగాణ వాటానే ఎక్కువని తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్లు 272, 273, 274, 275, 276 కింద ఈ కల్తీ ఆహారం కేసులు నమోదు చేస్తారట.