Vastu Tips: ఈ వస్తువులు ఇంట్లో ఉన్నాయా అయితే దరిద్రం తప్పదు.
ఇంటిని అందంగా అలంకరించడం కోసం మనం రకరకాల వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. అవి చూడడానికి అందంగా కనిపించినప్పటికీ వాటివల్ల ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు వాస్తు పండితులు.
ఆ వస్తువులు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయట. అందుకని ఇంట్లో ఆనందం, సుఖసంతోషాలు వెల్లివిరాయలంటే ఆ వస్తువులను తెచ్చిపెట్టుకోకుండా…
ఒకవేళ ఇంట్లో కనుక ఉంటే వాటిని బయటపారేయడమే మేలని చెబుతున్నారు వాస్తు పండితులు. మరి ఏ వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదో తెలుసుకుందాం.
పాడైపోయిన గోడగడియారాలు:
కేవలం టైం చూసుకునేందుకు మాత్రమే కాదు ఆకర్షణగా కనిపించేలా నేడు రకరకాల గోడగడియారాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే మనలో చాలామంది అవి పాడైపోయి ఉన్నప్పటికీ ఆకర్షణీయంగా ఉందని చెప్పి అలాగే గోడకి ఉంచి పెట్టేస్తుంటారు.
దాని వల్ల ఆకర్షణ ఉన్నప్పటికీ ప్రతికూలతలు చాలా ఉంటాయట. అలా పాడైపోయి ఉన్న గడియారాలను ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో గొడవలు జరిగి మానసిక ప్రశాంతత కరువవుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.
రకరకాల జంతువుల బొమ్మలు:
ఇంట్లో అందంగా అలంకరణ కోసం పులి, చిరుత, రకరకాల కొమ్ములతో ఉండే విగ్రహాలు, జింకలులాంటివి అడవుల్లో ఉండే జంతువుల బొమ్మలను ఇంట్లో ఉంచుకుంటున్నారు. అయితే ఇంట్లో కేవలం ఆవులు, ఏనుగుల బొమ్మలు అవి కూడా తెల్ల ఏనుగు మాత్రమే ఉండాలి.
వేరే ఏరకమైన జంతువుల బొమ్మలు కానీ తేళ్లు, పాములులాంటి విషపూరిత జీవుల బొమ్మలు కానీ ఉండకూడదు. అవి కనుక ఇంట్లో ఉంటే ఇంట్లోని మనుషుల మధ్య విపరీతమైన కోపం పెరిగిపోతుంది. హింసాత్మక ధోరణి పెరిగి ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది.
పాతబడిన వస్తువులు అసలే వద్దు:
చాలామంది అవసరం ఉన్నా లేకున్నా అదేపనిగా వస్తువులను ఇంట్లోనే అట్టే పెట్టుకుని ఉంటారు. పాడైపోయిన వస్తువులను కానీ లేకుంటే చిరిగిన దుస్తులను కానీ ఇంట్లోనే ఉంచుకుంటుంటారు కానీ ఇలా ఉంచుకోవడం అసలు మంచిది కాదు.
అవసరం లేదు అనుకున్న వస్తువులు కానీ దుస్తువులను కానీ ఎప్పటికప్పుడు తీసివేయడం మంచిది. అంతేకాదు పగిలిన వస్తువులను ఇంట్లో అస్సలు ఉంచుకోకుడదు. ఒకవేళ దేవుని విగ్రహాలు భిన్నం అయినట్లయితే వాటిని నదిలో వేసి రావడం ఉత్తమం.
ఇక కొందరు అదే పనిగా చెప్పులు కొంటుంటారు. పాత చెప్పులు బయటపడేయరు సరికదా అవి అరిగిపోయి ఉన్నా లేదా పాతగా అయినప్పటికీ వాటిని దాచిపెట్టుకుని ఉంటారు. ఇలా ఉంటే శనిదేవుని ఆశీస్సులు మనపై ఉండవు సరికదా శనిగ్రహ బాధలు మరిన్ని కలిగే అవకాశాలున్నాయి.
ఇటువంటి వాటివల్ల ఇంట్లో చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లోఎప్పుడూ చికాకులు ఉంటాయి. అప్పుల బాదలు కలుగుతాయి. కాబట్టి పగిలిపోయినా లేదా పాడైపోయిన వస్తువులను ఎప్పటికప్పుడు తీసివేయడమే మేలు.
యుద్ధం చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు:
యుద్దం చేస్తున్నట్లు ఉన్న ఫోటోలను కానీ రణరంగంలో ఉన్న పోటోలను కానీ షో కోసం పెట్టుకుంటారు. కానీ ఇలాంటి పెయింటింగ్స్ కానీ ఫోటోలను కానీ అసలు ఇంట్లో ఉంచుకోవద్దు.
దీనివల్ల ఇల్లు కూడా రణరంగంలా మారిపోతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. వీటివల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందట. అలాకాకుండా కళ ఉండే లక్ష్మీదేవి లేదా ఇతర పెయింటిగ్స్ ను ఇంట్లో ఉంచుకోవడం వల్ల వాటిని చూడడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఇంట్లో ఆనందం తాండవిస్తుందని అంటున్నారు పండితులు.