
పెళ్లి పేరుతో యువతులకు ఎర.. చిక్కారో కోట్లు స్వాహా..
పెళ్లి పేరుతో అమాయక మహిళలను నమ్మించి గొంతుకోసి అందిన కాడికి దోచుకుని పరారయ్యే పాత నేరస్తుడిని మోండా మార్కెట్పోలీసులు అరెస్టు చేసి కటకటాలవెనక్కు నెట్టారు.
అరెస్ట్ అనంతరం నిందితుని వద్ద నుండి 27 తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, బ్యాంకు పాస్‌బుక్, క్రెడిట్‌కార్డును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరుకు చెందిన తుమ్మ మోహన్‌రెడ్డి అలియాస్ శ్రీనాథ్ అనే వ్యక్తి పాత నేరస్తుడేనని పోలీసులు తెలిపారు.
పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని తెలుస్తోంది, ఇక 2011వ సంవత్సరంలో మోహన్‌రెడ్డి తన సొంతూరికె చెందిన యువతిని పెళ్లి చేసుకుని కల్వకుర్తికి వెళ్లాడు.
అయితే ఈ ప్రబుద్దుడు ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ ఆ స్కూల్ లోని విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో అరెస్టై జైలుకు వెళ్లాడు.జైలు నుంచి బయటకు వచ్చాక సులభమైన మార్గంలో డబ్బులు సంపాదించాలనే దురాశతో పెళ్లి అనే దారిని ఎంచుకున్నాడు. పెళ్లి
పేరుతో అమాయక మహిళలను మోసగించేందుకు పధకం పన్నాడు. ఇందులో భాగంగానే మోహన్‌రెడ్డి కందుకూరులో తన బంధువుది ఒక ఖరీదైన కారును తస్కరించి 4.5 లక్షల రూపాయలకు అమ్మేశాడు. ఆ డబ్బుతో సిటీకి వచ్చి వివిధ ప్రాంతాల్లో ప్రైవేటు హాస్టళ్లలో ఉండసాగాడు.
అయితే దొంగతనానికి అలవాటు పడ్డ ప్రాణం ఊరికే ఉండనివ్వదు కదా, అందుకే హాస్టళ్లలో చేతివాటం చూపెట్టాడు, రూమ్‌మేట్స్‌కు చెందిన ఎలక్ర్టానిక్ వస్తువులు దొంగిలించి అమ్మకుని సొమ్ము చేసుకునేవాడు. కొంతకాలం తరువాత తన మకాం బెంగుళూరుకి మార్చాడు.
అక్కడకు వెళ్లిన తరువాత షాదీ డాట్‌కామ్ అనే పెళ్లిళ్ల వెబ్సైట్లో తన వివరాలు పొందుపరిచాడు. అలా మ్యారేజ్ వెబ్ సిట్ ను అడ్డుపెట్టుకుని ఓ మహిళతో స్నేహం చేసి ఆమెకు దగ్గరయ్యాడు. క్రెడిట్‌కార్డు తీసుకుని 2.2లక్షల రూపాయలతో బంగారు ఆభరణాలు కొని విజయవాడకు చెక్కేశాడు. తీరా తాను మోసపోయానని తెలుసుకున్న మహిళా లబోదిబో మని బాధపడింది.
ఇప్పటివరకు మోహన్ రెడ్డి గా ఉన్న వ్యక్తి విజయవాడ వెళ్ళాక గౌతమ్‌రెడ్డి గా మారిపోయాడు. అదే పేరుతో ఒక ఫేక్ ఐడీ సృష్టించాడు. ఇక చెప్పేదేముంది బెజవాడలో కూడా కొత్త పెళ్ళికొడుకు అవతారం ఎత్తడానికి షాదీ డాట్కామ్వెబ్సైట్లో పెళ్లి కోసం వివరాలు పెట్టాడు.
ఈ దఫా మోసపోయే వంతు మియాపూర్‌కు చెందిన ఓ యువతిదైంది ఆమెతో చాటింగ్చేయడం మొదలెట్టాడు, హైదరాబాద్‌కు వచ్చి రెండుసార్లు కలిసివెళ్ళాడు. తనదైన శైలిలో నమ్మించి మాయమాటలతో బుట్టలో వేసుకున్నాడు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు మియాపూర్ కి చెందిన యువతి కూడా మోహన్ రెడ్డిని నమ్మేసింది. దీంతో అడిగిన వెంటనే అతగాడి చేతిలో కేరెడిత్ కార్డు పెట్టేసింది.
తన వద్ద తీసుకున్న క్రెడిట్‌కార్డును ఉపయోగించి .6,21,483 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేశాడు. నగలు చేతికి చిక్కగానే బెజవాడ చెక్కేసి వాటిని అమ్మేశాడు. బెంగుళూరు, బెజవాడ, హైదరాబాద్ అయిపోగానే గుంటూరును ఎంచుకున్నాడు.
2023లో రెడ్డి మ్యాట్రిమోనీ డాట్కామ్వెబ్సైట్ ను ఎంచుకున్నాడు. అందులో తిరుమల విజయ్‌రెడ్డి పేరుతో ఒక ఫేక్ ఐడీ క్రియేట్ చేసి గుంటూరుకు చెందిన ఓ అమ్మాయిని వంచించాడు.
ఆమె నుండి 9లక్షల రూపాయలు కొట్టేశాడు. ఆ తర్వాత భారత్‌మ్యాట్రిమోనీ డాట్‌కామ్‌లో శ్రీనాథ్ పేరుతో ఒక ఫేక్ఐడీ సృష్టించి వివరాలు అప్ లోడ్ చేశాడు. ఈ క్రమంలో ఒక యువతి అతనితో పెళ్ళికి ఓకే చెప్పింది. వారు ఇద్దరు సికింద్రాబాద్ లోని ఓ లాడ్జ్ లో కలుసుకున్నారు.
ఆమె తయారయేందుకు వాష్ రూమ్ లో వెళ్లగా ఇతగాడు ఆమె బాగ్ లో ఉన్న బంగారంతో ఉడాయించాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు, సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అతగాడిని గుర్తించారు, నిందితుడు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి మోహన్ రెడ్డిని శాశ్వతంగా అత్తారింటికి పంపించారు.