ఇటీవల మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. అయితే దానికి తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజాపాలన’ పేరుతో అధికారంలోకి వచ్చి BJP తో చేతులు కలిపి తిరుగుబాటు చర్యలను చేపడుతోంది అని మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు.
మార్చి 8న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తుమ్మిరెల్లికి చెందిన మాదేవ్, మద్కల్ అనే ఇద్దరు అమాయక గిరిజన యువకులను దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేసి హత్య చేశారని జగన్ ఆరోపించారు. వారి కోసం కుటుంబ సభ్యులు 25 రోజులుగా వెతుకుతున్నా పోలీసులు వారి ఆచూకీ చెప్పడం లేదని వారు ఆరోపించారు, అంతే కాదు మరొక ఘటన లో ఇటీవల చర్ల పోలీసులు బీజాపూర్ జిల్లా నేంద్ర అనే గ్రామానికి చెందిన 5 యువకులను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని వారు లేఖలో పేర్కొన్నారు.
భారత దేశం లో ఉండే ఆదివాసీలు శాంతియుతంగా జీవించడం లేదని, వారిని అసలు దేశ పౌరులుగా గుర్తించడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశాడు . గడ్చిరోలి లో జరిగిన ఎన్‌కౌంటర్ కు , గిరిజన యువకుల హత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిదే పూర్తి బాధ్యత అని జగన్ తన లేఖలో డిమాండ్ చేశారు. హత్యకు గురైన యువకుల వివరాలను వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని, వారిని చంపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు తమ లేఖ లో కోరారు.