
IT seized key Documents strict IT raids going on Telangana :తెలంగాణ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు – కీలక పత్రాలు స్వాధీనం
తెలంగాణా రాష్ట్రంలో ఐటీ సోదాలు కొనసాగడం వల్ల రాజకీయంగా అవి మరింత హీటు పుట్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న మహేశ్వరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తోపాటు అదే నియోజకవర్గంలోని మరోనేత పారిజాత నరసింహారెడ్డి ఇళ్లలోను కార్యాలయాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి కి చెందిన వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు అన్ని వివరాలు సేకరిస్తున్నారు. బాలాపూర్ కి చెందిన కాంగ్రెస్ నాయకుడు వంగేట లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.
వీరితోపాటు కోకాపేటలో ఉంటున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేత బంధువు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అయితే ఈ సోదాల సమయంలో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేతల ఇళ్లలో ఐటీ రైడ్స్ చేయడంపై ఆపార్టీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
కాంగ్రెస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి వారిని భయభ్రాంతులను గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు చేయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
మరీ ముఖ్యగా మహేశ్వరం నియోజకవర్గంలోని అధికార పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతారు అనే భయం తోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని అన్నారు