కార్తికమాసం ముగియబోతోంది…ఈ పనులు చేశారా.?
తెలుగు మాసాలలో కార్తికమాసానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తికం. సాక్షాత్తూ ఆ త్రిమూర్తులే ఈ మాసమంత గొప్పది ఇంకోటి లేదని చెప్పినట్లు మన పురాణాలు చెబుతున్నాయి.
అయితే కార్తికమాసంలో త్వరిత ఫలితాన్నిచ్చే పనులు కొన్ని తప్పనిసరిగా చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ పనులు చేయడం వల్ల మనకష్టాలు తీరుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి.
ఇంకా కొన్ని రోజుల్లో కార్తికం ముగియబోతోంది, ఇప్పటికైనా ఎవరైనా దీపారధనలు, దీపదానాలు వంటివి చేసుకోకుంటే చేయడం మంచిది. మరి కార్తికంలో తప్పనిసరిగా చేయాల్సిన పనులను గురించి తెలుసుకోండి.
తులసీదేవి, ఉసిరిచెట్టు పూజ
తులసీదేవి పూజకు మన సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ కార్తికమాసంలో మాత్రం తులసీదేవిని ప్రత్యేకంగా పూజించి, తులసికోట ముందు దీపాలను వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.
అయితే కేవలం తులసిని మాత్రమే కాదు ఉసిరి చెట్టును కూడా తులసి మొక్కతో సమానంగా కలిపి పూజించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందగలం. ఈ మాసమంతా తులసి, ఉసిరి చెట్టులను ధాత్రీనారాయణ స్వరూపంగా భావించి పూజించడం వల్ల ఇంట్లోకి యమదూతలు ప్రవేశించరని పురాణాలలో పేర్కొనబడింది.
పుణ్యనదీ స్నానం:
పుణ్యనదీ తీర్థాలలో స్నానం చేయడం, జపదానాదులు చేయడం కార్తికమాసంలో చేయాల్సిన మరో పని. ఈ విషయం గురించి కార్తికపురాణంలో కూడా ప్రస్తావించారు. ఈ మాసంలో నదీ స్నానం చేయడం వల్ల రోగాల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంటిల్లిపాదికి శుభం కలుగుతుంది.
సూర్యోదయానికి ముందే నదీ ప్రవాహంలో స్నానం చేయడం శ్రేయస్కరం. ఒకవేళ గంగాస్నానానికి వెళ్లలేకపోతే కనీసం మనం స్నానం చేస్తున్నప్పుడు గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి…నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే నదీస్నాన శ్లోకాన్ని చెబుతూ స్నానం చేయడం శ్రేయస్కరం.
మహాలక్ష్మికి కూడా ఈ మాసం చాలా ఇష్టమైనది. ఈమాసంలో అమ్మవారిని అష్టలక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖసంతోషాలు అన్నీ ప్రాప్తిస్తాయి. ఈ మాసమంతా కొద్దిగా పచ్చి పాలను నీటిలో కలిపి రావిచెట్టు యొక్క మొదట్లో పోయాలి.
ఎందుకంటే లక్ష్మీ దేవి, విష్ణుభగవానుడు రావిచెట్టుపై నివసిస్తారట. అందువల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, వివాదాలు సమసిపోయి ప్రశాంతంగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.
దీపదానాలు చేయడం:
ఈమాసంలో చేయాల్సిన మరో ముఖ్యమైన పని దీపాలను వెలిగించడం మాత్రమే కాదు దీపదానాన్ని చేయాలి. దీపదానం గురించి కార్తిక పురాణంలో ప్రముఖంగా చెప్పబడింది. బియ్యం పిండితో తయారు చేసిన దీపంలో ఆవునెయ్యి వేసి అందులో పూవత్తిని ఉంచి దానం చేయాలి.
లేదా ఉసిరికదీపాన్ని దానం చేయడం, బ్రాహ్మణుడికి స్వయం పాకం , వస్త్రాదులతో సత్కరించడం వల్ల దానితోపాటుగా పవిత్ర నదులలో ఉదయం లేదా సాయంతరం దీపాలను వదలడం వల్ల పుణ్య ఫలితాలు దొరుకుతాయి.