kodikatti case : కోడి కత్తి కేసు విచారణ ఆలస్యానికి అసలు కారకులు..నిందితునికి నో బెయిల్.. విచారణ 15కు వాయిదా
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ విమానాశ్రయంలో ఆయన పై కోడి కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఆ కేసుపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ జరుపుతోంది. ఈ కేసులో శ్రీనివాసరావు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసు హై కోర్ట్ లో విచారణకు వచ్చింది.
నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన క్రిమినల్ అప్పీలు విచారణకు వచ్చిన సందర్భంగా ఎన్‌ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. కోడికత్తి కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ నిందితుడు శ్రీనివాసరావు కోరుతున్నాడు.
నిందితుడి తరఫు సీనియర్ న్యాయవాది త్రిదీప్ ఈ కేసును వాదిస్తున్నారు. ఈ కేసు విషయంలో జాప్యం జరగడం అనేది తమ వల్ల కాదని, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య మంత్రి ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలనీ కోరడంతోనే ఆలస్యం అవుతోందని ఎన్.ఐ.ఏ పేర్కొంది.
ఇక కేసుకు సంబంధించి నిందితుడు జూపల్లి శ్రీనివాసరావు పై 2019 జనవరి 23న అభియోగపత్రం దాఖలైంది. 2022 జులైలోనే శ్రీనివాసరావుపై ఎన్‌ఐఏ కోర్టు అభియోగాలను నమోదు చేసింది.
దీనికి సంబంధించిన విచారణ 2023 మార్చి 7న ప్రారంభమైంది. పైగా తన పై జరిగిన దాడి కేసులో లోతైన విచారణ చేపట్టాలని సీఎం జగన్ ఒక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
కానీ ఎన్‌ఐఏ కోర్టు దానిని కొట్టివేసింది. దీంతో జగన్ హై కోర్ట్ ను ఆశ్రయించారు. తన అప్పీలును పరిష్కరించే వరకు కూడా కోడి కత్తి కేసును దిగువ కోర్టు లో విచారణను నిలుపుదల చేయాలని కోరారు.
జగన్ అప్పీలును పరిగణలోకి తీసుకున్న ఏపీ ఉన్నత న్యాయస్థానం విచారణను 8 వారాలపాటు నిలుపుదల చేయాలనీ చెబుతూ గత నెల 17వ తేదీన మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అందుకే విచారణ జాప్యం అవుతోందని ఎన్.ఐ.ఏ తెలిపింది.
గతంలో విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు నిందితుడికి బెయిలు మంజూరు చేసినప్పటికీ ఆ ఉత్తర్వులను ఎన్.ఐ.ఏ హై కోర్ట్ లో సవాల్ చేసింది. దీంతో విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్ ను ఏపీ హై కోర్ట్ రద్దు చేసింది.
ఇప్పటివరకు చూస్తే నిందితుడు 9 పర్యాయాలు బెయిల్ కోసం అప్పీలు చేసుకున్నాడు. అయితే తాజాగా వేసిన పిటిషన్ ను విశాఖ ఎన్.ఐ.ఏ కోర్ట్ కొట్టి వేసింది.
ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు తన పై 307 సెక్షన్ ను నమోదు చేయడం పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. కానీ ఈ కేసులో సాక్షులు చెప్పిన వివరాలు ఎలా ఉన్నాయంటే.. నిందితుడు కోడి కత్తి తో జగన్ మెడపై పొడవాలనే లక్ష్యంతోనే దాడికి దిగాడని వాంగ్మూలం ఇచ్చారు.
దీంతో ఎన్.ఐ.ఏ ఒక కీలక విషయాన్నీ బయటపెట్టింది. దాడి చేయడం వల్ల ప్రాణాపాయం ఉంటుంది అన్న విషయం నిందితుడిని తెలిస్తే 307 సెక్షన్ వర్తింపజేయవచ్చని చెబుతున్నారు.
కనుక ఇలాంటి కీలక సమయంలో నిందితునికి బెయిల్ ఇస్తే అతను పరారయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని చెబుతోంది. అందుకోసమే శ్రీనివాసరావు అప్పీలును కొట్టేయాలంటూ ఎన్‌ఐఏ ఇన్‌స్పెక్టర్, చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బీవీ శశిరేఖ కౌంటర్ దాఖలు చేశారు.
ఈ కేసులో నిందితుని తరుపు న్యాయవాది ఆన్‌లైన్‌లో విచారణకు హాజరయ్యారు. ఎన్‌ఐఏ కౌంటర్ ను తాను పరిశీలించాలని, తదుపరి విచారణకు భౌతికంగా హాజరై వాదనలు వినిపిస్తానని పేర్కొన్నారు.
ఇందు కోసం అయన కోర్టును వాయిదా కోరగా, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.