రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాలంటే అది కృష్ణా గుంటూరు జిల్లాల నుండే మొదలవుతుందని అంటారు. రాజకీయాల టర్నింగ్ రిటర్నింగుల మాట అటుంచితే ప్రస్తుతం ఉమ్మడి కృష్ణ జిల్లా లోని విజయవాడ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. 2024 ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు పెట్టుకోవడం తో టికెట్ల కేటాయింపు విషయంలో అసమ్మతి సెగ రేపుతోంది. ఆ సెగ సమ్మర్ హీట్ కన్నా హాట్ హాట్ గా నడుస్తోంది. ఇప్పటి వరకు జనసేన పార్టీలో ఉండి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన పోతిన మహేష్ తనకు విజయవాడ పశ్చిమ టికెట్ రాదని తేలిపోవడంతో ఆ పార్టీని వీడారు. వీడటమే కాదు పూర్తిగా తెగతెంపులు చేసుకుని రెండు రోజుల క్రితం తన అనుచరులతో సహా బయటకు వచ్చేశారు. రాబోయే రోజుల్లో మాట తప్పని మడమ తిప్పని నేత వెంట నడుస్తా అంటూ తాను చేరబోయేది వైసీపీ లోనే అంటూ చిన్న హింట్ కూడా ఇచ్చారు. విజయవాడ పశ్చిమ టికెట్ తనకు ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ నేత అయిన సుజనా చౌదరికి ఇవ్వడం పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
తాజాగా నేడు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో అయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. జగన్ కూడా పోతిన మహేష్ కు అయన ఫాలోవర్లకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అయన పార్టీ మీద నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ ఒక ఒక నటుల సంఘమని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పెత్తందారుల కూటమిలో చేరారని అన్నారు. తాను ఇంకా జనసేనలో కొనసాగితే తన కార్యకర్తల భావిష్యత్తుకు ఉరి వేసినట్టేనని అన్నారు. జనసేనలో ఉండగా తన వ్యక్తిత్వాన్ని హత్య చేశారని దుయ్యబట్టారు. తాను ఒకప్పుడు కేవలం రాజకీయ కారణాల వల్లనే వైసీపీ నేతలను విమర్శించాను తప్ప తనకు అన్యదా భావం లేదన్నారు. విజయవాడ పశ్చిమలో పోటీ కి దిగిన అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యమని, సుజనా చౌదరిని ఖచ్చితంగా ఓడిస్తామని పోతిన భీషణ ప్రతిన బూనారు.
అయితే పోతిన ఇలా ప్రెస్ మీట్ పెట్టారో లేదో అలా ఆయనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. తాను ఒకప్పుడు జనసేనలో ఉండగా కొన్ని ప్రగల్భాలు పలికారు. తాను భవిష్యత్తులో వేరే పార్టీ లోకి వెళ్లి వేరే జండా పట్టుకుంటే తన చేతిని కొబ్బరిబోండాలు కొట్టే కత్తి తో నరికి వేయాలని అన్నారు. కాగా ఇప్పుడు అయన వైసీపీ లోకి వెళ్లడం తో ఇంటర్ నెట్ లో ఆ వీడియో హల్చల్ చేస్తోంది. అంతే కాదు, పోతిన మహెష్ కి నిజంగా ఎన్నికల బరిలో నిలవాలని ఉంటె, అయన ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి తప్ప, ఇలా వేరే పార్టీ జండాలు మోస్తున్నారు అంటూ విమర్శించడం తగదని జనసైనికులు సూచిస్తున్నారు. జనసేన పార్టీ వారితో పవన్ వేరే పార్టీ జండాలు మోయించడం తప్పైతే, అయన పార్టీ మారడం కూడా అనైతికం అవుతుంది కదా అని అంటున్నారు. ఇక పోతిన మహేష్ జనసేన పార్టీని నటుల సంఘమని అని విమర్శించడం ఎంతమాత్రమూ తగదని అంటున్నారు, నిన్నటివరకు ఆపార్టీ లో ఉన్నప్పుడు తెలియదా అది నటుల సంఘమని నిలదీస్తున్నారు. ఒక వేళ తనకి విజయవాడ పశ్చిమ టికెట్ కేటాయించి ఉంటె అయన అదే నటుల సంఘంలో ఒక నటుడిగా కొనసాగి ఉండేవాడా అని చురకలంటిస్తున్నారు. తాజాగా వైసీపీ లో చేరిన తరువాత పెత్తందార్లు పేదలు అనే వ్యత్యాసం కొత్తగా తెలిసివచ్చిందా అని అంటున్నారు. టిక్కెట్టు దక్కి ఉంటె పోతిన కూడా అదే పెత్తందారు అయ్యి ఉండేవాడా అని విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు పెత్తందారుల పార్టీలో ఎందుకు కొనసాగారు ఏ స్వార్ధంతో కొనసాగారో చెప్పాలని జనసైనికులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు