Medaram jatara : అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల కోసం తగిన అన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేస్తోంది.
అంతేకాకుండా జాతరకు వచ్చే భక్తులను అన్ని ప్రాంతాలకి చేరవేయడానికి 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతాయని తెలంగాన ప్రభుత్వం ప్రకటించింది.
భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలంగాణ రోడ్డు రవాణా సంస్ధ ఓ ప్రకటన విడుదల జేసింది .మేడారంలో 55 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్, బేస్ క్యాంప్, 48 క్యూ లైన్స్ ని వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు మాట్లాడుతూ… మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జాతరకు మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నందున ఆ మేరకు చర్యలు తీసుకోవాలని వారు నిర్దేశించారు.
మేడారం జాతరలో దాదాపు 14 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తారని వారికి వసతి, భోజనం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. సాధారణంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మేడారానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని,మేడారం జాతరను టీఎస్ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ జాతరకు 30 లక్షల మంది భక్తులు వస్తారని టీఎస్ఆర్టీసీ అంచనా వేస్తోందని, రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.